సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఒక ఇబ్బంది ఉంది. అదేమిటంటే … వాళ్ళు సినిమాలు వదులుకోలేరు. రాజకీయాలూ వదలుకోలేరు. మనం చెప్పుకునేది చోటా సినిమా నటుల గురించి కాదు. మెగాస్టార్లు, పవర్ స్టార్లు. సూపర్ స్టార్లు ..ఈ కేటగిరీ హీరోల గురించి. ఇలాంటివారు ఏవేవో ఊహించుకొని రాజకీయాల్లోకి వస్తారు. తమ స్టార్ డమ్ ను, ఇమేజ్ ను క్యాష్ చేసుకోవచ్చని అనుకుంటారు. కొందరు క్లిక్ అవుతారు. కొందరు కారు.
మెగా స్టార్ చిరంజీవి ఏదో అయిపోదామని రాజకీయాల్లోకి వచ్చాడు. సొంతంగా పార్టీ పెట్టాడు. సినిమాలను పక్కకు పెట్టాడు. రాజకీయాల్లో కాస్త సీరియస్ గానే ఉన్నాడు. ఎన్నికల్లో 18 సీట్లు సాధించాడు. ముఖ్యమంత్రి అవుదామనుకున్నాడు. కాలేకపోయాడు. పార్టీనీ కాంగ్రెస్ లో కలిపేసి కేంద్ర సహాయ మంత్రి పదవితో అడ్జస్ట్ అయిపోయాడు. తన రాజ్యసభ పదవీకాలం అయిపోగానే రాజకీయాలకు స్వస్తి చెప్పాడు. మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయాడు.
చిరంజీవికి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఉన్న తేడా ఏమిటంటే ఈయన రెండు పడవల్లో ఏక కాలంలో ప్రయాణిస్తున్నాడు. మరో విషయం ఏమిటంటే రాజకీయాల్లోకంటే సినిమాల్లో సీరియస్ గా ఉన్నాడు. రెండు చోట్ల గెలిచిన చిరంజీవి కొన్ని సీట్లైనా సాధించాడు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ రెండు చోట్లా ఓడిపోవడమే కాకుండా ఒక్క సీటునే గెలిపించుకున్నాడు. గెలిచినాయన కూడా పవన్ కు దక్కలేదనుకోండి. అది వేరే విషయం.
తాను ఇక సినిమాల్లో నటించనని ఒకప్పుడు పవన్ అన్నాడు. కానీ ఆ మాట అన్న తరువాత నటించడం ఎక్కువైంది. దానికి పవన్ చెప్పుకున్నదేమంటే రాజకీయ పార్టీ నడపాలంటే డబ్బు కావాలి. తనకు సినిమాల్లో నటించడం తప్ప వేరే పని చేతకాదు కాబట్టి తప్పనిసరిగా నటిస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్ దుమ్ము రేపుతోంది. పవన్ కళ్యాణ్ మీద పగ తీర్చుకుందామని సీఎం జగన్ అనుకుంటే ఆయన మీద పవనే పగ తీర్చుకున్నాడని అనిపిస్తోంది.
ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతోంది. కొందరు వైసీపీ మంత్రులు భీమ్లా నాయక్ ఫ్లాప్ అంటున్నారుగానీ వాస్తవం ఏమిటో వారికీ తెలుసు. మలయాళంలో సూపర్ హిట్ అయిన “అయ్యప్పనుమ్ కోషియం” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా బాగా వచ్చింది అంటూ అభిమానులు సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే దీనికి ముందు పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” కూడా హిందీలో సూపర్ హిట్టయిన “పింక్” సినిమాకి రీమేక్.
తాజాగా పవన్ “వినొదయ సీతం” ఒక సినిమాని రీమేక్ చేసేందుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు తమిళ్ లో సూపర్ హిట్ అయిన, విజయ్ హీరోగా నటించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా మారిన “తెరి” సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ “సాహో” సినిమాకి దర్శకత్వం వహించిన సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమా కాకుండా మరో వైపు పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో “హరి హర వీర మల్లు” తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం మీద సినిమాల్లో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు జనసేనాని. నాకొక్క ఆవకాశం ఇవ్వండి అంటూ ఈ మధ్యనే ఒక బహిరంగ సభలో జనాలను అడిగాడు జనసేనాధినేత. మరి జనం పవన్ ను ఇలాగే సినిమా హీరోగానే చూడాలనుకుంటారా? పొలిటికల్ హీరోగా కూడా చూడాలనుకుంటారా?