2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓడిపోయారు. ఆయనతో పాటు ఆ పార్టీ తరపున పోటీ చేసిన స్వయం ప్రకటిత మహామహులంతా మట్టికరిచారు. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కరే గాజు గ్లాసు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ గెలుపులో పవన్ కల్యాణ్ కి సంతోషం లేదు.
తాను ఓడిపోవడం పరువు తక్కువ అనుకునే సమయంలో, తన పేరు చెప్పుకుని, తన పార్టీ గుర్తుతో మరొకరు గెలవడం మరింత ఇబ్బందిగా తోచింది. అందుకే ఇగో ప్రాబ్లమ్ తో రాపాకని కొన్నిరోజులకే దూరం చేసుకున్నారు. ఆ అహాన్ని పవన్ ఇంకా దూరం చేసుకోలేకపోవడమే ఆయన మైనస్ పాయింట్.
ఎంపీటీసీ, జడ్పీటీసీలను అభినందించలేరా..?
పరిషత్ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఏకపక్షం అయినా.. ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు విజేతల్ని పిలిచి అభినందించారు. అందరినీ పార్టీ ఆఫీస్ లకు పిలిపించి సత్కరించారు. కలసి కట్టుగా ఉండాలని, పార్టీ ఉన్నతి కోసం కృషి చేయాలని సూచించారు. టీడీపీలో కూడా గెలిచిన చోట్ల హడావిడి కనిపించింది. కానీ జనసేన విషయంలో మాత్రమే నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
ఫలితాలు వచ్చిన ఒకరోజు తర్వాత బయటకొచ్చిన పవన్ కల్యాణ్.. అందరికీ శుభాకాంక్షలు అంటూనే, పూర్తి సమాచారంతో మరో రెండు రోజుల తర్వాత స్పందిస్తానన్నారు. 177 ఎంపీటీసీ, రెండు జడ్పీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచారనే సమాచారం తన వద్ద ఉందని చెప్పిన పవన్, కనీసం వారిని మనస్ఫూర్తిగా అభినందించలేదు.
జనసేనాని విడుదల చేసిన వీడియో సందేశంలో.. ఆయన మొహంలో సంతోషం అస్సలు కనిపించలేదంటే జలసీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం అందర్నీ పిలిచి ఓ సమావేశం ఏర్పాటు చేయలేదు. స్థానిక నాయకులకయినా ఆ దిశగా మార్గదర్శకాలివ్వలేదు.
విజేతలంటే అంత కడుపుమంట ఎందుకు..?
జనసేనాని ఓడిపోయినా.. జనసైనికులు గెలిచారన్న సంతోషం పవన్ కల్యాణ్ లో ఏ కోశానా కనిపించలేదు. కనీసం వచ్చే ఎన్నికలనాటికయినా పార్టీ బలపడుతుందనే భావన సంతోషం ఆయనలో లేదు. కారణం, తాను ఓడిపోవడం, తన అనుచరులు గెలవడం. ఆ ఇగోతోనే ఆయన చాలామందిని దూరం చేసుకున్నారు. ఉన్న ఏకైక ఎమ్మెల్యేకి పొమ్మనలేక పొగబెట్టారు. పార్టీలో ఉన్నన్ని రోజులు అవమానించి బయటకు పంపించేశారు.
పవన్ కల్యాణ్ ఈ విషయంలో చాలా మారాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఆయన సహచరులు. విజేతల్ని మనస్ఫూర్తిగా అభినందించి, ఆదరిస్తేనే మరింత మందికి ప్రోత్సాహం ఇచ్చినట్టవుతుందని చెబుతున్నారు.