పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ పవన్ కల్యాణ్ కి చక్కటి గుణపాఠాలుగా పనికొస్తాయి. గతంలో ఓసారి బీజేపీకి, టీడీపీకి ఉమ్మడిగా మద్దతిచ్చి తప్పు చేశారు పవన్. ఇప్పుడు మరోసారి అదే తప్పు కంటిన్యూ చేస్తున్నారు.
అప్పుడు పాచిపోయిన లడ్డూలంటూ విరుచుకుపడ్డ నోటితోనే, త్వరలో బీజేపీ నేతలకు శాపనార్థాలు పెట్టే రోజు కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కల్యాణ్ ని వాడుకుని వదిలేసే బృహత్తర పథకానికి బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తమిళనాడు రాజకీయాలే పెద్ద ఉదాహరణ అంటున్నారు.
తమిళనాడులో ఏం జరిగింది..?
దక్షిణాదిన బలపడాలనుకుంటున్న బీజేపీ, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటోంది. తమిళనాడులో అన్నాడీఎంకేకి దగ్గరైంది. జయలలిత మరణం తర్వాత దాదాపుగా అన్నాడీఎంకే రాజకీయాలన్నీ బీజేపీ అధినాయకత్వం కనుసన్నల్లోనే జరిగాయి.
శశికళను పార్టీకి దూరం పెట్టడం దగ్గర్నుంచి, అన్నాడీఎంకే వద్ద మెజార్టీ సీట్లు డిమాండ్ చేసి మరీ సాధించుకున్నారు బీజేపీ నేతలు. ఆ పార్టీ చలవతోనే కమలదళం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు.
కట్ చేస్తే.. ఇప్పుడా విశ్వాసం కూడా లేకుండా ఫ్రెండ్ షిప్ కి కటీఫ్ చెప్పేసింది బీజేపీ. స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరుకి సిద్ధపడింది. పార్టీ గుర్తు లేకుండా జరిగే ఎన్నికలైనా కూడా.. బీజేపీ సొంత బలం ఏంటో చూపిస్తామంటూ రెచ్చిపోత్నారు అక్కడి నేతలు, ఎమ్మెల్యేలు. అన్నాడీఎంకేతో కలసి పోటీ చేయడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు నష్టం జరిగిందని కూడా అంటున్నారు.
ఆపరేషన్ బలవంత ఆకర్ష్..
తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి దారుణంగా ఉంది. అధికారం పోయింది, పార్టీపై అజమాయిషీ లేక కార్యకర్తలు కట్టుతప్పుతున్నారు. మరోవైపు అవినీతి విచారణ కేసుల పేరుతో సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే మాజీ మంత్రుల్ని, నేతల్ని భయపెడుతున్నారు. ఈ దశలో అండగా ఉంటుందనుకున్న బీజేపీ పక్కకు పోతోంది. దీంతో అనివార్యంగా అన్నాడీఎంకే నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.
రేపు ఏపీలో జనసేన పరిస్థితి ఏంటి? అంత బలమైన అన్నాడీఎంకేనే కూరలో కరివేపాకులా తీసేసింది బీజేపీ. జనసేన ఓ లెక్కా? పవన్ ముందుగా మేల్కోకపోతే జరిగేది తీవ్ర నష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
త్యాగాలతో మొదలై.. విలీనానికి దారి తీస్తుందా..?
బీజేపీలో జనసేన విలీనం అయితే తనని ఆటలో అరటిపండులా చేస్తారనే భయంతోనే పవన్ గతంలో ఆ ప్రతిపాదన ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అది తప్పేలా లేదు. ఇప్పటికే పవన్ చేస్తున్న త్యాగాలతో జనసైనికులు విసిగిపోయి ఉన్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థికి పోయిందంటే పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటు తెలంగాణలో జనసేన గుర్తుని ఎన్నికల సంఘం క్యాన్సిల్ చేసింది కూడా.
భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటే.. ఇక జనసేన పరిస్థితి ఏంటి? గుర్తులేని పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు ఏముంటుంది. అందుకే వారంతా బీజేపీ వైపో లేక ఇతర పార్టీలవైపో వెళ్తారు. ఈలోపు జనసేనను బీజేపీలో విలీనం చేయాల్సిన అగత్యం కూడా రావొచ్చు. బీజేపీ రాజకీయ ఎత్తుగడలను అంత తక్కువగా అంచనా వేయలేం.
అందుకే పవన్ కల్యాణ్ కాస్త ముందుగానే మేల్కొవాలి. బీజేపీ కబంధ హస్తాల్లో బందీ కాక మునుపే విడిపోయి జనసేనను బలోపేతం చేసుకోవాలి.