మనకి లేకపోయినా ఏం పర్లేదు. అవతలివాడికి మాత్రం వుండకూడదు. ఇంతటి భయంకరమైన ఏడుపు ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఎవరికి వుంటుంది అంటే ఆంధ్రలో జగన్ ను ద్వేషించే సామాజిక వర్గ మీడియాకు మాత్రమే వుంటుందేమో?
ఏ చిన్న పాయింట్ లో జగన్ బలం తగ్గిపోతుందని కనిపించినా ఈ మీడియా ఆనందం ఇంతా అంతా కాదు. చిన్న ఉదాహరణ చిత్తగించండి
'రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మహరాష్ట్ర రాజకీయ కురువృద్దుడు శరద్ పవార్ ను కలిసారు'
ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఎందుకు కలిసారు? దాని వైనం ఏమిటి అని ఆలోచిస్తారు. కానీ మన సామాజిక బంధాల్లో చిక్కుకున్న మీడియా మాత్రం అలా ఆలోచించదు. ఈ వార్తలోకి జగన్ ను ఎలా లాగాలి? జగన్ కు ఎలా నష్టం అని చెప్పాలి? జగన్ తప్పు ఎలా అని చెప్పాలి? ఇలా ఆలోచిస్తుంది.
అందుకే శరద్ పవార్ ను ప్రశాంత్ కిషోర్ కలిసింది మోడీ వ్యతిరేక కూటమిని తయారుచేయడానికి. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం మోడీ వ్యతిరేకులతోనే పని చేస్తున్నారు కాబట్టి, కానీ జగన్ ను మోడీ వ్యతిరేకించడం లేదు కాబట్టి, 2024లో ప్రశాంత్ కిషోర్ ఇక జగన్ కు పని చేయరు.
ఇలా రాసేసి, హమ్మయ్య 2024లో జగన్ ఓడిపోతాడు అని ఈ రోజుకు తాము చేయాల్సింది చేయగలిగాం అని కమ్మటి కలలు కంటూ నిద్రపోతారు. అంతే తప్ప ప్రశాంత్ కిషోర్ కు జగన్ మధ్య వున్న బాండింగ్ ఏమిటి?
ప్రశాంత్ కిషోర్ టీమ్ ప్రస్తుతం జగన్ కోసం ఎలా పనిచేస్తోంది? ఎక్కడెక్కడ పని చేస్తోంది? ఏయే బాధ్యతలు నిర్వహిస్తోంది అని కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయదు. అలా చేస్తే ఇలా రాయరు కదా? ఆయనే వుంటే అన్నట్లుగా..ఆ జ్ఞానమే వుంటే, ఈ అజ్ఞానపు వార్తలు వండరు కదా?