పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి వెలుగులో లోకానికి పరిచయమైన వ్యక్తి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి ఇంటినుంచి మరొక నటుడు వస్తున్నాడన్న ఆనందంతో 1996లో చిరంజీవి అభిమానులే భుజానికెత్తుకుని పవన్ ని స్టార్ ని చేసారు.
వరసగా సినిమాలొచ్చాయి. కథాబలం వల్ల కొంత, ఫ్యాన్స్ మోయడం వల్ల కొంత కొన్ని సినిమాలు ఆడాయి. కానీ తన కెరీర్లో అత్యధిక సినిమాలు అట్టర్ ఫ్లాపులే.
సొంతంగా ఎదిగే లక్షణాలు అస్సలు లేని వాడు. పెద్ద చెప్పుకోదగ్గ నటుడు కూడా కాదు. అన్నగారిలా డ్యాన్సులు చెయ్యలేడు. అయినా సరే చిరంజీవి తమ్ముడన్న ఏకైక అర్హత వల్లనే అతను లిస్టులోంచి ఎగిరిపోకుండా ఉన్నాడు.
కాలక్రమంలో అన్నగారు పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆయన ఆ పార్టీని కాంగ్రెసులోకి విలీనం చేసేసాక ఇతనే సొంత పార్టీ పెట్టాడు. ఏదో ఒక రాజకీయ శూన్యత రాకపోతుందా, తాను పవర్లోకి రాకపోతానా అనే ఆశతోనో; పవర్లోకి రాకపోయినా పర్వాలేదు…కాస్త ఓట్లు చీల్చగలిగే స్థానంలో ఉన్నా ఏదో ఒక పార్టీనుంచి ఎంతో కొంత ప్యాకేజీ వస్తుందన్న ఆలోచనతోనో రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.
కుటుంబ బలం వల్ల కెరీర్ ని, పాపులారిటీని సంపాదించుకున్న పవన్ కల్యాణ్ ఏయే కారణాలవల్ల తాను స్వశక్తితో కోరుకున్నవి పొందలేకపోతున్నాడో విశ్లేషించుకుందాం.
ఈ విశ్లేషణ మానసిక వైద్య నిపుణుడో, మానసిక శాస్త్రవేత్తో చేస్తున్నది కాదు. వీరాభిమానికాని ఒక సగటు మనిషి పవన్ కళ్యాణ్ ని చూసి గమనించిన విషయాలు మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది.
1. ఆరంభ శూరత్వం:
ఏది మొదలుపెట్టినా ఆదిలోనే ఆపేస్తాడు. ఇది స్వయంగా తానే ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
తనకి కొన్నాళ్లు మార్షల్ ఆర్ట్స్ మీద ఆసక్తితో నేర్చున్నానని, అంతలోనే దాని మీద ఆసక్తిపోయి వ్యవసాయం మీదకి దృష్టి మళ్ళేదని, అంతలోనే దాన్ని వదిలేసి మరొక దాని మీదకి వెళ్ళిపోయేవాడినని చెప్పాడు. ఇది మానసికంగా చైల్డిష్ స్థాయి నుంచి ఎదగని వారికి జరుగుతుంటుంది. ఈ లక్షణంతో రాజకీయ నాయకుడవడం కష్టం. జనం మనసు గెలుచుకోవాలంటే ఆరంభశూరత్వం అస్సలు పనికిరాదు. అనుకున్నది సాధించే వరకు నిర్విరామంగా పనిచేయగలిగే ఓర్పు, ఆసక్తి ఉండాలి.
అప్పట్లో కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టి, మీడియాలో నానా హడావిడి చేసి ఆదిలోనే దానికి మంగళం పాడేశాడు.
రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఒక్క అంశం మీద కూడా దీర్ఘకాలిక పోరాటం చేసినట్టు ఇప్పటి వరకు కనపడలేదు.
2. నిలకడలేని బంధాలు:
చిన్నపిల్లవాడు కొత్తబొమ్మ కనిపిస్తే పాత బొమ్మ వదిలేసినంత తేలిగ్గా ఇతను తనతో బతికే వ్యక్తులని వదిలేయగలడు. కారణం ఇతనికి మొనోటనీ నచ్చదు. విషయాలే కాదు వ్యక్తులు కూడా త్వరగా బోర్ కొట్టేస్తారు.
ఈయన మాజీ భార్య కూడా ఒక ఇంటర్వ్యూలో తనతో పడిన బాధని చెప్పుకున్నారు. ఆమె చెప్పిన దానిని బట్టి భార్య ఉండగానే అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆమెతో పిల్లవాడిని కనడం, తనతో బ్రతికే వ్యక్తి యొక్క మనసుని అర్థం చేసుకునే ఓపిక లేకపోవడం, తన సుఖమే తప్ప ఎదుటి వ్యక్తి మనశ్శాంతికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం పూర్తిగా స్వార్థపూరిత లక్షణాలు.
ఇటువంటి వ్యక్తులతో అంటీముట్టని తాత్కాలిక బంధాల వరకు పర్వాలేదు కానీ పూర్తిగా నమ్మి బతకడం కష్టం. ప్రాక్టికల్ బంధాలే తప్ప ఇతనితో ఎమోషనల్ బంధాలు పెట్టుకోవడం ప్రమాదకరం.
