Advertisement


Home > Politics - Political News
సంక్రాంతి తర్వాత సమరశంఖం?

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే అన్ని ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యం. కాని అన్ని కలసి కూటమి ఏర్పాటు చేస్తాయనే నమ్మకం లేదు. పొత్తుల గురించి కసరత్తులు సాగుతున్నాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు ఎదుగుతున్న తీరు కనబడుతోంది. అది బలం పుంజుకుంటోందన్న అభి ప్రాయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం వ్యక్తం చేశారు. బీజేపీ కంటే కాంగ్రెస్‌ డేంజర్‌ అన్నారాయన.

బీజేపీ రాష్ట్ర నాయకులు టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ మీద ఘాటు విమర్శలు చేస్తుండగా, కేంద్ర మంత్రులు, ఢిల్లీ నాయ కులు హైదరాబాదు వచ్చినప్పుడల్లా సీఎంను ఆకా శానికి ఎత్తేస్తూ పథకాలు భేష్‌ అంటున్నారు. దీంతో బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు. అధికార పార్టీకి తాము ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్నా ఇప్పుడా పరిస్థితి కనబడటంలేదు. టీడీపీ పరిస్థితి గందరగోళంగా ఉంది కాబట్టి దాన్ని గురించి చెప్పు కునేందుకు అవకాశం లేదు.

ఈ నేపథ్యంలో కాంగ్రెసు ఒక్కటే కనబడుతున్నా కేసీఆర్‌కు సరితూగగలిగే నేత ఆ పార్టీలో లేడు. తాజాగా టీడీపీ నుంచి రేవంత్‌ రెడ్డి కాంగ్రెసులో చేరినా పార్టీలోని వ్యతిరేక వర్గం ఆయన్ని కట్టడి చేయ వచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీలో ఉన్నంత స్వేచ్ఛ కాంగ్రెసులో ఉండదంటున్నారు. అంటే ప్రత్యామ్నాయ పార్టీ ఉన్నంతమాత్రాన చాలదు. ప్రత్యామ్నాయ నాయకుడూ ఉండాలి.

అలాంటి నాయకుడు ఎవరు? అతను తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ మాత్రమేనని కొందరి అభిప్రాయం. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి సర్కారుకు వ్యతిరేకంగా పోరాడుతున్నా శక్తి సరిపోవడంలేదు. పోరు పరిమితంగా ఉంది. అసలైన పోరాటం చేయా లంటే రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగా ల్సిందే. చాలాకాలంగా ఊహాగానంగా మిగిలిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పార్టీ స్థాపన కొత్త ఏడాదిలో సంక్రాంతి తరువాత సాకారమవుతుందని రాజకీయ జేఏసీ నేతలు పలువురు చెబుతున్నారు.

''కోదండరామ్‌ పార్టీ ఏర్పాటు చేసి తీరుతారు. ముసుగులో గుద్దులాటలు వద్దు. ఆయనను విలేక రులు ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పరు. అంతా సిద్ధమైపోయింది. పార్టీకి పెట్టేందుకు మూడు నాలుగు పేర్లు సిద్ధం చేసుకున్నాం. సంక్రాంతి తరు వాత కోదండరామ్‌ పార్టీని ప్రకటిస్తారు'' అని చెబు తున్నారని సమాచారం. పార్టీ పెట్టడానికి ఇదే సరైన సమయమని, జాప్యం చేయవద్దని జేఏసీ నాయకులు ప్రొఫెసర్‌పై ఒత్తిడి చేస్తున్నారు.

ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదని అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్‌-కోదండకు మధ్య ఉప్పు నిప్పులా ఉంది. నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారుడిగా, పోరాట యోధుడిగా అభిమానించేవారు చాలామంది ఉన్నా రు. పార్టీ పెడితే కలిసి పనిచేసేందుకు సిద్ధపడే ప్రజా సంఘాలు, కొన్ని పార్టీలూ ఉన్నాయి. వ్యక్తిగతంగానో లేదా జేఏసీ తరపునో రాజకీయ పార్టీ పెట్టే అవకాశం లేదని ఓ సందర్భంలో చెప్పిన ఈ ప్రొఫెసర్‌ కొంత కాలం కిందట రాజకీయ పార్టీ పెడతానని అర్థమొ చ్చేలా మాట్లాడారు.

'రాజకీయ అభివ్యక్తీకరణ ఉం టుంది' అన్నారు. రాజకీయ అభివ్యక్తీకరణ బలంగా చేయాలంటే పార్టీ ఉండాల్సిందే కదా. రాజకీయ అభి వ్యక్తీకరణ పార్టీ రూపంలో ఉంటుందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. అంటే తాను రాజకీయ పార్టీ పెట్టేది లేదని స్పష్టంగా చెప్పలేదు. 'రాజకీయాలు బాగాలేనప్పుడు సమాజాన్ని తిట్టుకుం టూ కూర్చునే బదులు బాగుచేసే ప్రయత్నం చేయాలి.

ఆ ప్రయత్నంలో విజయం దక్కకపోయినా కొంత ఫలితం ఉంటుంది' అన్నారు. ఇలా అస్పష్టంగా మాట్లాడిన కోదండరామ్‌ సం క్రాంతి తరువాత పార్టీ ప్రకటన చేసి నేరుగా రంగం లోకి దిగుతారేమో...! సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం ఘన విజయం సాధించిన వెంటనే నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్‌లో ఆనందం కంటే ఎక్కువగా ఆవేశం కట్టలు తెంచుకుంది. కోదండరామ్‌ మీద, కాంగ్రెసు పార్టీ మీద నిప్పులు కురిపించారు. ప్రొఫె సర్‌పై తనకు ఎంతటి ఆగ్రహం, ఆవేశం ఉన్నాయో మొహమాటం లేకుండా బయటపెట్టుకున్నారు. పూచికపుల్ల మాదిరిగా తీసి పారేశారు. కనీస గౌరవం ఇవ్వకుండా 'వాడు' అంటూ మాట్లాడారు.

'కోదండరామ్‌ కెపాసిటీ నాకు తెలుసు. వాడు చాలా చిన్నవాడు' అన్నారు. 'సాగరహారం వీడు చేసిం డా?' అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదన్నట్లుగా మాట్లాడారు. దమ్ముంటే పార్టీ పెట్టమంటూ సవాల్‌ చేయడం కీలకం. జేఏసీ ముసుగు తీసేసి నేరుగా తనను ఢీకొట్టాలని కేసీఆర్‌ సవాల్‌ చేయడం ఇదే మొదటిసారి. 'పార్టీ పెడితే తెలుస్తుంది. పార్టీ పెట్టుడంటే పాన్‌డబ్బా పెట్టుడా?' అని రెచ్చగొట్టేలా మాట్లాడారు. మరి కోదండరామ్‌ కేసీఆర్‌ సవాల్‌ను సీరియస్‌గా స్వీకరించి వచ్చే ఎన్ని కలనాటికి పార్టీ పెడతారా? ఆ ఛాలెంజ్‌ను తేలిగ్గా తీసుకొని వదిలేస్తారా?

-నాగ్‌ మేడేపల్లి