చంద్రబాబు హయాంలో జరిగిన ఘాతుకాల గురించి వైఎస్ జగన్ హయాంలో మాట్లాడటం పవన్ కల్యాణ్ కు పరిపాటిగా మారింది. ఇప్పటికే పలు అంశాల్లో పవన్ ఇలా స్పందించి ఇరుక్కున్నాడు. 2017-18లలో జరిగిన అంశాలను పవన్ ఇటీవల ప్రస్తావిస్తూ ఉన్నారు. అప్పటి ప్రభుత్వం తొక్కి పెట్టిన అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని పవన్ కల్యాణ్ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో సుగాలి ప్రీతి పై అత్యాచారం అంశం ఒకటి.
ఈ అంశం గురించి పవన్ కల్యాణ్ పోరాటానికి రెడీ అవుతున్నారు. ధర్నా, ర్యాలీ ఉంటాయట. ఇక పవన్ కల్యాణ్ వీరావేశంతో చెప్పబోయే డైలాగులు కూడా ఉండబోతాయి. జగన్ ఎంత, జగన్ ఎమ్మెల్యేలు ఎంత.. అంటూ పవన్ మాట్లాడవచ్చు. పవన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కొత్త ఏమీ కాదు. మూడు పెళ్లిళ్ల పవన్ కల్యాణ్.. ఇలా ఒక అమ్మాయి తరఫున మాట్లాడితే అందులో చాలా వింతే ఉంటుంది. అంతకన్నా వింత ఏమిటంటే.. మూడేళ్ల తర్వాత పవన్ ఈ అంశం గురించి పోరాటానికి దిగడం.
సుగాలి ప్రీతి పై అత్యాచారం జరిగింది ఇప్పుడు కాదు. 2017లో ఆమె బలయ్యిందని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. అంతే కాదు.. అప్పట్లో ఈ విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చింది తెలుగుదేశం నేతల మీదే. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ కేసులో ఫిర్యాదులు కూడా వారి మీదే నమోదయ్యాయి. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో ఆ కేసును అప్పుడు తొక్కిపెట్టారని తెలుస్తోంది. నిందితులు తెలుగుదేశం పార్టీ వాళ్లు కావడంతో కేసును పక్కదారి పట్టించినట్టుగా తెలుస్తోంది.
దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా..2017లో జరిగిన ఘాతుకం మీద ఇప్పుడు జనసేన స్పందిస్తూ ఉంది. పవన్ కల్యాణ్ వీధుల్లోకి వచ్చి కవాతు చేయబోతూ ఉన్నారు. చంద్రబాబు హయాంలో కూడా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇంతే ఆవేధన వ్యక్తం చేశారు. కానీ అప్పుడు పవన్ కు మనసు రాలేదు. చంద్రబాబు హయాంలో జరిగిన ఘాతుకం గురించి ఇప్పుడు స్పందించి పవన్ కల్యాణ్.. ఒక అమ్మాయిపై జరిగిన ఘాతుకం నుంచి తన రాజకీయ ప్రయోజనాలను పొందాలనే అత్యంత కుటిలమైన వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నాడు.