ఏ దేవుడికీ కనిపించినంత వైభవం వినాయకుడికే కనిపిస్తూ ఉంది. వీధికోచోట ప్రతిమతో పూజలను అందుకునే అవకాశం వినాయకుడికే సొంతం అవుతూ ఉంది. ప్రతియేటా వినాయక ఉత్సవాల పరిధి విస్తృతం అవుతూ ఉంది. భారీఎత్తున విగ్రహాలతో, రంగురంగుల ప్రతిమలతో వినాయకుడిని భక్తులు కొలుస్తూ ఉన్నారు.
వినాయక ప్రతిమల ఏర్పాటులోనూ గొప్ప క్రియేటివిటినే దర్శనమిస్తూ ఉంది. ఇలా వినాయక చవితికన్నుల పండువగా ముగిసింది. ఇక ఈసారి కూడా వినాయక చవితి సందర్భంగా కొన్ని రొటీన్ విన్నపాలు వినిపించాయి. మట్టి వినాయకుడినే పూజిద్దాం, సహజమైన రంగుల వినాయకుడినే ఆరాధిద్దాం అని అనేకమంది పిలుపునిచ్చారు. సెలబ్రిటీలు, సినీతారలు.. ప్రజలకు ఈ మేరకు పిలుపునిచ్చారు.
అయితే మట్టి వినాయకుడు ఎక్కడో కానీ కనిపించలేదు. ఇళ్లలో పూజించే గణపతి విగ్రహాల్లో మట్టి విగ్రహాల శాతం అయితే పెరగడం ఆనందకరమైన అంశం. అయితే భారీ విగ్రహాలను మట్టితో చేయించుకునే ప్రయత్నాలు జరగలేదు. యథారీతిన ఆ విషయంలో రాజీపడకుండానే ఈసారి కూడా పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇంతవరకూ కూడా బాగానే ఉంది కానీ, వినాయకమండపాలే మరీ సినిమా పాటల కేంద్రాలుగా మారాయి. భక్తితో పండగ జరుపుకోవాలని సంప్రదాయ వాదులం అనుకుంటాం. అయితే సినిమా పాటలు, చిల్లర డ్యాన్సులే వినాయక చవితి సంప్రదాయంగా మారిపోయాయి. ఇక నిమజ్జనం సందర్భంగా చాలాచోట్ల.. తాగి ఊగడం సంబరంగా నిలిచింది! ఈ సన్నివేశాలన్నీ చూశాకా.. ఇంతకీ వినాయక చవితిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు? అనే సందేహం వస్తే తప్పు మనదికాదు.
వినాయక మండపంలో ఒక భక్తో, భజనో కనిపించాలి కానీ.. ఇస్మార్ట్ శంకర్ పాటలు వినాయకుడి భజనలా? ఇదే మండపాల్లో అంతరించిపోతున్న కళల ప్రదర్శనకు అవకాశం ఇస్తే.. ఒక హరికథో, బుర్రకథో, యక్షగానమో.. చెప్పిస్తే? తోలుబొమ్మలాటతో రామయాణాన్నో, భారతానో విశదీకరిస్తే? అదికాదా అసలైన వినాయకచవితి? వీర హిందుత్వవాదులు ఇలా ఎందుకు ఆలోచించరో మరి!