cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

తిరుప‌తి పోరులో టీడీపీ చీక‌టి ఒప్పందాలు?!

తిరుప‌తి పోరులో టీడీపీ చీక‌టి ఒప్పందాలు?!

తెలుగుదేశం పార్టీకి చీక‌టి ఒప్పందాలు.. లోలోప‌లి వ్య‌వ‌హారాలు..పైకి ఒక‌టి చేస్తున్న‌ట్టుగా క‌నిపించి, మ‌రోటి చేయ‌డాలు.. ఇవ‌న్నీ కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ చంద్ర‌బాబు నాయుడి చేతుల్లోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి అలాంటి ర‌చ్చ‌లెన్నో జ‌రిగాయి. అవ‌కాశ‌వాదానికి కేరాఫ్ అడ్ర‌స్ అయిన చంద్ర‌బాబు నాయుడు త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌తీయ‌డానికి బోలెడ‌న్ని మార్గాల‌ను అన్వేషిస్తూ ఉంటారు. 

చివ‌ర‌కు సొంత పార్టీని దెబ్బ‌తీసుకుని అయినా ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిని దెబ్బ‌తీయ‌డం అనేది చంద్ర‌బాబుకు కొత్త కాదు కూడా. తెలుగుదేశం గ‌త ప‌దేళ్ల చ‌రిత్ర‌ను ప‌రిశీలించినా.. కొన్ని సార్లు సొంతానికి దెబ్బ వేసుకుని కూడా ప్ర‌త్య‌ర్థిని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు కొన్ని క‌నిపిస్తాయి.

వైఎస్ జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన క‌డ‌ప ఎంపీ సీటు ఉప ఎన్నిక‌, పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప  ఎన్నిక ద‌గ్గ‌ర నుంచి టీడీపీ ఉప ఎన్నిక‌ల విష‌యంలో త‌ను గెల‌వ‌డం క‌న్నా జ‌గ‌న్ ను దెబ్బ‌తీయ‌డ‌మే ప‌నిగా వ్యూహాల‌ను అవ‌లంభించింది. 

ఇక జ‌గ‌న్ వెంట నిలిచిన ఎమ్మెల్యేల రాజీనామాల‌తో అప్ప‌ట్లో వ‌చ్చిన బై పోల్స్ లో ఏం జ‌రిగిందో కూడా వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్ప‌ట్లో జ‌గ‌న్ త‌ర‌ఫున నిలిచిన ఎమ్మెల్యేల‌ను ఓడించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు లోలోప‌లి మ‌ద్ద‌తు ఇచ్చిన ఘ‌న‌త తెలుగుదేశానిదే!

అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ కాదు. వైఎస్ జ‌గ‌న్ మాత్రం తెలుగుదేశం పార్టీకి ప్ర‌త్య‌ర్థి. అందుకే వ్యూహాత్మ‌కంగా తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థుల‌ను పెట్టిన‌ట్టే పెట్టి లోలోప‌ల మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించింది టీడీపీ. కాంగ్రెస్ ను ఎలాగైనా దెబ్బ కొట్టొచ్చ‌ని చంద్ర‌బాబుకు తెలుసు. 

ఊపు మీదున్న జ‌గ‌న్ ను దెబ్బ కొట్టడం మాత్రం అంత తేలిక కాదు. కాంగ్రెస్ అప్ప‌టికే ఐసీయూ స్టేజ్ లో ఉంది. అందుకే త‌మ‌కు డిపాజిట్లు కూడా కోల్పోవ‌డానికి రెడీ అయ్యి, క్యాడ‌ర్ ను పూర్తిగా కాంగ్రెస్ కు స‌పోర్ట్ చేసేలా చూశారు. అయితే అప్ప‌ట్లో బ‌లంగా వీచిన జ‌గ‌న్ గాలిలో చంద్ర‌బాబు నాయుడి వ్యూహం పార‌లేదు!

