
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల మంజూరులో జగన్ సర్కార్ వింత ధోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. అక్రిడిటేషన్ల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై జర్నలిస్టులందరూ ఆగ్రహంగా ఉన్నారు.
జగన్ సర్కార్ వచ్చిన తర్వాత అక్రిడిటేషన్ల గడువును ఆరునెలలు, మూడు నెలలకు ఒకసారి చొప్పున పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. 2021 , జనవరిలో కొత్త కార్డులు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టినట్టు ప్రభుత్వ సమాచారశాఖ చెప్పుకుంటూ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఎంతో ముందుగా జర్నలిస్టుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. సమాచారశాఖ ఉన్నతాధికారులు కోరినట్టు జర్నలిస్టులందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది జనవరికి అక్రిడిటేషన్లు మంజూరు చేయాల్సి ఉంది.
అయితే అనేక నిబంధనల నేపథ్యంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో ప్రభుత్వం భారీగా కోత విధించడంపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. అక్రిడిటేషన్లనేవి ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇచ్చేవి కాదు.
అది జర్నలిస్టుల హక్కు. ప్రభుత్వంలో లెక్కలేనంత మంది జర్నలిస్టు మేధావులు వివిధ హోదాల్లో ఉన్నారు. కానీ గతంలో ఎప్పుడూ లేనంతగా అక్రిడిటేషన్ల మంజూరులో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగింది. నకిలీ జర్నలిస్టుల ఏరివేత సంగతేమో గానీ, నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేయడం ఏంటనే ప్రశ్నలు , నిలదీతలు ఎదురవుతున్నాయి.
మరీ ముఖ్యంగా రాష్ట్ర మీడియా సమన్వయ కమిటీ భేటీలో జర్నలిస్టుల సంఘాలకు, జర్నలిస్టు ప్రతినిధులకు చోటు కల్పించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రెస్ కౌన్సిల్ (పీసీఐ) జగన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసు జారీ చేసింది.
గత నెల 8న విడుదల చేసిన జీవోలో పేర్కొన్న నిబంధనలు తమ మోడల్ అక్రిడేషన్ మార్గదర్శ కాల (2004) కు అనుగుణంగా లేవని పీసీఐ పేర్కొంది. జీవోలోని సవరణలపై వివరణ కోరుతూ నోటీసు జారీ చేయాలని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ సేకే ప్రసాద్ ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనార్హం.
ఇంతకూ జగన్ సర్కార్కు ఎల్లో మీడియాపై కోపమా? లేక జర్నలిస్టులందరిపైనా? అనేది ముందుగా తేల్చుకోవాలి. ఎల్లో మీడియా యజమానులతో తేల్చుకోవాలే తప్ప, జర్నలిస్టులతో ఆడుకోవడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లో మీడియా అధిపతులను ఏమీ చేసుకోలేక, నిస్సహాయులైన తమపై పడడం ఏంటని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న జర్నలిస్టు వ్యతిరేక విధానాల వల్ల ...ఇప్పుడు ప్రతి ఒక్కర్నీ చెడ్డ చేసుకున్నట్టు అవుతోంది. ఈ ధోరణి ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలాగా చిన్న ఉద్యోగులైన జర్నలిస్టుల హక్కులను కాలరాయడం ఏంటి?
గవర్నర్ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్