
కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువు ఉమేశ్‌రావు నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. అలాగని ఆయన కిడ్నాప్ ఘటనను సమర్థించలేదు.
కేవలం అఖిలప్రియను మాత్రమే అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కిడ్నాప్ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు, ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు డ్రామా ఆడుతున్నారని ఉమేశ్‌రావు సంచలన ప్రకటన చేశారు.
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమేశ్‌రావు బోయనపల్లి కిడ్నాప్ ఉదంతంపై సంచలన విషయాలు చెప్పారు. అసలు కిడ్నాప్‌నకు గురైన ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు ఎంత మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు కాదని తేల్చి చెప్పారు. కేసీఆర్‌కు బంధువులైతే, తనకు కూడా బంధువులు అవుతారని, తానెప్పుడు వాళ్లను చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు.
హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో తప్పంతా ప్రభుత్వానిదే అని ఆయన ఆరోపించారు. హఫీజ్‌పేట భూమి మొత్తం ప్రభుత్వానిదే అని కలెక్టర్ తాజాగా ప్రకటించారని, కానీ పోలీసు కమిషనర్ చెబుతున్నది వేరుగా ఉందన్నారు.
అసలు హఫీజ్‌పేట భూమికి సంబంధించి ప్రవీణ్‌రావు పాత్ర ఏంటి? ఆ ఆస్తిని ప్రవీణ్‌రావు తాత లేక వాళ్ల నాన్న సంపాదించాడా? తదితర విషయాలను ప్రభుత్వమే తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవన్నీ తేలాలంటే కచ్చితంగా ప్రవీణ్‌రావును కూడా పోలీసులు విచారించాలని ఆయన కోరారు. అంతేకాదు, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రవీణ్‌రావును జైల్లో వేయాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం.
కేసీఆర్‌కు బంధువే కానప్పుడు ప్రవీణ్‌రావును కాపాడాల్సిన ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కలెక్టర్ స్టేట్మెంట్ ఒకలా, పోలీస్ కమిషనర్ చెబుతున్నది మరోలా ఉంటోందన్నారు. హఫీజ్‌పేట భూముల రిజిస్ట్రేషన్లు కూడా కాకుండా హోల్డ్‌లో పెట్టినట్టు కలెక్టర్ చెప్పారన్నారు. మరి రిజిస్ట్రేషన్లు ఎలా అవుతున్నాయని ఉమేశ్‌రావు ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలీసు కమిషనర్ స్టేట్మెంట్ ఇస్తున్నదొకటి, రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్నది మరొకటి అని ఆయన చెప్పుకొచ్చారు. పోలీసు కమిషనర్ కన్ఫ్యూజన్లో ఉన్నారని సీఎం కేసీఆర్ బంధువు ఉమేశ్‌రావు విమర్శించారు. భూమా అఖిలప్రియ విషయంలో పోలీసుల ట్రీట్మెంట్ను కూడా ఆయన తప్పు పట్టారు. అఖిలప్రియ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదని ఆయన గట్టిగా చెప్పారు.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఆ భూములతో సంబంధం లేనప్పుడు, ప్రవీణ్‌రావుకు మాత్రం ఏ విధంగా సంబంధం ఉంటుందని ఉమేశ్‌రావు ప్రశ్నించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ భూమి ఎవరిదో ఎందుకు తేల్చలేదని ఆయన ప్రశ్నించారు.
పోలీసులు, ప్రవీణ్‌రావు కుటుంబం ఆడుతున్న నాటకమని తాను అనుకున్నట్టు చెప్పారు. ప్రవీణ్‌రావుతో పోలీసులు లాలూచీ పడ్డారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ స్టేట్మెంట్ చూసిన తర్వాత పోలీసు కమిషనర్ వెంటనే ప్రవీణ్‌రావుపై కేసు పెట్టాలని డిమాండ్ చేయడం తాజాగా చర్చనీయాంశమైంది.