Advertisement

Advertisement


Home > Politics - Political News

సుజనా చౌద‌రిని దూరం పెట్టారా?

సుజనా చౌద‌రిని దూరం పెట్టారా?

ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా నియ‌మితులైన సోము వీర్రాజు మంగ‌ళ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. విజ‌య‌వాడ‌లో పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో సోము వీర్రాజుకు పూర్వ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి గైర్హాజ‌ర్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల్లో ప్ర‌ధానంగా సుజ‌నా చౌద‌రి యాక్టీవ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి అంశంపై ఆయ‌న మొద‌టి నుంచి సొంత అజెండాతో ముందుకెళ్ల‌డం అంద‌రికీ తెలిసిందే. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని అంగుళం కూడా క‌దిలించ‌లేర‌ని, త‌గిన స‌మ‌యంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంద‌ని ఆయ‌న న‌మ్మ‌బ‌లుకుతూ వ‌చ్చారు. ఒక ద‌శ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మెడ‌లు వంచే నాయ‌కుడు ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ ఉన్నార‌ని హెచ్చ‌రించారు.

అయితే క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ బీజేపీ ఏపీ అధ్య‌క్షుడిగా ఉన్నంత కాలం...సుజ‌నా ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా సాగింది. ఉత్తరాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల ఆకాంక్ష‌ల‌ను సుజ‌నా చౌద‌రి ఏ మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా, సామాజిక‌వ‌ర్గం కోసం పార్టీని బ‌లిపెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ సుజ‌నా చౌద‌రి త‌న వైఖ‌రి మార్చుకోక‌పోగా, అలా మాట్లాడిన వాళ్ల‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ స్థానంలో సోము వీర్రాజు నియ‌మితుల‌య్యారు. పార్టీలో చోటు చేసుకున్న మార్పును గ్ర‌హించ‌కుండా...ఎప్ప‌ట్లాగే అమ‌రావ‌తిని ఎక్క‌డికీ క‌దిలించ‌లేర‌ని, కేంద్రం జోక్యం చేసుకుంటుంద‌ని సుజ‌నా చౌద‌రి స్ప‌ష్టం చేశారు. ఇదే సంద‌ర్భంలో ఢిల్లీ వేదిక‌గా జాతీయ నేత‌ల స‌మ‌క్షంలో సోము వీర్రాజు కేంద్రానికి రాజ‌ధాని ఎంపిక అంశంతో సంబంధం లేద‌ని తేల్చి చెప్పారు.

జాతీయ పార్టీలో భిన్న వాద‌నలు వినిపించ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఏపీ బీజేపీ శాఖ ట్విట‌ర్ ద్వారా ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాజ‌ధానిపై సోము వీర్రాజు మాట్లాడిందే పార్టీ అభిప్రాయ‌మ‌ని, సుజ‌నా చౌద‌రి అభిప్రాయం పార్టీ విధానానికి భిన్నంగా ఉంద‌ని తేల్చి చెప్పింది. దీంతో సుజ‌నా చౌద‌రి నోటికి తాళం వేసిన‌ట్టైంది. సుజ‌నా మాట్లాడిన త‌ర్వాత మూడు రాజ‌ధానులు, సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేశారు. అలాగే హైకోర్టుకు కేంద్రం స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో రాజ‌ధాని ఎంపిక రాష్ట్ర ప‌రిధిలోని అంశ‌మ‌ని తేల్చి చెప్పింది.

రాజ‌ధాని ప‌రిణామాలు చ‌కాచ‌కా సాగుతున్న‌ప్ప‌టికీ...సుజ‌నా చౌద‌రి మాత్రం నోరెత్త‌లేదు. సోము వీర్రాజు ప్ర‌మాణ స్వీకారానికి  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి , స‌త్య‌కుమార్ త‌దిత‌ర పార్టీ ముఖ్య నేతలు హాజ‌ర‌య్యారు. కానీ సుజ‌నా చౌద‌రి గైర్హాజ‌ర్ కావ‌డంతో పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సుజ‌నా చౌద‌రిని పార్టీనే దూరం పెట్టిందా?  లేక రాజ‌ధానిపై త‌న అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని ఆవేద‌న‌తో దూరంగా ఉన్నారా? అనే అంశాల‌పై నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ఏది ఏమైన‌ప్ప‌టికీ కొన్ని రోజులుగా సుజ‌నా చౌద‌రి బీజేపీతో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. మున్ముందు ఆయ‌న వైఖ‌రి ఎలా ఉంటుందో చూడాలి. 

మెగాస్టార్ అస్సలు తగ్గట్లేదు

10 ప్యాక్ తో వస్తున్నా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?