కాంగ్రెస్ చిత్త‌య్యింది, టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది! జ‌గ‌న్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి ఎంట‌ర‌య్యారు. నాటి ఉప ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్ కూడా సంపాదించుకోలేనంత ఓట‌మిని టీడీపీ ఎదుర్కొందంటే దానికి కార‌ణం.. లోలోప‌ల కాంగ్రెస్ కు స‌పోర్ట్ చేయ‌డ‌మే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా సొంత పార్టీ అభ్య‌ర్థుల‌ను వెర్రివాళ్ల‌ను చేయ‌డం కూడా చంద్ర‌బాబుకు కొత్త కాదు. పొత్తుల రాజ‌కీయాల్లో కూడా ఈ వైనాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. గాజువాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ను ప్ర‌చారానికి వెళ్ల‌కుండా చంద్ర‌బాబు నాయుడు అక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌కు ఏం సందేశం ఇచ్చాడో కూడా తెలిసిన సంగ‌తే! ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు కోసం చంద్ర‌బాబు నాయుడు సొంత పార్టీ అభ్య‌ర్థికి ఝ‌ల‌క్ ఇచ్చారు.

అయితే గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. ఇవ‌న్నీ ఔట్ డేటెడ్ రాజ‌కీయ వ్యూహాలు అయ్యాయి. కేవ‌లం ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిని ఓడించ‌డాన్నే ల‌క్ష్యంగా చేసుకుని చేసే రాజ‌కీయానికి ద‌క్కే ఫ‌లితాలు ఎలా ఉంటాయో పై ఉదాహ‌ర‌ణ‌లే స్ప‌ష్టం చేస్తాయి.

అయితే చంద్ర‌బాబుకు ఇప్పుడు ఛాయిస్ లేదు. త‌న మార్కు వ్యూహాల‌నే ఆయ‌న ఫాలో అవుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగా.. తిరుప‌తిలో కూడా అదే జ‌ర‌గ‌బోతోంద‌ని అప్పుడే టాక్ మొద‌లైంది. ఇప్ప‌టికే తిరుప‌తి బై పోల్ కోసం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు నాయుడు. అయితే ఎలాగూ ఇది గెలిచే బేరం కాదు. 

ఈ విష‌యం చంద్ర‌బాబుకూ తెలుసు. అందుకే తిరుప‌తి సీటును ఉచితంగా టీడీపీకి ఆఫ‌ర్ చేసిన‌ట్టున్నారు ముందుగానే. అయితే చంద్ర‌బాబు నీడ అధికారికంగా ప‌డ‌టం బీజేపీకి ఇష్టం లేన‌ట్టుంది. అందుకే ఆయ‌న మ‌ద్ద‌తును ఆ పార్టీ వ‌ద్ద‌ని చెప్పింది.

అయితే ఎలాగోలా క‌మ‌లం పార్టీ వాళ్ల‌ను మెప్పించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న చంద్ర‌బాబు తిరుప‌తి బై పోల్ లో క‌మ‌లం పార్టీ అభ్య‌ర్థికే లోలోప‌లి స‌హ‌కారం అందించే అవ‌కాశాలు లేక‌పోలేదు! ఇలాంటి వ్యూహాలు ఆయ‌న‌కు కొత్త‌వి కాక‌పోవ‌డంతో.. ఇప్పుడు చీక‌టి స‌హ‌కారాన్ని బీజేపీకి అందించి.. ఆ పార్టీని మెప్పించే వ్యూహాన్ని అనుస‌రించ‌బోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. 

ఒక్క‌సారి బీజేపీకి ద‌గ్గ‌రైతే ఆ పార్టీని మ‌ళ్లీ ఎలా తొలిచేయాలో చంద్ర‌బాబుకు తెలియ‌నిది కాదు. 18 స్థానాల ఉప ఎన్నిక‌ల‌ప్పుడు కాంగ్రెస్ కు ఎలా స‌హ‌క‌రించి ఆ పార్టీని మున‌గ‌మాను ఎక్కించారో, ఇప్పుడు బీజేపీనీ అదే రీతిలో మున‌గ‌మాను ఎక్కించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉండ‌నే ఉన్నాయి.

ఇక సొంత పార్టీ అభ్య‌ర్థుల‌ను శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించ‌డం కూడా చంద్ర‌బాబుకు కొత్త కాదు. తిరుప‌తి బై పోల్ లో అలాంటి రాజ‌కీయ‌మే సాగే అవ‌కాశాలున్నాయ‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అస‌లు క‌థేమిటో ఉప ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌ల‌య్యాకా పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండుకే కిస్ పెట్టాను

 


×