డాక్టర్లను, పారిశుధ్య కార్మికులను, పోలీసులను ఇప్పుడు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా అభివర్ణిస్తూ ఉంది ప్రపంచం. ఇది ముమ్మాటికీ నిజం. కరోనా రోగులకు వైద్యాన్ని అందిస్తూ చాలా మంది వైద్యులు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. డాక్టర్లనే కాదు.. మొత్తం మెడికల్ సిబ్బందిని అంతా అభినందించాల్సిందే. వాళ్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కొనియాడాల్సిందే. ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారెవరైనా ఇప్పుడు ఆసుపత్రుల వంక చూడటానికి కూడా వెనుకాడుతున్నారు. మరి అవే ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు వీరందరికి సెల్యూట్ చేయాల్సిందే.
ఆ తర్వాత పారిశుధ్య కార్మికులు.. ఏ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలాంటి క్రమంలో.. ప్రతి ఇంటి నుంచి పడే చెత్తను ఇప్పుడు కూడా ఏ రోజుకారోజో.. మరుసటి రోజో.. తీసుకెళ్తున్న పారిశుధ్య కార్మిక సిబ్బందికి చేతులెత్తి మొక్కొచ్చు. నగరాలు, పట్టణాల్లో కరోనా కాలంలో కూడా విధులు నిర్వర్తిస్తున్న వారిలో పారిశుధ్య కార్మికులు ముందున్నారు. వాళ్లు చెత్త ఎత్తివేయకపోతే.. నగర జీవనం చాలా దుర్భరంగా మారింది పోతుంది ఒకటీ రెండు రోజుల్లోనే. మనిషికి మనిషి దగ్గరకు రావడానికి భయపడున్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంటి నుంచి విడుదలయ్యే వ్యర్థాలన్నింటినీ డస్ట్ బిన్స్ నుంచి ట్రాక్టర్లకు ఎత్తుతున్న పారిశుధ్య కార్మికుల కష్టం, తెగువ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇళ్లకు పరిమితం కండని చెబితే చాలా మంది వినట్లేదు. పని లేకుండా షికార్లకు వస్తున్న వారి చేత ఈ పనులు చేయిస్తే అప్పుడు కానీ బుద్ధిరాదు.
ఇక కరోనా కాలంలో వీరి తర్వాత ఫ్రంట్ లైన్లో ఉండి అపసోపాలు పడుతున్న వారు పోలీసులు, బ్యాంకర్లు. ఎన్ని లాక్ డౌన్లు పెట్టినా వీళ్లకు పని తప్పడం లేదు. లాక్ డౌన్ ను అమలు చేయడంలో మొదటి నుంచి పోలీసులు లాఠీకి పని చెప్పాల్సి వస్తోంది. తిరగొద్దని మామూలుగా చెబితే వినని వాళ్లకు తమదైన రీతిలో వడ్డిస్తున్నారు. ఇదే సమయంలో ట్రాఫిక్ ను నియంత్రించే పోలీసులకు మరింత భయాలు అధికం అవుతున్నాయి. అనంతపురంలో ట్రాఫిక్ సీఐ ఒకరు కరోనా బారిన పడి మరణించారు. 47 ఏళ్ల వయసున్న రాజశేఖర్ అనే సీఐ అప్పటికే మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారట, ఆ క్రమంలో ఆయనకు కరోనా సోకడంతో మరణించినట్టుగా తెలుస్తోంది. పోలీసుల ఎలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారనేందుకు ఈ ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది.
ఇక బ్యాంకర్లు..హైదరాబాద్ లో ఒక ప్రముఖ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ లో ఏకంగా 16 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలిందనే విషయం ఆశ్చర్యం కలిగించక మానదు. రెండు ఫ్లోర్ల ఆ బ్రాంచ్ లో.. ఎలా వచ్చిందో కానీ, ఏకంగా 16 మంది కరోనా పాజిటివ్ తేలారట. దీంతో మిగతా సిబ్బంది బెంబేలెత్తుతోంది. అప్పటికే సెలవుల్లో ఉన్న వారు సేఫ్ అయ్యారు. ఒకేసారి అంతమందికి పాజిటివ్ అని తేలడంతో మిగతా వారికి సెలవులు రద్దు చేసి విధులు నిర్వర్తింపజేస్తున్నారట పై అధికారులు. దీంతో అంతా బిక్కుబిక్కుమంటూ పని చేస్తున్న పరిస్థితి.
ఇంట్లో ఉండడ్రా అని ప్రాథేయపడుతుంటే కొంతమందికి తీవ్రత ఇప్పటికీ అర్థం కావడం లేదు. తీరా పని చేయక తప్పని స్థితిలో ఉన్న వారి పరిస్థితి ఇలా ఉన్నట్టుంది.