జనసేనాని పవన్ కళ్యాణ్ చివరకు తనకు సరైన జోడీ బీజేపీయే అనుకొని దాని పంచన చేరాడు. జనసేనది, బీజేపీదీ ఒకే భావజాలమని చెప్పాడు. సీఎం జగన్ మీద పోరాటం పేరుతో బీజేపీతో కలిశాడు. బలహీనమైన ఈ రెండు పార్టీలూ కలిసి బలంగా తయారై వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలని కలలు కంటున్నాయి. ఇదే లక్ష్యమని రెండు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఒంటరిగా పోరాడలేమని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. ఢిల్లీలోని బీజేపీ అధిష్టానమూ అదే భావించింది. అందుకే రెండు పార్టీలూ కలిసి పనిచేయాలని అనుకున్నాయి. ఇప్పటి ఈ స్నేహం 2024లో అధికారం సాధించడానికేనని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టంగా చెప్పాడు. అయితే ఈ రెండు పార్టీలూ కలిసి విశాఖపట్టణం రాజధాని కాకుండా ఆపలేవు. ఆ సంగతి కన్నాకు, పవన్ కళ్యాణ్‌కు తెలుసు.
ఈ నెల 20న అసెంబ్లీలో మూడు రాజధానులు బిల్లును ఆమోదించడం తథ్యమన్నట్లుగా పరిస్థితి కనబడుతోంది. జగన్ ప్రభుత్వానికి ఎలాంటి అవాంతరాలు రాకపోతే మూడు రాజధానులు బిల్లు ఆమోదం పొందడం గ్యారంటీ. ఎలాంటి అడ్డంకులు కలగకుండానే 'చిక్కడు-దొరకడు' అనే టైపులోనే బిల్లు రూపొందిస్తున్నట్లు సమాచారం. బిల్లుకు న్యాయపరమైన చిక్కులు కలగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 'ఏపీ వికేంద్రీకరణ-అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధి చట్టం-2020' అనే పేరుతో బిల్లు తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులో ఎక్కడా రాజధాని మార్పు అనే పదం ఉండదని, అలాంటి భావన కలుగకుండా చేస్తున్నారని సమాచారం. కాబట్టి బిల్లు ఆమోదం పొందకుండా చిక్కులు కలిగించే ప్రయత్నాలు సాగవంటున్నారు.
అంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఏమీ చేయలేదు. టీడీపీయే చేయలేనప్పుడు బీజేపీ, జనసేన ఏం చేస్తాయి? బీజేపీకి సభలో ప్రాతినిథ్యం లేదు. జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు జగన్ మనిషి. బిల్లుకు జై కొట్టడం ఖాయం. బీజేపీ, జనసేన ఉమ్మడి సమావేశం తరువాత కొందరు జనసేన నేతలు మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంటామన్నారు. కోర్టుకు పోతామన్నారు. రాష్ట్ర విభజన బిల్లు విషయంలో సుప్రీం కోర్టు ఏం చేసిందో తెలిసిందే కదా. ఇప్పుడూ అలాగే అవుతుందని అంటున్నారు కొందరు న్యాయ నిపుణులు.
ఈమధ్య టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తాయని, ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని అన్నాడు. ఆయన చెప్పిన జోస్యంలో సగం నిజమైంది. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కాబట్టి భవిష్యత్తులో టీడీపీ కూడా చేయి కలపొచ్చు. ఎన్నికలు కాగానే బీజేపీలో చేరిన కొందరు టీడీపీ నాయకులు మళ్లీ టీడీపీని, బీజేపీని కలిపే ప్రయత్నాలు చేస్తున్నారని వినబడుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు కాబట్టి టీడీపీని లాగడానికి తన వంతు ప్రయత్నం చేయొచ్చు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచి చంద్రబాబు నాయుడు బీజేపీని ఏమీ అనడంలేదు.
పవన్ కళ్యాణ్‌ను మిత్రుడిగానే చూస్తున్నాడు. రాజధాని పోరాటంలో ఒక పార్టీకి మరో పార్టీ మద్దతు ఇస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా డిమాండ్‌కు తిలోదకాలు ఇచ్చేశాడు. ఇక దాన్ని గురించి మాట్లాడకపోవచ్చు. తనకు తాను వీర కమ్యూనిస్టుగా ఒకప్పుడు చెప్పుకున్న పవన్ కమ్యూనిస్టులను వదిలేశాడు. భవిష్యత్తులోనైనా ఈ రెండు పార్టీలతో టీడీపీ కలిస్తే తప్ప ఇవి రెండూ కలిసినా బలపడతాయనే నమ్మకం లేదు. రాజధాని పోరాటాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భుజాన మోస్తున్నారు.
ఈ పోరాటంలో జనసేన, బీజేపీ, కమ్యూనిస్టుల పాత్ర చెప్పుకోదగ్గది కాదు. ఎన్నికల్లో ఓటమి తరువాత పూర్తిగా కుంగిపోయిన బాబుకు మూడు రాజధానుల వ్యవహారం మళ్లీ బలం పుంజుకునేలా చేసింది. పూర్తిగా బలం పుంజుకోవడం కాదుగాని ఉత్సాహం వచ్చేలా చేసింది. అందుకే ఎన్నికల్లో గెలిచి రాజధాని మార్చండి అంటూ జగన్‌కు సవాలు విసురుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఎంతమేరకు పుంజుకుంటాయనేది మూడు రాజధానులు బిల్లు ఆమోదం పొందడం, ఆ తరువాత జరిగే ప్రభుత్వ కార్యాచరణ మీద ఆధారపడివుంటుంది.