Advertisement


Home > Politics - Political News
అబ్బో... ఓబీసీల‌పై టీడీపీకి ఎంత ప్రేమో...

రాజ్యస‌భ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థి హ‌రిప్రసాద్‌కు ఓటు వేయ‌డానికి టీడీపీ ప్రధానంగా రెండు కార‌ణాలు చూపింది. ఒక‌టి హ‌రిప్రసాద్ మూడోద‌ఫా రాజ్యస‌భకు ఎన్నికై అనుభ‌వం గ‌డించ‌డం, రెండోది ఆయ‌న ఓబీసీ నేత కావ‌డం. ఈ మాట‌లు చెప్పింది స్వయాన టీడీపీ రాజ్యస‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి. కేవ‌లం ఓబీసీ నేత కావ‌డం వ‌ల్లే టీడీపీ మ‌ద్దతు ఇచ్చిందా? లేక ఏపీకి విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌క మోడీ స‌ర్కార్ తీవ్ర అన్యాయం చేస్తుండ‌డాన్ని నిర‌సిస్తూ ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఓటు వేశారా అనేది తేల్చాలి. ఒక‌వేళ ఎన్‌డీఏ అభ్యర్థి ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారై ఉంటే మ‌ద్దతు ప‌లికేవారా? టీడీపీ మ‌ద్దతు కులానికా లేక ఇత‌ర అంశాలేవైనా ముడిప‌డి ఉన్నాయా అనేది స్పష్టంచేయాలి.

ఏ ప‌నిచేసినా రాజ‌కీయ ప్రయోజ‌నాల‌ను ఆశించే టీడీపీ నేత‌లు ఆచ‌ర‌ణ‌లో తామెంత నిజాయ‌తీగా ఉన్నామో ఒక్కసారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటే మంచిది. కొన్నినెల‌ల క్రితం ఏపీలో రాజ్యస‌భ ఎన్నిక‌ల ప్రక్రియ జ‌రిగింది. టీడీపీకి రెండు, వైసీపీకి ఒక రాజ్యస‌భ సీటు ద‌క్కాయి. నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాక‌ర్‌రెడ్డికి వైసీపీ రాజ్యస‌భ సీటు క‌ట్టబెట్టింది. టీడీపీ మాత్రం చివ‌రి వ‌ర‌కు నాన్చుతూ హ‌డావుడి చేసింది. ఒక సీటు సీఎం ర‌మేష్‌కు ఇచ్చి, మ‌రో సీటుపై స‌స్పెన్స్ కొన‌సాగించింది.

ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ‌ర్ల రామ‌య్యను అత్యున్నత చ‌ట్టస‌భ అయిన‌ రాజ్యస‌భకు పంపుతూ బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌పై చంద్రబాబు ప్రేమాభిమానాలు చాటుకుంటున్నార‌ని ఎల్లో మీడియాలో ప్రచారాన్ని ఊద‌ర‌గొట్టారు. అంతేకాదు, వ‌ర్ల రామ‌య్య ఒకఅడుగు ముందుకేసి తాను రాజ్యస‌భ‌లో అడుగు పెట్టిన‌ట్టు మైమ‌రిచి వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై తిట్ల వ‌ర్షాన్ని కురిపించారు. చివ‌ర‌కు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్రకుమార్‌ను ఎంపిక చేశారు. ఈయ‌న సీఎం సొంత సామాజిక‌వ‌ర్గ నేత‌. అంతేకాదు సీఎం ఓటుకు నోటు కేసుకు సంబంధించిన లాయ‌ర్ అని తేలింది. చివ‌రికి వ‌ర్ల రామ‌య్యకు తీవ్ర నిరాశ మిగిలింది.

ఇప్పుడు రాజ్యస‌భ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి హ‌రిప్రసాద్ ఓబీసీ కావ‌డం వ‌ల్లే  మ‌ద్దతు ఇస్తున్నామ‌న‌డం విచిత్రంగా ఉంది. టీడీపీ మాత్రం రాజ్యస‌భ సీట్లను సొంత సామాజిక‌వ‌ర్గీయుల‌కు ఇచ్చుకుంటూ, కాంగ్రెస్‌ గౌర‌వించి రాజ్యస‌భ‌కు  పంపిన అభ్యర్థికి మ‌ద్దతు ఇచ్చినంత మాత్రాన ఆ సామాజిక‌వ‌ర్గంపై ప్రేమ ఉన్నట్టా? ఇదెంత వ‌ర‌కు స‌మంజ‌స‌మో టీడీపీ వారు జ‌వాబు చెప్పాలి. వ‌ర్ల రామ‌య్యను రాజ్యస‌భ‌కు పంపేందుకు ఏవి అడ్డంకిగా నిలిచాయో టీడీపీ అధిష్టానం బ‌హిరంగ‌ప‌ర‌చాలి.

బాబు హ‌యాం వ‌చ్చేస‌రికి టీడీపీ ప‌ల్లకీ మోయ‌డానికి త‌ప్ప బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల వారు అత్యున్నత చ‌ట్టస‌భ‌ల్లో అడుగు పెట్టడానికి అర్హులు కాదా?
-సొదుం