పవనిజం.. పవన్ పాలిట భస్మాసుర హస్తం..!

భక్తి మూఢ భక్తిగా మారింది. పూజలు క్షుద్రపూజలుగా రూపాంతరం చెందాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ ని దేవుడుగా కొలిచే భక్తులు.. ఆయన్ను తాంత్రిక దైవంగా మార్చేసుకున్నారు. సదరు తాంత్రిక దేవుడి కోసం వారు బలులివ్వడానికి…

భక్తి మూఢ భక్తిగా మారింది. పూజలు క్షుద్రపూజలుగా రూపాంతరం చెందాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ ని దేవుడుగా కొలిచే భక్తులు.. ఆయన్ను తాంత్రిక దైవంగా మార్చేసుకున్నారు. సదరు తాంత్రిక దేవుడి కోసం వారు బలులివ్వడానికి సైతం సిద్ధం అంటున్నారు. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఫ్యాన్స్ అంతా కలిసి ముద్దుగా పెట్టుకున్న ''పవనిజం'' అనే పైత్యం కాస్తా.. ఇప్పుడు అదే పవన్ పాలిట భస్మాసుర హస్తంలా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో అభిమానగణం మెండుగా ఉన్న నటుడు పవన్ కల్యాణ్. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ దాన్ని పదే పదే నిరూపించుకోడానికి పవన్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే పవనిజం. మావోయిజం, జూడాయిజం లాగా.. పవన్ సిద్ధాంతాన్ని నమ్మేవారంతా పవనిజం అనే ట్యాగ్ లైన్ తగిలించుకుని బయల్దేరారు. చాన్నాళ్ల కిందటే.

ఆత్మస్తుతి పరనింద..

సెల్ఫ్ డబ్బాకి పరాకాష్ట పవనిజం. అదే సమయంలో పవన్ మినహా మిగతావారందరిపై లెక్కలేనితనం ప్రదర్శించడమే పవనిజం. పవన్ పై ఎవరైనా ట్వీట్ వేస్తే సార్ అనే పదం వాడాలి, లేకపోతే వారికి బ్యాండ్  బాజానే. పవన్ కల్యాణ్ గురించి ఎవరైనా పాజిటివ్ న్యూసే రాయాలి, పొరపాటున తేడా వస్తే ఆ మీడియాకి, సోషల్ మీడియాకి సైతం పవనిజం భయభక్తులు నేర్పించేందుకు సిద్ధం. 

పవన్ ఎంత పెద్దవారినైనా ఏమైనా మాట్లాడొచ్చు, కానీ అవతలి వ్యక్తి పవన్ గురించి చిన్న మాట తూలినా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి అభిమానులు రెడీగా ఉంటారు. చివరకు కొంతమంది తమ సోషల్ మీడియా అకౌంట్లను సైతం వదిలేసుకునేలా చేశారు ఈ దురభిమానులు.

పవనే హీరో ఇంకెవరూ లేరు..

సినీ ఇండస్ట్రీలో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా పవన్ అభిమానులు అక్కడికి వెళ్లిపోతారు. ఎవరి స్పీచ్ కి అయినా అడ్డుపడతారు. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ కేకలు పెడతారు. సదరు వక్త పవన్ కి జిందాబాద్ అని చెబితే కానీ వీరి మనసు శాంతించదు, అహం చల్లారదు. ఇదెక్కడి లాజిక్కో పవన్ కే తెలియాలి. ఇన్ని జరుగుతున్నా పవన్ వారిని వారించడం కానీ, హద్దుల్లో ఉండాలని చెప్పడం కానీ చేయరు. కారణం ఆయనకు  అదో తుత్తి.

ఆఖరికి పవన్ పేరు నేను  చెప్పనంటూ అల్లు అర్జున్ తేల్చి చెప్పడం, ఆయన ఫంక్షన్ కి ఎందుకు రాలేదో ఆయన్నే అడగండి, మాకేం తెలుసంటూ నాగబాబు చిరాకు పడడం.. ఈ వీరాభిమానుల వికృత చేష్టలపై రియాక్షన్ కు పరాకాష్ట. ఆయన కుటుంబ సభ్యుల్ని సైతం పవన్ అభిమానులు ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తున్నారంటే అది అభిమానమా లేక దురభిమానాన్ని దాటిపోయిన మరో స్టేజా అనేది ఆయన అర్థం చేసుకోవాలి.

రేణూదేశాయ్ ని కూడా వదల్లేదు..

