దాదాపు మూడు వేల మంది ఉద్యోగులు ఉంటారు పీకే టీమ్ లో.. అదే ఐ ప్యాక్ లో. వాళ్లంతా సోషల్ మీడియాలో సొల్లు కామెంట్లు పెట్టే బాపతు పొలిటికల్ విశ్లేషకులు కాదు. చాలా మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లు, మరి కొందరు ప్రసిద్ధ యూనివర్సిటీల్లో పొలిటికల్ స్టడీస్, సోషల్ సర్వీసింగ్ వంటి కోర్సుల్లో పట్టాలు పొందిన వాళ్లు.
ఈ తరహా చదువులకు వెళ్లే వాళ్లు కేవలం సర్టిఫికెట్ కోసం వెళ్లే బాపతు కాకపోవచ్చు. ఈ రోజుల్లో ఎంతమంది భారతీయ విద్యార్థులు ప్రసిద్ధ యూనివర్సిటీల్లో… సోషియల్ వర్క్ లో మాస్టర్స్ చేసే వాళ్లు ఉంటారు? ఇలాంటి వాళ్లు పీకే టీమ్ లో సభ్యులు!
ఎవరేం చెప్పినా మారరు, ఈ వ్యవస్థలో మారనివి అంటే ఏమైనా ఉన్నాయంటే అవి రాజకీయ పార్టీలు, మారని వారు ఎవరైనా ఉన్నారంటే రాజకీయ పార్టీల నేతలే.. అని బలంగా నమ్ముతున్న భారతీయుల పాలిట ఒక ఆశ్చర్యం ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే.. రాజకీయ పార్టీల నడతనే మార్చేశాడు పీకే.
2014తో పీకే ఒక కొత్త దేవుడుగా అవతరించాడు పొలిటికల్ పార్టీల పాలిట. అయితే అది కేవలం గాలి వాటం కాదని పీకే నిరూపించుకుంటూ వస్తున్నాడు. అయితే ప్రతిసారీ అతడు గాలి వాలుగా నిలుస్తున్నాడనే వాదనా ఉంది. అందుకే ఇప్పుడు పీకే ఒక పెద్ద పనిని చేపడుతున్నట్టుగా ఉన్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ బాధ్యతను జాతీయ స్థాయిలో తీసుకోవడం!
ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అంటే.. సింపుల్ గా చెప్పాలంటే కుక్కలు చింపిన విస్తరి అనొచ్చు తెలుగులో! ఇంతకన్నా కాంగ్రెస్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. కాంగ్రెస్ ను దుంపనాశనం చేసే వరకూ వదిలిపెట్టం అన్నట్టుగా ఆ పార్టీని పట్టుకున్నారు సోనియా, రాహుల్. వీరిలో రాహుల్ ఏమో నిర్వేదంలో కనిపిస్తాడు.
పార్టీ పగ్గాలు చేపట్టాలని, లోక్ సభలో పార్టీ నాయకుడై తమను నడిపించాలని ఆ పార్టీ నేతలు, ఎంపీలు రాహుల్ ను బతిమాలుతున్నారు. ఆయనేమో తనకేం పట్టనట్టుగా ఉంటారు ఆ విషయాల్లో. అంతకన్నా దారుణం ఏమిటంటే రాహుల్ పగ్గాలను వదిలితే ఒక బాధ, పట్టితే ఇంకో బాధ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి!
అయితే.. దేశంలో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ పార్టీ అయితే అవసరం. కాంగ్రెస్ కోసం కాకపోయినా.. బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్య అవసరం. ఆ అవసరాన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయినా తీర్చాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తను పొలిటికల్ స్ట్రాటజిస్టు. ఇప్పుడు తనో రాజకీయ నాయకుడు అయ్యేలా ఉన్నాడు. మరి రెండింటికీ చాలా తేడా ఉంది. ఇన్నాళ్లూ ఆయా పార్టీల్లో నాయకులు ఏం చేయాలో పీకే చెబుతూ వచ్చాడు.
