జనసేనాని పవన్‌కల్యాణ్‌ను సీఎం వైఎస్ జగన్ ఏదో మాయ చేసినట్టున్నాడు. ఏదో మందు ఇచ్చి పవన్‌ను వశపరచుకు న్నట్టున్నాడు. ఈ కారణాలే కాకపోతే సీఎం వైఎస్ జగన్‌ను పవన్ తరచూ ప్రశంసలతో ముంచెత్తడం ఏంటి? ఇదో ఎనిమిదో వింతగా లేదా? అసలు జనసేన శ్రేణులకే పవన్ రాజకీయ పంథా అర్థం కావడం లేదు.
జగన్ సీఎంగా సీట్లో సరిగా కూచోకుండానే మొట్ట మొదట వ్యతిరేక జెండా ఎగుర వేసిందే పవన్‌కల్యాణ్. గత ఏడాది నవంబర్ 3న లాంగ్‌మార్చ్ పేరుతో అప్పుడప్పుడే ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేనాని కదం తొక్కాడు. ఆ సభలో జగన్ గురించి పవన్ ఏమన్నాడో తెలుసుకుందాం.
‘జగన్ అద్భుతమైన పాలన అందిస్తే నేను రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటాను. సగటు రాజకీయ నాయకులు ప్రజల పట్ల నిజంగా బాధ్యతగా ఉండుంటే…నేను పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. రాష్ట్రాన్ని పరిపాలించడం ఎంత కష్టమో నాకు తెలుసు. జగన్‌పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషమూ లేదు. ఆయన గొప్ప నాయకుడైతే సంతోషిస్తాను’ అని వేలాది మంది జనసైనికుల సమక్షంలో పవన్ వీరావేశంతో అన్నాడు.
విశాఖ ఎల్జీ పాలీమర్స్ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించినా ప్రశంసాపూర్వకంగా పవన్ పళ్లెత్తు మాట అనలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబైతే కాస్తా ముందుకెళ్లి…కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా అని కూడా ప్రశ్నించి అభాసుపాలయ్యాడు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా జగన్ పాలనపై పవన్ స్వరం మారుతోంది.
గత నెల 20న టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ స్పందించాడు.
‘పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకుంది. నిపుణులతో చర్చించి…పొరుగు రాష్ట్రాల నిర్ణయాలను అధ్యయనం చేశాకే పది పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని జనసేన కోరింది. ఈ విషయంలో సహేతుకంగా స్పందించిన ప్రభుత్వానికి జనసేన తరపున అభినందనలు’
తాజాగా 104, 108 అంబులెన్స్‌లను పెద్ద ఎత్తున జగన్ సర్కార్ తీసుకొచ్చి దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. దీనికి భిన్నంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం అవినీతి ఆరోపణలతో తన నైజాన్ని చాటుకుంటోంది. అయితే జనసేనాని పవన్ స్పందన వైసీపీని కూడా ఆశ్చర్యపరుస్తోంది.
‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్స్‌లని , ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. అలాగే గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా , ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం’
అంతెందుకు టెన్త్ పరీక్షల రద్దు సందర్భంగా చేసిన ట్వీట్, తాజా ట్వీట్‌కు కూడా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. టెన్త్ పరీక్షలను రద్దు చేసిన ఏపీ సర్కార్‌ను పవన్ అభినందించినప్పటికీ…అది తన క్రెడిట్ కింద వేసుకునేందుకు యత్నించాడు. అంతేకాదు, ఆ ట్వీట్లో రాష్ట్ర ప్రభుత్వం అని పేర్కొన్నాడే తప్ప ఎక్కడా సీఎం జగన్ పేరు ప్రస్తావించలేదు. కానీ తాజా ట్వీట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌రెడ్డి గారు అని సంబోధించడం ద్వారా తన వైఖరిని మార్చుకున్నట్టు స్పష్టమవుతోంది.
గతంలో జగన్‌ను అసలు సీఎంగానే గుర్తించనని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో జగన్ సర్కార్ పనితీరును పవన్ ప్రశంసించడం పవన్ గౌరవాన్ని పెంచిందని చెప్పొచ్చు. అలాగే జగన్ సర్కార్‌కు వెలకట్ట లేని నైతిక బలం ఇచ్చినట్టే. ఎందుకంటే పవన్ అంటే ప్రత్యర్థి కాదు…శత్రువనే భావన వైసీపీలో ఉంది. అలాంటి శత్రువు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఆ కిక్కే వేరు కదా.
విశాఖ సభలో జగన్ అద్భుతమైన పాలన అందిస్తే తాను రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటాననే మాటే నిజమ య్యేలా ఉందేమో ఎవరు చూశారు. ఎందుకంటే పవన్ కోరుకుంటున్న పాలన జగన్ అందిస్తున్నాడనేందుకు…జనసేనానిలోని మార్పు ప్రతిబింబిస్తోంది.
-సొదుం