కేవలం 23మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలున్న టీడీపీలో అనునిత్యం ఆధిపత్య పోరు, ఉనికి కోసం పోరాటాలు ఎక్కువయ్యాయి. ఇటీవలే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి నానా హంగామా చేసి చివరకు చల్లబడ్డారు.
ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో కూడా అంతే హంగామా నెలకొంది. వచ్చే దఫా ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన కుమార్తె కూడా పోటీ చేయబోదని.. విజయవాడ లోక్ సభ స్థానానికి కొత్తవారిని చూసుకోవాలంటూ అధిష్టానానికి ఎంపీ కేశినేని నాని లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఆ లేఖ రాసిన సమయానికి ఆయన ఔటాఫ్ స్టేషన్. తాజాగా ఆయన విజయవాడకి రావడంతో ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున విజయవాడకు చేరుకున్నారు. బెజవాడలోని కేశినేని భవన్ లో రాజకీయ కోలాహలం నెలకొంది.
సహజంగా ఇలాంటి ఎపిసోడ్ లో కార్యకర్తలు తమ నాయకుడి మాటకు ఎదురు చెప్పడం, మీరు పోటీలో ఉండాల్సిందేనంటూ భీష్మించుకు కూర్చోవడం జరిగేవే. సరిగ్గా కేశినేని భవన్ కూడా ఈ తరహా నాటకీయ పరిణామాలకు వేదిక అయింది. కార్యకర్తలు, అభిమానులంతా ఆయన తిరిగి విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని 2024లో కూడా ఆయన్ను తాము గెలిపించుకుంటామని చెప్పుకొచ్చారు. ఆయన లేని విజయవాడ టీడీపీని ఊహించుకోలేమని కూడా అన్నారు.
అయితే ఇంకా అలకతీరని కేశినేని.. నర్మగర్భ వ్యాఖ్యలతో వారిని సముదాయించారు. బెజవాడలో దుర్గ గుడి ఉన్నన్ని రోజులు, కేశినేని భవన్ ఉంటుందని సెలవిచ్చారు. అలా తాను ఎన్నికల్లో పోటీ చేస్తాననో, చేయననో చెప్పకుండా కన్ఫ్యూజ్ చేసి వదిలిపెట్టారు.
గోడ దూకేస్తారా..?
కేశినేని నాని తన సొంత సామాజిక వర్గాన్ని నమ్ముకుని టీడీపీతోనే కొనసాగుతున్నారు. అలాంటి నాని.. తన రాజకీయ వారసురాలిగా కుమార్తె కేశినేని శ్వేతను తెరపైకి తెచ్చారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేసి హడావిడి చేశారు. చివరకు శ్వేత గెలిచినా పార్టీ ఓడింది. అలా ఓడటానికి, టీడీపీలో లుకలుకలు రావడానికి బొండా ఉమ, బుద్ధా వెంకన్న కారణం అనేది కేశినేని ఆరోపణ. అందుకే వారిమీద అలిగి పార్టీపై కోపంతో ఓ ప్రకటన చేశారు.
ఇప్పుడు తన ప్రకటనకు ఆయన కట్టుబడి ఉంటారా లేదా అనేదే పెద్ద డౌట్. బుచ్చయ్యలాగే కేశినేని వ్యవహారం కూడా టీకప్పులో తుపానుగా తేలిపోతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిన వెంటనే గోడ దూకిన రాజ్యసభ సభ్యుల్లాగే.. కేశినేని నాని కూడా బీజేపీ పంచన చేరతారేమోననే అనుమానం సొంత పార్టీ నేతల్లో కూడా ఉంది.