
శాంతిభద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీదనే వుందన్నది నిర్వివాదాంశం. అయితే, ప్రజాస్వామ్యయుత పద్ధతుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు పోరాటాలు చేసేందుకు కలిగి వున్న 'హక్కుల్ని' పోలీసులు కాలరాసేయాలనుకుంటే ఎలా.?
2014 ఎన్నికల్లో, కాపు సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్ కల్పిస్తామంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం విదితమే. మూడేళ్ళు పూర్తయిపోయినా ఇప్పటిదాకా, ఈ అంశంపై చంద్రబాబు ముందడుగు వేసింది లేదు. దాంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనకు తోచిన రీతిలో ఉద్యమాన్ని నడుపుతున్నారు.
కానీ, పోలీసులు అడుగడుగునా ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తూనే వున్నారు. పైగా, ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో సాక్షాత్తూ పోలీస్ బాస్ బెదిరింపులకు దిగుతుండడం గమనార్హం. 'అనుమతి లేని పాదయాత్రల్లో, నిరసనల్లో ప్రజలెవరూ భాగస్వాములు కావొద్దు.. ముఖ్యంగా యువత ఇలాంటి పనుల జోలికి వెళ్ళొద్దు..' అంటూ పోలీస్ బాస్ చేసిన హెచ్చరికలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఇది ఇక్కడితో ఆగుతుందా.? ముందు ముందు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేయబోయే పాదయాత్రకీ వర్తిస్తుందా.? అన్నదిప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు కాబట్టి, పాదయాత్ర జరగనిచ్చే ప్రసక్తే లేదని చెబుతోంది చంద్రబాబు సర్కార్. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకూ ఇదే తరహా సమస్యలు తప్పకపోవచ్చు. అయితే ఓ రాజకీయ పార్టీగా, వైఎస్సార్సీపీ అత్యంత వ్యూహాత్మకంగా తమ అధినేత పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.
రూట్ మ్యాప్ సహా అన్ని అంశాలపై ముందుగానే పోలీసు శాఖకు సమాచారం అందిస్తుంది. నిజానికి, వైఎస్ జగన్ పాదయాత్రకు భద్రత కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమ్మీదనే వుంటుంది. కాబట్టి, జగన్ పాదయాత్రకు మామూలుగా అయితే ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచీ అడ్డంకులు వుండకపోవచ్చుగాక. కానీ, ఏదో ఒక గలాటా జరిగితే దాన్ని సాకుగా చూపి, జగన్ పాదయాత్రకీ టీడీపీ సర్కార్ కొర్రీలు పెట్టే అవకాశమైతే లేకపోలేదు. అయినా, పోలీస్ బాసే ప్రజాస్వామ్యయుత పోరాటాలపై హెచ్చరికలు షురూ చేశాక, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదొకటి వుంటుందని ఎలా అనుకోగలం.?