తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసును మెదక్ పోలీసులు గంటల వ్యవథిలో ఛేదించారు. కారు డిక్కీలో మృతదేహాన్ని పెట్టి దగ్దం చేసిన ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. మృతదేహం కాలి బూడిదైంది. కేవలం అస్తికలు మాత్రమే మిగిలాయి.
చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయాన్ని తేల్చడానికే పోలీసులకు 11 గంటల సమయం పట్టింది. కారు ఛాసిస్ నంబర్ ఆధారంగా మృతుడ్ని గుర్తుపట్టారు. అయితే వ్యక్తి ఎవరో తెలిసిన తర్వాత నిందితుల్ని పట్టుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు.
వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసులో కీలకమైన ముగ్గురు నిందుతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం నిఖిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడి ద్వారా మరో ఇద్దరు నిందితులు శివ, పవన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మగువ కోసం కాదు..
శ్రీనివాస్ హత్య ఘటన బయటకొచ్చిన వెంటనే అతడికున్న వివాహేతర సంబంధాలు బయటకొచ్చాయి. తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలున్నాయని, తరచూ తనతో గొడవ పడతాడని స్వయంగా ఆయన భార్య పోలీసులకు చెప్పడంతో.. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు.
అయితే ఎప్పుడైతే శ్రీనివాస్ కాల్ డేటా పోలీసుల చేతికి చిక్కిందో, అప్పుడు మనీ మేటర్ బయటకొచ్చింది.
అసలు కారణం ఇదే..
మెదక్ టౌన్ కు చెందిన శివ, పవన్, నిఖిల్ లోన్ తీసుకొని కోటిన్నర రూపాయల మొత్తాన్ని శ్రీనివాస్ కు ఇచ్చారు. అలా ముగ్గురు నుంచి కోటిన్నర తీసుకున్న శ్రీనివాస్ తిరిగి ఆ సొమ్మును చెల్లించలేదు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎంతగా అడిగినప్పటికీ శ్రీనివాస్ తన వ్యవహారశైలి మార్చుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మాట్లాడ్డానికి రమ్మని నిఖిల్, శ్రీనివాస్ కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ తర్వాతే శ్రీనివాస్ కారులో బయల్దేరాడు.
ఈ ఒక్క ఫోన్ కాల్ ఆధారంగానే పోలీసులు మొత్తం కేసును ఛేదించారు. కారులో శ్రీనివాస్ తో పాటు మిగతా ముగ్గురు వ్యక్తులు చర్చలు జరిపారు. ఎంతకీ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో శ్రీనివాస్ ను కత్తులతో పొడిచి చంపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆధారాల్లేకుండా చేసేందుకు.. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి, డీజిల్ పోసి కారుతో పాటు దహనం చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికైతే ముగ్గురు నిందుతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒకే ఒక్క డౌట్ మాత్రం పోలీసులకు మిగిలిపోయింది. వీళ్లు ముగ్గురే హత్య చేశారా లేక మరో వ్యక్తి కుట్ర పన్ని, ఈ ముగ్గురి సాయంతో హత్య చేయించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.