తెలంగాణా ప్రజలకు వేరే పని లేదా ?

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచిత్రంగా మాట్లాడుతుంటాడు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే ధోరణి. అందుకే ఆయన ఉపన్యాసాలు ప్రవచనాల మాదిరిగా ఉంటాయి తప్ప ఓ రాజకీయ నాయకుడు…

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచిత్రంగా మాట్లాడుతుంటాడు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే ధోరణి. అందుకే ఆయన ఉపన్యాసాలు ప్రవచనాల మాదిరిగా ఉంటాయి తప్ప ఓ రాజకీయ నాయకుడు మాట్లాడినట్లుగా ఉండదు. ఏపీ కంటే తెలంగాణలో ముందే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ రాష్ట్రం మీద కన్నేసినట్లుగా ఉంది. 

చాలా కాలం తరువాత ఆయన హైదరాబాద్ కు వచ్చి కార్యకర్తలతో మీటింగ్ పెట్టాడు. సహజంగానే తెలంగాణను పొగిడాడు. తెలంగాణా పోరాట స్ఫూర్తే  జనసేన పార్టీ పెట్టడానికి కారణమన్నాడు. తెలంగాణా ఉద్యమమే తన గుండెల్లో ధైర్యం నింపిందన్నాడు.

మరి హైదరాబాదుకు వచ్చి మాట్లాడినప్పుడు తెలంగాణా గురించి ఆ మాత్రం చెప్పకపోతే ఎలా? అయితే పవన్ విచిత్రంగా ఓ మాటన్నాడు. పార్టీ పెట్టి ఇన్నేళ్లయింది. తెలంగాణాకు ఎందుకు రావడం లేదని జనం అడుగుతున్నారట. 

తెలంగాణా ప్రజలు పిలిచేవరకు తాను రానని చెప్పాడు. తనను గురించి తెలంగాణా ప్రజలు పట్టించుకోవడం లేదని అలా అన్నాడా? తెలంగాణా మీద అలిగాడా ? ప్రజలు రమ్మంటే వస్తానని చెప్పడమేమిటో ఆయనకే అర్ధం కావాలి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలన్నాడు.

గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమై చివరి నిమిషంలో మానుకున్నాడు కదా. అప్పుడు ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు అడిగారా ? ఆ తరువాత మానుకోమని జనం చెప్పారా? తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోరాటం చేయాలనుకుంటే చేయడమే. 

అంత సత్తా లేదనుకుంటే మానుకోవడమే. అది పవన్ ఇష్టం. జనం పూలు చల్లి ఆహ్వానించరు. తెలంగాణా ఉద్యమాన్ని బ్రహ్మాండంగా నడిపిన కోదండ రామ్ పార్టీనే జనం పట్టించుకోవడంలేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టాలని జనం ఆయనను అడగలేదు.
 
వైఎస్ షర్మిలను తెలంగాణాకు వచ్చి పార్టీ పెట్టాలని జనం అడిగారా? తెలంగాణలో పరిస్థితి అనుకూలంగా లేక ఆంధ్రాకు పరిమితమయ్యాడు పవన్. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన, హైదరాబాద్ ను అంతో ఇంతో డెవెలప్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును జనం రమ్మంటున్నారా? రాష్ట్రం విడిపోయాక టీడీపీ అడ్రసు లేకుండా పోయింది కదా.

తెలంగాణలో పార్టీ నడపలేక ఏపీ సీఎం వైఎస్ జగన్ దుకాణం బంద్ చేసుకున్నాడు కదా. వాళ్ళ కంటే పవన్ బలవంతుడేమీ కాదు. రాజకీయాలు చేయడం సులభం కాదన్న పవన్ ఒకవేళ జనం రమ్మన్నా వచ్చి రాజకీయాలు చేయగలడా? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రాలో బలపడితే చాలు. అక్కడ జగన్  ను ఎదుర్కొంటే చాలు. తెలంగాణా సంగతి తరువాత చూసుకోవచ్చు. కేసీఆర్ సంగతి కాంగ్రెస్, బీజేపీ చూసుకుంటాయి.