ఆ తండ్రీ కొడుకులూ, వారికి తోడు అనుంగు మిత్రుడు పవన్ కల్యాణ్ ముగ్గురి పరిస్థితీ ఇప్పుడు అచ్చం ఒకేలాగే ఉంది! వీరి ముగ్గురి విషయంలో కామన్ ఏమిటంటే.. వీరు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అనే క్లారిటీ ఇప్పుడు లేదు!
ముందుగా పవన్ కల్యాణ్ కథే తీసుకుంటే.. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఆయన పోటీ చేశారు. రెండు చోట్లా దిగ్విజయంగా ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు అహంభావపు మాటలు మాట్లాడిన పవన్ కల్యాణ్.. తను రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలైన వైనంపై ఇప్పుడు కామెడీ చేసుకోవాల్సి వస్తోంది!
గత ఎన్నికలు సరే.. ఇంతకీ వచ్చేసారి పవన్ పోటీ ఎక్కడ నుంచి? అనేది ఇంకా శేష ప్రశ్నే! గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో.. దేన్నైనా ఒక దాన్ని సీరియస్ గా తీసుకుని, పవన్ పని చేస్తున్నారా? అంటే.. అలాంటిదేం కనపడదు. ఆయన ఎంచక్కా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయవచ్చనే ప్రచారం కూడా ఒకటి ఉంది.
అయితే.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా పవన్ అక్కడ ప్రచారం చేస్తే వచ్చిన ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. దాన్ని బట్టి.. తిరుపతిలో పవన్ పోటీ అనేది జరిగే పనిలా లేదు!
ఏరికోరి కాపుల జనాభా నిర్ణయాత్మక శక్తిగా ఉన్న నియోజకవర్గాల్లోనే పవన్ గత ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడే తేడా కొట్టింది. మరి రేపు ఎన్ని కుల సమీకరణాలను లెక్కలోకి తీసుకున్నా.. ఎక్కడ నుంచి పోటీ అనేది మిస్టరీగా మారింది. పవన్ తీరు చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనేది కూడా అనుమానమే.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది కాబట్టి.. తన పార్టీని మాత్రం పోటీలో పెట్టి.. పవన్ పోటీలో లేకుండా ప్రచారానికే పరిమితం అయినా కావొచ్చేమో! పవన్ కు చంద్రబాబు మీద ఉన్న ఆపేక్ష నేపథ్యంలో.. పోటీ నుంచి తప్పుకుని, ఆయనను గెలిపించడానికి ప్రయత్నించవచ్చు!
ఇక లోకేష్.. ఈయన మాత్రం మంగళగిరి నుంచి వచ్చేసారి పోటీ అని ఈ మధ్యనే ప్రకటించారు. అయితే ఆ ప్రకటన అలా రాగానే.. మంగళగిరిలో చేనేత సామాజికవర్గానికి చెందిన నేతకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పట్టం కట్టింది. ఇప్పటికే ఒకసారి లోకేష్ ను ఓడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకోసారి ఆ పని చేస్తే.. లోకేష్ పొలిటికల్ కెరీర్ కు తీవ్ర విఘాతం గా మారుతుందది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లోకేష్ మంగళగిరి నుంచి కచ్చితంగా పోటీ చేస్తారనేది అనుమానమే కావొచ్చు!
ఈ జాబితాలోకి చంద్రబాబు చేరారు. కుప్పంలో స్థానిక ఎన్నికల ఫలితాల పరంపరను గమనిస్తే.. వచ్చేసారి కుప్పం నుంచి పోటీ చేయడం చంద్రబాబు తన రాజకీయ జీవితంలో చేయబోయే అత్యంత పెద్ద సాహసం అవుతుంది. అందుకే ఆయన పెనమలూరు మీద ఇప్పటికే దృష్టి పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వచ్చేసారి అధికారం తమదే అనే ముఖ్య నేతలు ముగ్గురూ… ఎక్కడ నుంచి పోటీ అనే విషయంలో కూడా క్లారిటీ లేని క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు!