ఏపీ అసెంబ్లీ మెట్లెక్కలేకపోయిన పవన్ కల్యాణ్, తమిళనాడు అసెంబ్లీకి ఎప్పుడెళ్లాడా అని ఆలోచించకండి. ఆయన వెళ్లలేదు, ఆయన ట్వీట్ వెళ్లింది. పవన్ కల్యాణ్ తమ సీఎంని ఎలా పొగిడారో చూడండి అంటూ.. డీఎంకే నేత అసెంబ్లీలో పవన్ పేరు ప్రస్తావించారు. పనిలోపనిగా చిరంజీవి పేరు కూడా సీన్ లోకి తెచ్చారు.
స్టాలిన్ పై మెగా బ్రదర్స్ పొగడ్తల వర్షం..
ఇటీవల తన వ్యక్తిగత ట్విట్టర్ ఎకౌంట్ లోకి రీఎంట్రీ ఇస్తూ పవన్ కల్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. రాజకీయాలంటే మీవేనంటూ కితాబిచ్చారు, రాజకీయ నాయకులందరికీ మీరే ఆదర్శమని అన్నారు. ఆ తర్వాత చిరంజీవి నేరుగా స్టాలిన్ ని కలిసి ఆయనకు శాలువా కప్పి జ్ఞాపిక బహూకరించి మరీ ఆయన పనితీరుని మెచ్చుకున్నారు.
విజన్, డెడికేషన్ ఉన్న ప్రజా నాయకుడు స్టాలిన్ అంటూ ట్విట్టర్లో పెద్ద పెద్ద మాటలే వాడేశారు చిరంజీవి. మెగా బ్రదర్స్ కి ఉన్నట్టుండి తమిళనాడు సీఎం అంతగా ఎందుకు నచ్చారో తెలియదు కానీ, తమిళనాడు అసెంబ్లీలో మాత్రం మెగా బ్రదర్స్ ప్రస్తావన వచ్చింది.
సూపర్ స్టార్ లతో పొగడ్తలందుకున్న సూపర్ స్టార్ స్టాలిన్..
అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించండి, నా భజన చేయకండి అంటూ సీఎం స్టాలిన్ సహచరులకు వార్నింగ్ ఇచ్చి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. అసలది భజనే కాదంటూనే భజన మొదలు పెట్టారు ఓ నాయకుడు. పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్ ని తెలుగులో చదివి వినిపిస్తూ, తమిళంలో కూడా దాని అర్థం వివరించి చెప్పారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా ఉన్న చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ తమ నాయకుడ్ని ఎలా పొగిడారో చూడండి అంటూ మెచ్చుకున్నారాయన. ఇది విన్న తర్వాత స్టాలిన్ నోట మాట రాలేదు. వద్దు వద్దన్నా, ఇలా మరో రూపంలో తనని పొగిడేస్తున్న నాయకులున్నారని నవ్వి ఊరుకున్నారాయన.
మొత్తమ్మీద.. ఏపీ అసెంబ్లీలో కాకపోయినా పక్క రాష్ట్రంలో అయినా పవన్ కల్యాణ్ ప్రస్తావన రావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పొగిడినా, పొగిడించుకున్నా అది పవన్ కే చెల్లిందని అంటున్నారు.