పవన్ తో విడిపోయిన తర్వాత రేణూ దేశాయ్ ని కూడా ఆయన అభిమానులు వదిలిపెట్టలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి విడాకుల తర్వాత పవన్ ఆల్రడీ మరో పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. కానీ రేణూ జస్ట్ ఎంగేజ్ మెంట్ చేసుకుంటే మాత్రం పవనిజం భగ్గుమంది. చివరకు ఆమెకూడా అభిమానులపై మండిపడేలా చేసింది.

సీఎం సీఎం.. ఎప్పటికయ్యేను..

పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీతో పవనిజం మరింత రెచ్చిపోయింది. ఎర్రకండువా గాల్లోకి ఎగరేసి, క్రాఫ్ సరిచేసుకుంటూ ముందుకు నడిచి.. ఏకంగా ఏపీకి సీఎం అయిపోదామనుకున్నారు పవన్. చివరకు రెండు నియోజకవర్గాల్లో బొక్కబోర్లా పడ్డారు. 

విచిత్రం ఏంటంటే.. పవన్ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం సీఎం అంటూ హంగామా చేసిన అభిమానులు, ఎన్నికల్లో ఓటమి తర్వాత సభలు పెట్టినా అవే నినాదాలు చేశారు. ఈ సీఎం స్లోగన్లతో ఓ దశలో పవనే విసిగిపోయి వద్దనేశారు. అయినా కూడా అభిమానుల్లో ఆ ఆవేశం చల్లారలేదు. అయితే అది కేవలం అరుపుల వరకే, ఓట్లు వేసేందుకు మాత్రం ఎవరూ ముందుకు రారు.

ఫ్యాన్స్ ని కెలికి బాగుపడ్డది వర్మ మాత్రమే..

పవన్ కల్యాణ్ ఇమేజ్ ని నాశనం చేసింది, చేస్తోంది ఫ్యాన్స్ మాత్రమేననే విషయం చాలామందికి తెలుసు. అయితే ఆ దురభిమానాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుని పవర్ స్టార్ అనే సినిమా చేసి సొమ్ము చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ.

ఈ డాక్యుమెంటరీ టైప్ సినిమాని ఉచితంగా ప్రదర్శించినా ఎవరూ చూడరు. కానీ పవన్ అభిమానులు వర్మపై దాడికి వెళ్లడంతో అది హైలెట్ అయింది, వాళ్ల ఇగో చల్లారింది, ఈయనకు జేబు శాటిశ్ఫాక్షన్ మిగిలింది.  

చివరికి పవన్ తల్లి, భార్యను కూడా తిట్టించే స్థాయికి..

పవన్ కల్యాణ్ పై పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల నేపథ్యంలో పోసానిపై జరిగిన మాటల దాడి, చేతల దాడి మరోసారి పవనిజం భస్మాసుర హస్తం అనే విషయాన్ని బయటపెట్టాయి. పోసాని నోరుజారాడు సరే.. దానికి పవన్ అభిమానుల రియాక్షన్ మరింత దారుణంగా ఉంది. 

తన భార్యను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారంటూనే పోసాని నేరుగా పవన్ భార్యపై కామెంట్ చేశారు. పోసాని ప్రెస్ మీట్ తో ఆయన స్థాయి తగ్గిందో లేదో తెలియదు కానీ.. ఆయన్ని తిట్టి నన్నెందుకు తిట్టించార్రా అని పవన్ మాత్రం కచ్చితంగా బాధపడే ఉంటారు.

గతంలో చిరంజీవికి, ఓ ప్రొడ్యూసర్ కీ మధ్య గొడవలొస్తే.. అభిమానులు ఆయన ఇంటిపై దాడికెళ్తున్న సందర్భంలో చిరంజీవి వారిని మందలించి పంపించేశారని, సినిమావాళ్ల విషయాల్లో అభిమానులెందుకు కలుగజేసుకుంటున్నారంటూ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని పోసాని తన ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. చిరంజీవి స్థాయి అది. ఇక తన వ్యక్తిగత ఇమేజ్ ని కాపాడేందుకు అభిమానులు దాడులకు పాల్పడుతున్నా వారిని వారించకపోవడం పవన్ స్థాయి.

అభిమానుల్ని ఇలా వాడుకుంటూ.. పోలీస్ కేసులతో వారి వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం పవన్ కల్యాణ్ కి ఎంతమాత్రం సరికాదు. పవనిజం పవన్ పాలిట భస్మాసుర హస్తమే కాదు, వారి అభిమానగణానికి కూడా అది వినాశకారిగా మారింది.