పేరుకు జనసేనానే తప్ప, ఆయన కాపుసేనానిగా మిగిలిపోనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. పవన్‌కల్యాణ్, వైసీపీ మధ్య వివాదంలో ఆయన మరోసారి ఒంటరయ్యారు.
సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్లైన్లో అమ్మాలనే నిర్ణయం నేపథ్యంలో పవన్ తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఇది కాస్తా చినికిచినికి గాలివానగా మారినట్టు పవన్, పోసాని మధ్య వ్యక్తిగత విషయంగా మారింది.
తన కుటుంబ సభ్యులపై పవన్ అభిమానులు అసభ్య దూషణలతో దాడి చేస్తున్నారంటూ పోసాని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తిగత దూషణలకు పోసాని తెగబడ్డారు. ఈ నేపథ్యంలో కొందరు కాపు సంఘాల నాయకులమంటూ తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పవన్‌కల్యాణ్‌ను కాపు మంత్రులు తిట్టడం వెనుక సీఎం జగన్ హస్తం ఉందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య అన్నారు. పవన్‌ను అవమానించడం అంటే కాపు సమాజాన్ని అవమానించడం గానే భావించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇలాంటి నీచమైన చర్యల పర్యవసానం 2024లో సీఎం జగన్ చూస్తారని ఆయన హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాపు సంక్షేమ సేన, రాయలసీమ బలిజ మహాసంఘం పేర్లతో మరికొందరు పవన్‌ను కులనాయకుడిగా ఆవిష్కరించారు.
ఈ ధోరణే పవన్‌కల్యాణ్‌కు నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాపు అంటే పవన్ మాత్రమేనా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పవన్‌కల్యాణ్ సినీ ఫంక్షన్లో మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి సన్నాసి అని విమర్శంచడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
నాని కాపు కాదా? అని నిలదీస్తున్నారు. నిఖార్పైన కాపు నాయకుడైన నానిని పవన్‌కల్యాణ్ విమర్శిస్తుంటే, అప్పుడు ఈ కాపు నాయకులు ఏమయ్యారనే నిలదీతలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ వివాదాన్ని మొదలు పెట్టిందే పవన్‌కల్యాణ్ అని గుర్తు చేస్తున్నారు.
రాజకీయాల్లో రాణించాలంటే అన్ని కులాలు, మతాల ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలి. కానీ కాపులు పదేపదే పవన్ కల్యాణ్ తమ కులపెద్ద అన్నట్టు ప్రత్యర్థులకు హెచ్చరిక చేయడం వల్ల ఇతరులు దూరం చేస్తున్నామనే ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నారని చెబుతున్నారు.
ఒకవైపు తాను కాపు కానే కాదని పవన్ చెబుతుంటే, ఆ సంఘం నాయకులు మాత్రం పవన్‌ను తమ కుల నాయకుడిగానే గుర్తించడంతో పాటు అందుకు తగ్గట్టు ప్రకటనలు ఇవ్వడం విమర్శలకు దారి తీస్తోంది. మొత్తానికి పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా ఆయన కులమే మరోసారి ముంచనుందనే అభిప్రాయాలున్నాయి.