లేస్తే మనిషిని కాను.. అనేది పవన్ కల్యాణ్ మాటల్లో తరచూ వినిపించే ఫిలాసఫీ. ఈ మధ్యనే జస్ట్.. రెండు మూడు రోజుల కిందటే ఆయన చెప్పారు, వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని. మరి అందుకు ట్రయల్ పార్ట్ ను ఒకటి రన్ చేసే అవకాశం పవన్ కల్యాణ్ కు చేతిలోనే ఉంది.
అదే బద్వేల్ ఉప ఎన్నిక! ఎలాగూ పవన్ కల్యాణ్ రాయలసీమ, బలిజలు అంటూ ఈ మధ్యనే మాట్లాడారు. మరి అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న చోట.. పవన్ కల్యాణ్ తన సత్తా ఏమిటో చూపించాల్సింది!
తన పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపి.. వచ్చే ఎన్నికల్లో తమ విజయానికి తగిన ట్రయల్ పార్ట్ ను రన్ చేయాల్సింది! అయితే.. దివంగత ఎమ్మెల్యే భార్య పోటీ చేస్తుండటంతో జనసేన అక్కడ పోటీ చేయడం లేదట. ఇదేదో సాకు చెప్పినట్టుగా ఉంది తప్ప, సీరియస్ గా లేదు.
ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఏకగ్రీవానికి సమ్మతించి ఉంటే.. ఆ పార్టీని అనుసరించి తను కూడా.. అని జనసేన చెప్పుకునే అవకాశం ఉండేది. అయితే.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీకి సై అనేసిందిజ.
అలాంటప్పుడు జనసేన అభ్యర్థిని పెట్టనంత మాత్రాన అక్కడ ఏకగ్రీవం జరగదు. అలాంటప్పుడు ముక్కోణపు పోరులో తన సత్తా, బీజేపీతో కలిసి తమ సత్తా ఏమిటో జనసేన చూపించాల్సింది. అయితే.. పవన్ అలాంటి ఛాలెంజ్ ను తీసుకోలేదు.
ఎంతసేపూ లేస్తే.. మనిషిని కాను, తాట తీస్తా, తోలు తీస్తా, నార తీస్తా.. అనడమే తప్ప ప్రత్యక్ష ఎన్నికల పోరాటంలో పవన్ కల్యాణ్ ట్రాక్ రికార్డు అత్యంత పేలవంగా ఉంది. తిరుపతి ఉప ఎన్నికతో సహా అన్నీ అట్టర్ ఫ్లాప్ లే. ఇప్పుడు పవన్ మాట్లాడిన మాటలకూ.. రేపు బద్వేల్ లో ఆ పార్టీ పోటీ పెడితే వచ్చే ఫలితాలకూ ఇసుమంతైనా సంబంధం ఉండదు. అందుకే తప్పుకున్నట్టుగా అనిపిస్తే అది అనుకునే వాళ్ల పొరపాటు ఏ మాత్రం కాదు!
అయితే త్యాగాలు చేయడం, లేకపోతే ఇలా తప్పుకోవడం.. ఇదీ జనసేన రాజకీయం. అయితే మాటల వరకూ వస్తే మాత్రం పవన్ కోటలు దాటిపోతూ ఉంటారు. ఆ మాటలూ, ఈ చేతలు.. ఏతావాతా.. ఇదో విదూషక పాత్ర!