విశ్వనగరం హైద్రాబాద్లో సగం మంది ఓటర్లు, అసలు రాజకీయాల గురించి పట్టించుకోవడంలేదు. రాజకీయాలంటే అసలు వారికి ఆసక్తే లేదు. ఓటు హక్కు వున్నోళ్ళ సంగతి ఇది. 50 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో యాకుత్పురా అనే నియోజకవర్గంలో అయితే 33 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. అత్యంత అవమానకరమైన పరిస్థితి ఇది.
100 శాతం పోలింగ్ అనేది కలలో కూడా జరిగే పరిస్థితి కన్పించడంలేదు. 'మా ఓట్లు లేవు మొర్రో..' అంటూ పోలింగ్ బూత్ల వద్ద జనం గగ్గోలు పెడుతోంటే, వున్న ఓట్లలోనే 50 శాతం ఓట్లు పోల్ కాలేదంటే, అసలు 'ఎన్నికలు' అన్న మాటకు అర్థం వుందా.? ఆ 50 శాతం మంది, వివిధ రాజకీయ పార్టీలకు ఓటేశామనుకుంటే, 25 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి విజయం సాధిస్తే.. దాన్ని కూడా ఓ గెలుపు అనగలమా.?
రాజకీయ నాయకులు, న్యూస్ ఛానళ్ళ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఇంత దారుణమైన స్థాయిలో ఓటింగ్ జరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేయాలి. ఎవరు గెలిచినా, అది అసలు గెలుపే కాదన్న చర్చ రాజకీయ పార్టీల్లోనూ జరగాలి. కానీ, అలాంటివేమీ జరగవు. నిస్సిగ్గుగా, 'జనం మా వైపే వున్నారు.. మమ్మల్నే గెలిపించబోతున్నారు..' అంటూ అరుపులు కేకలతో విరుచుకుపడిపోతుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.?
50 శాతం పోలింగ్ నమోదైన చోట, ఓ అభ్యర్థి 26 శాతం ఓట్లతో గెలిస్తే, ఎన్నికల్ని తిరస్కరించిన 50 మంది, ఆ అభ్యర్థిని కూడా తిరస్కరించినట్టే కదా. అంటే, మొత్తంగా 50 ప్లస్ 24.. వెరసి, 74 శాతం మంది వద్దనుకున్న అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించాడన్నమాట. దీన్ని మన ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనంగా మనం తప్పక ఫీలవ్వాల్సిన దుస్థితి.
ఓటింగ్ పెంచడానికి ఎన్నికల కమిషన్ ఎన్నో చర్యలు చేపడ్తోంది. 'ఓటరు అవగాహన పరుగు' అనీ, ఇంకోటనీ.. ఇవన్నీ జస్ట్ పబ్లిసిటీ స్టంట్స్గానే మిగిలిపోతున్నాయి. 'సొంతూళ్ళకు వెళ్ళి, అక్కడ ఓటేశారు..' అన్నది సిల్లీ రీజన్. ఎందుకంటే, హైద్రాబాద్లో ఓటు హక్కున్నవాళ్ళకు, సొంతూళ్ళలో ఓటు హక్కు వుండే అవకాశమే లేదు కదా.!
ఏదిఏమైనా, భాగ్యనగరం ఓటర్లు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది. రాజకీయాలపై ఏహ్యభావంతోనో, మరో కారణంతోనో ఓటు వేయకుండా వుండడమంటే, మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మనకే గౌరవం లేనట్టు కదా.! అతి తక్కువ ఓట్లతో, అతి ఎక్కువ వ్యతిరేకతతో ఓ అభ్యర్థి విజయం సాధించాడంటే.. అది ఖచ్చితంగా ఓటరు తన నిర్లక్ష్యం కారణంగా ఆ వ్యక్తికి ఇచ్చిన అద్భుతమైన అవకాశమే.