3. నిలకడలేని వేషధారణ:
ఒక్కో సారి ఒక్కో గెటప్పులో కనిపించడం తెర మీద నటుడిగా సరే. కానీ రాజకీయ నాయకుడిగా ఇది అతని తరచూ మారిపోయే మనస్థితిని సూచిస్తుంది. కొన్నాళ్లు చెగువేరా స్ఫూర్తితో ఒక గెటప్పు, కొన్నాళ్లు క్లీన్ షేవ్, కొన్నాళ్లు గుబురుగెడ్డం, సడెన్ గా నిలువుబొట్టు..ఇలా రకరకాలుగా కనిపించడం వల్ల ప్రజలు కూడా ఇతనిని ఒక వినోదవస్తువుగా చూస్తారే తప్ప తమ సమస్యలను సీరియస్ గా పట్టించుకునే నాయకుడిగా చూడరు.
పైగా బీజేపీతో దగ్గరగా ఉన్నప్పుడు బొట్టు పెట్టుకోవడం, లేకపోతే తీసేయడం ఇతని అపరిపక్వతని నిర్దేశిస్తుంది.
4. పొంతన లేని సంభాషణ:
ఒక సభలో తాను సి.ఈ.సి గ్రూపులో అతికష్టమ్మీద ఇంటర్లో చేరానన్నాడు. ఇంకొక సభలో తాను ఎం.ఈ.సి గ్రూపులో ఇంటర్ చదివానన్నాడు. మరొక సభలో తాను ఇంటర్ ఎం.పి.సి గ్రూపులో చదువుతున్నప్పుడు ట్యూషన్ కి వెళుతుంటే.. అని ఏదో చెప్పాడు. ఇలా అసలు తానేమి చదివాడో తనకే తెలియని విధంగా మాట్లాడడం అతని విద్యాశూన్యతని సూచిస్తుంది.
అసలు నిజంగా ఇంటర్లో చేరాడా పదో తరగతి కూడా గట్టెక్కలేదా అనే అనుమానాలొస్తాయి. కాసేపు కులాల గురించి మాట్లాడడం తనకు చిరాకంటాడు. అంతలోనే కాపు, బలిజలకి జరిగే అన్యాయాల గురించి ప్రస్తావిస్తాడు. ఈ పొంతన లేని మాటలవల్ల జనం ఎప్పటికీ ఇతనిని సీరియస్ గా తీసుకోరు.
5. ఆత్మన్యూనతా భావం:
తనకు సరైన చదువులేదని విపరీతమైన ఆత్మన్యూనతతో బాధపడుతుంటాడు. దానిని కప్పి పుచ్చుకోవడానికే రకరకాల పుస్తకాల టైటిల్స్ ప్రస్తావించడం, గుంటూరు శేషేంద్ర శర్మ కవితలు బట్టీకొట్టి స్పీచుల్లో ఉదహరించడం చేస్తుంటాడు. దీనివల్ల అతను విద్యావేత్త అని జనం అనుకుంటారని అతని భ్రమ. తన పార్టీ కేడర్లో ఎక్కువగా చదువుకున్న వాళ్లని, తెలివైన వాళ్లని, మాటకారుల్ని భరించలేడు.
ఒకవేళ అటువంటి వాళ్లు ఉన్నా వాళ్లంతా తెరవెనకే ఉండాలి తప్ప తెరముందుకు రాకూడదు. వస్తే తనని డామినేట్ చేస్తారని భయం. ఈ విషయం అతని పార్టీకి చెందిన వ్యక్తే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
6. శక్తికి మించిన ఆశ:
ప్రతి వ్యక్తికి కొన్ని బలాలుంటాయి, కొన్ని బలహీనతలుంటాయి. బలాలమీద జీవితాన్ని నిర్మించుకోవాలి తప్ప బలహీనతలమీద కాదు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో ఎదిగే శక్తి, తెలివి రెండూ లేవు. ఆ విషయాన్ని ఆలస్యంగానైనా గ్రహించాలి. త్వరగా గ్రహించిన తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీని విలీనం చేసేసి రాజకీయాలనుంచి తప్పుకున్నారు.
పవన్ కల్యాణ్ కి మాత్రం చాలా ఆశలున్నాయి. కానీ తనకున్న బలంతో ఎంత రాజకీయ శూన్యత ఉన్నా కనీసం ఓట్లు చీల్చగలిగే స్థాయికి కూడా ఎదగలేడు.
7. భజనపరులే బంధుగణం:
తనని వేదిక మీదనుంచి ఎవరైనా పొగుడుతుంటే ఆనందంతో పరవశించిపోతాడు. వినయంతో ఒక్కసారైనా తలవంచుకుని మౌనంగా ఉండలేడు. ఇటువంటి చేష్టలు ఫ్యాన్స్ కి నచ్చుతాయేమో తప్ప జనబాహుళ్యానికి అయితే కామెడీగా అనిపిస్తుంది లేదా చిరాకేస్తుంది.
స్వామికి ఏది నచ్చుతుందో ఆ విధంగానే మాటలాడతారు బండ్ల గణేషైనా, హరీష్ శంకరైనా, త్రివిక్రం అయినా. అది కేవలం వారి ప్రాపకం కోసం చేస్తున్నారని తెలిసినా పవన్ కి ఇబ్బంది లేదు. నాలుకకి నరం లేకుండా తనని దైవాంశసంభూతిడిని చేసి పొగిడేవాళ్లే తన బంధుగణం అంతే.
8. ఓర్వలేని గుణం:
తన సమవయస్కులు తాను ఉన్న రంగంలో తనకన్నా ఎదిగితే తట్టుకోలేడు. రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా ఇదే పరిస్థితి. తనతో మల్టీ స్టారర్ తీసినా మరొక హీరోకి సమాన స్థానం ఇవ్వకూడదు.
తననే హీరోగా ప్రొజెక్ట్ చెయ్యాలి. అదీ లెక్క. దీనిని ఇగో అనడం కన్నా ఆత్మన్యూనత అనే చెప్పాలి.