cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కేసీఆర్‌ చాలించు అధిక ప్ర‌సంగమ‌న్న ఆర్‌కే

కేసీఆర్‌ చాలించు అధిక ప్ర‌సంగమ‌న్న ఆర్‌కే

ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని, తేడాలొస్తే అంతు తేలుస్తాన‌ని, ఆ వార్త రాసినోళ్ల‌కి క‌రోనా రావాల‌ని  తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌రోక్షంగా నోటికొచ్చినట్టు తిట్టినా....ఆంధ్ర‌జ్యోతి ఎండీ ఆర్‌కే ఊరికే ఎందుకున్నార‌బ్బా అని అంద‌రూ భావించారు. కేసీఆర్ నోటికి ప‌ని చెబితే...ఆర్‌కే మాత్రం త‌న క‌లానికి ప‌ని చెప్పాడు. త‌న‌ను శాప‌నార్థాలు పెట్టిన కేసీఆర్‌పై ఆంధ్ర‌జ్యోతిలో బుధ‌వారం రాసిన సంపాద‌కీయంలో తీవ్ర‌స్థాయిలో హిత‌వు ప‌లికారు. ‘ఏంటా అధిక‌ప్ర‌సంగం’ అని కేసీఆర్‌ను సంపాద‌కీయంలో ప్ర‌శ్నించారు.

‘శాప‌నార్థాలు’ శీర్షిక‌తో ఆంధ్ర‌జ్యోతిలో రాసిన సంపాద‌కీయంలో కేసీఆర్ వైఖ‌రిని త‌ప్పు ప‌ట్టారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నోటి దురుసే మేల‌ని కేసీఆర్‌ను చుల‌క‌న చేశారు. కేసీఆర్‌ను దూషించ‌డానికి చాలా తెలివిగా ట్రంప్‌ను తెర ముందుకు తెచ్చారు.

అమెరికా కేంద్ర జాతీయ ఆరోగ్య, మానవ సేవల ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ క్రిస్టి గ్రిమ్‌ తాజాగా ఇచ్చిన‌ నివేదికపై ఫాక్స్‌ న్యూస్‌ రిపోర్టర్‌ క్రిస్టిన్‌ ఫిషర్ అనే మ‌హిళా జ‌ర్న‌లిస్టు ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్‌ను ప్ర‌శ్నించ‌డం, అత‌ను ఇదేమిటి ఇలాంటి ప‌నికిమాలిన ప్ర‌శ్న వేశావ‌ని నిందించ‌డం గురించి సంపాద‌కీయంలో ప్ర‌స్తావించారు.  ఫాక్స్‌ న్యూస్‌ రిపోర్టర్‌ క్రిస్టిన్‌ ఫిషర్‌తో పాటు  ఎబిసి న్యూస్‌ రిపోర్టర్‌ జోనాథన్‌ కార్ల్‌తో కూడా ట్రంప్‌ అదే పద్ధతిలో వ్యవహరించారని పేర్కొన్నారు. గ్రిమ్‌ నివేదిక గురించి అడగగానే, ‘నువ్వొక పనికిమాలిన రిపోర్టర్‌వి’ అని ట్రంప్‌ గద్దించార‌ని, అంత‌టితో ఆగ‌కుండా ‘నువ్వొక చెత్త’ అని కూడా ట్రంప్ దూషించారని రాసుకొచ్చారు.

సంపాద‌కీయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎంత ఘాటుగా హిత‌వు చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వాక్యాలు చ‌ద‌వండి.

‘బాధ్యతలో విఫలమయినప్పుడు, పౌరసమాజం, ముఖ్యంగా మీడియా ఎత్తిచూపుతుంది. అది బాధ్యత. అది విధి. కర్తవ్యం. లోపాన్ని చూపవద్దంటే ఎట్లా? చూపిస్తే కోపం వస్తే ఎట్లా? పనికిమాలిన రిపోర్టర్‌ అనీ, చెత్త ప్రశ్న అనీ నోరుపారేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడికి అయినా, తెలంగాణ ముఖ్యమంత్రికి అయినా ఏమి అధికారం ఉన్నది?   కరోనా వంటి కల్లోలం కమ్ముకున్నప్పుడు, సమాజంలోని వివిధ శ్రేణులను కలుపుకుని పోయి, ఫలితాలను సాధించాలి కానీ, రెండు ప్రసంగాలకు ప్రజలు జేజేలు పలికారు కదా అని, ఇప్పుడు అధికప్రసంగానికి పాల్పడితే ఎట్లా?’...మీడియా క‌ర్త‌వ్యాన్ని సున్నితంగా చెబుతూనే , కేసీఆర్ నీ రెండు ప్రెస్‌మీట్ల‌కు జ‌నం జేజేలు ప‌లికార‌ని ఇప్పుడు అధిక ప్ర‌సంగం చేస్తే ఎలా అని వేమూరి రాధాకృష్ణ నేతృత్వంలో ఆంధ్ర‌జ్యోతి సంపాద‌కీయం చుర‌క‌లంటించింది.