ఎలాగూ కోట్ల రూపాయలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి, పీకేది ఒక మిడాస్ టచ్ అనే అభిప్రాయం ఉంది కాబట్టి, కోరి తెచ్చుకున్నారు కాబట్టి అన్ని పార్టీల వాళ్లూ ఆయన ఆడమన్నట్టగానే ఆడాయి. అయితే ఇప్పుడు పీకే కాంగ్రెస్ లో చేరి.. ఆ పార్టీని రిపేర్ చేసే పనికి పూనుకుంటే.. ఆ పార్టీ వాళ్లు ఎంత వరకూ సహకరిస్తారనేది బిగ్ కొశ్చన్ మార్క్!
అందులోనూ పీకే కాంగ్రెస్ ను రిపేర్ చేయదలుచుకుంటే అది సోనియా, రాహుల్ ల తీరు నుంచినే మార్చాలి. కాంగ్రెస్ ను వీడి వెళ్లిన ఎంతో మంది సమర్థ నాయకులు, అలిగి వెళ్లింది సోనియా, రాహుల్ ల తీరు మీదే. వారికి కనీస ప్రాధాన్యతను ఇవ్వడం మాట అటుంచి, కనీసం కూర్చుబోట్టి మాట్లాడుకుని ఉంటే.. కాంగ్రెస్ కు ఇంత దయనీమైన పరిస్థితి కచ్చితంగా వచ్చేది కాదు.
పార్టీకి పెద్ద సమస్య సోనియా, రాహుల్ లు. వారి తీరులో చాలా మార్పు రావాలి. ఆ మార్పు ఇప్పుడు వచ్చినా కాలిన చేతులతో ఆకులు పట్టుకున్నట్టుగానే ఉంటుంది అది కూడా పీకేకు తెలియనిది ఏమీ కాకపోవచ్చు!
ఇక ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ పూర్తిగా కోల్పోయింది. అయితే.. ఉత్తరాది ప్రజల విశ్వాసాన్ని గెలిచిన బీజేపీ పాలనతో మాత్రం ప్రజలను అకట్టుకోలేకపోతోందనేది వాస్తవం. కేవలం హిందుత్వ అజెండానే అక్కడ బీజేపీకి సీట్లను ఇస్తోంది తప్ప.. ఇరగదీసిన పాలన ఏమీ లేదు.
గవర్నెస్ విషయంలో అయితేనేం, కరోనా కష్టాల్లో కూడా ప్రజలపై పన్నుల భారాన్నీ మోపడంలో అయితేనేం… మోడీ ప్రభుత్వం ఉద్ధరిస్తున్నది ఏమీ లేదు. 2014లో ఇచ్చిన ఎన్నికల హామీలకూ.. నేడు మోడీ ప్రభుత్వం చేస్తున్న దానికీ పొంతనే లేదు. అధ్వాన్నమైన గవర్నెన్స్ తో కూడా మోడీ ప్రభుత్వం నెట్టుకొస్తోందంటే అది హిందుత్వ నినాదంతో మాత్రమే అనేది బహిరంగ రహస్యం.
హిందుత్వ నినాదాన్ని పీకే తేలిక చేసే టైపు కాదు. గుడ్ గవర్నెన్స్ నినాదం, కాంగ్రెస్ పై కొన్ని వర్గాల్లో తిరిగి విశ్వాసం కలిగించడం ద్వారానే ఆ పార్టీకి జవసత్వాలను అద్దడం సాధ్యం. మరి ఈ విషయంలో పీకే ఏం చేయబోతున్నాడనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నేత కాబోతున్నాడనిపించుకుంటున్న పీకే రాజకీయ నాయకుడిగా కూడా ఎలాంటి ఒరవడిని సృష్టించబోతున్నాడనేది రాజకీయ తెర పై వీక్షించాలి!