ప‌వ‌న్ నివ‌ర్ టూర్ …అస‌లు ఎజెండా ఇదే!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓ విచిత్ర‌మైన రాజ‌కీయ నేత‌. వృత్తిరీత్యా సినిమా న‌టుడైన ఆయ‌న‌కు సినిమాలు, రాజ‌కీయాల‌కు పెద్ద తేడా లేద‌నే భావ‌న‌తో న‌డుచుకుంటుంటారు. రేప‌టి నుంచి ఆయ‌న షెడ్యూల్ అచ్చం సినిమాను త‌ల‌పిస్తోందంటే అతిశ‌యోక్తి…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓ విచిత్ర‌మైన రాజ‌కీయ నేత‌. వృత్తిరీత్యా సినిమా న‌టుడైన ఆయ‌న‌కు సినిమాలు, రాజ‌కీయాల‌కు పెద్ద తేడా లేద‌నే భావ‌న‌తో న‌డుచుకుంటుంటారు. రేప‌టి నుంచి ఆయ‌న షెడ్యూల్ అచ్చం సినిమాను త‌ల‌పిస్తోందంటే అతిశ‌యోక్తి కాదు. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న వెనుక బీజేపీ డైరెక్ష‌న్ ఉంద‌ని స్ప‌ష్టంగా తెలిసిపోతోంది.

ఇటీవ‌ల నివ‌ర్ తుపానుతో ముఖ్యంగా రైతాంగానికి కోలుకోలేని దెబ్బ‌. ముఖ్యంగా ఏరియల్ స‌ర్వే నిర్వ‌హించారు. రైతాంగం ఏ మేర‌కు ఏ న‌ష్ట‌పోయిందో నిగ్గు తేల్చేందుకు అధికార యంత్రాంగం అంచ‌నా వేస్తోంది. ఈ నెలాఖ‌రు లోపు ప్ర‌తి న‌ష్ట‌పోయిన రైతు కుటుంబానికి వాళ్ల ఖాతాల్లో డ‌బ్బు జ‌మ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో నివ‌ర్ తుపాను తాకిడికి దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో ప‌ర్య‌టించేందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగా  కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. డిసెంబ‌ర్ 2న  పామ‌ర్రు, చ‌ల్ల‌ప‌ల్లి, అవ‌నిగ‌డ్డ ప్రాంతాల్లో పంట‌ల‌ను ప‌రిశీలిస్తారు.  

ఆ త‌ర్వాత భ‌ట్టిప్రోలు, చావ‌లి, పెర‌వ‌లి మీదుగా తెనాలి, నందివెలుగు, కొల‌క‌లూరుల్లో ప‌ర్య‌టిస్తారు. 3న తిరుప‌తి చేరుకుని కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌వుతారు.  4న శ్రీ‌కాళ‌హ‌స్తి, నాయుడుపేట‌, గూడూరుల్లో, 5న నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు జ‌న‌సేన పేర్కొంది.

విప‌త్తు సంభ‌వించిన‌ప్పుడు ఒక రాజ‌కీయ పార్టీగా బాధితుల‌ను ప‌రామ‌ర్శించి జీవితంపై భ‌రోసా క‌ల్పించ‌డాన్ని క‌చ్చితంగా ప్ర‌శంసించాలి, స్వాగ‌తించాలి. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న వెనుక అస‌లు కార‌ణం వేరే ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నివర్‌ తుపాను బాధితుల‌ను ఆదుకునే విష‌యంలోనూ, అలాగే వాళ్ల‌ను ప‌రామ‌ర్శించ‌డంలోనూ ఏపీ బీజేపీ ఎలాంటి స్పంద‌న లేకుండా వ్య‌వ‌హరిస్తోంది.

ఏపీని నివ‌ర్ తుపాను అతలాకుతలం చేసినా బీజేపీ నేత‌లు ఎక్క‌డా ప‌రామ‌ర్శించిన దాఖ‌లాలు కూడా లేవు. ఎందుకంటే రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సాయం చేయాల‌నే డిమాండ్ చేయాలంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మీరేం చేస్తార‌ని ప్ర‌శ్నిస్తార‌నే భ‌యం బీజేపీలో క‌నిపిస్తోంది. అందుకే త‌మ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను పంపడం ద్వారా తాము ప‌రామ‌ర్శించిన‌ట్టే అనే భావ‌న‌తో బీజేపీ ఉంది.

మ‌రోవైపు ఏపీకి సాయం అందించే బాధ్య‌త నుంచి బీజేపీని త‌ప్పించేందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ ర‌కంగా ప‌నికొస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ నేత‌ల‌ను వెంట‌పెట్టుకుని క్షేత్ర‌స్థాయికి వెళితే, రైతాంగం డిమాండ్స్ ఏంటో ప‌వ‌న్‌కు తెలిసొస్తాయి.

రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అంద‌లేద‌నే నెగెటివిటి నుంచి బీజేపీని బ‌య‌ట ప‌డేసేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారే త‌ప్ప‌, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఆదుకునేందుకు ఆయ‌న ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేద‌నే విమ‌ర్శ‌ల‌కు గురి అవుతున్నారు. నివర్ తుపాను బాధితుల‌కు జ‌న‌సేనానిగా ఎలాంటి భ‌రోసా ఇస్తారో …రేప‌టి ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో తేలిపోనుంది. 

చంద్రబాబుకు అల్జీమర్స్ జబ్బుంది: కొడాలి నాని