‘ వైద్యులకు రక్షణ పరికరాలు లేవని, భద్రతా వాతావరణం లేదని ప్రభుత్వానికి గుర్తు చేస్తే, రాసినవాడికి కరోనా రావాలని పిల్లిశాపనార్థాలు పెడతారా? నాయకుడు మాట్లాడే పద్ధతేనా అది? అమెరికా నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉండగా, ట్రంపు నోటిదురుసు మాత్రమే మీకు ఆదర్శంగా కనిపించిందా? అతను కూడా కరోనా రావాలని శాపం వచ్చేదాకా వెళ్లలేదు!’

చూశారా కేసీఆర్ తిట్ల‌కు ఆర్‌కే ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంటున్నాడో! కేసీఆర్‌ది నోటి దురుసు అని, ఇంకా చెప్పాలంటే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తెలంగాణ సీఎంలాగా క‌రోనా రావాల‌ని శాప‌నార్థాలు పెట్ట‌లేద‌ని నిరసించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ట్రంప్ అంటే ఎలాంటి అభిప్రాయాలున్నాయో అంద‌రికీ తెలిసిందే. కానీ అంత‌టి నోటి దురుసున్న ట్రంప్‌...కేసీఆర్‌తో పోల్చుకంటే మంచి నాయ‌కుడ‌ని ఆర్‌కే చెబుతున్నాడు.

వైద్యుల‌కు ఆరోగ్య ర‌క్ష‌ణ క‌వ‌చాలు, ఇత‌రత్రా సిబ్బందికి కావాల్సిన సౌక‌ర్యాల‌ను ప్ర‌భుత్వం కాకుండా, ఆ ప‌త్రికాధిప‌తి చూసుకుంటాడా అనే కేసీఆర్ ప్ర‌శ్న‌కు ఆర్‌కే ఘాటైన స‌మాధానం ఇచ్చాడు. అదేంటో చద‌వండి...

‘ ఈ ఉపద్రవంలో మీడియా ఒక కీలకవ్యవస్థ. అది అర్థం కాకపోతే, పాలకులను ఎవరూ కాపాడలేరు.  ప్రభుత్వం చూడలేని వాటిని మీడియా చూస్తుంది, చూపిస్తుంది. అది ప్రజల కన్ను, ప్రజల అక్షరం. సమాజ ప్రయోజనాల కోసం ఈ తరుణంలో కొన్ని అంశాలలో ప్రభుత్వంతో కలసి నడుస్తుంది. అనేక అంశాలలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్నే నిలదీస్తుంది’

అయ్యా కేసీఆర్ మిమ్మ‌ల్ని ఎవ‌రూ కాపాడ‌లేర‌ని ఆర్‌కే శాప‌నార్థాలు పెట్టాడు. కేసీఆర్  చూడ‌లేంది మీడియాగా తాము చూడ‌ట‌మే కాదు చూపిస్తామ‌ని ఆర్‌కే హిత‌వు ప‌లికాడు. త‌మ‌ది ప్ర‌జా దృష్టి అని కేసీఆర్‌ను హెచ్చ‌రించాడు. అంతేకాదు ప్ర‌జ‌ల ప‌క్షాన కేసీఆర్‌ను నిల‌దీస్తూనే ఉంటామ‌ని ఆర్‌కే తేల్చి చెప్పాడు. ఇక ఏం చేయాలో తేల్చుకోవాల్సింది, నిర్ణ‌యించుకోవాల్సింది తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే బాల్‌ను కేసీఆర్ కోర్టులోకి ఆర్‌కే సంపాద‌కీయ రూపంలో పంపాడు.

లాక్ డౌన్ లో హైదరాబాద్ ఏరియల్ వ్యూ