Advertisement


Home > Politics - Political News
అఖిలప్రియ బాధ్యత ఎంత?

ఆంధ్రప్రదేశ్‌లో మూడున్నరేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో కృష్ణా నదిలో బోటు మునక రెండో అతి పెద్ద ప్రమాదం. గోదావరి పుష్కరాల మొదటి రోజునే తొక్కిలాట జరిగి ముప్పయ్‌మంది చనిపోయిన ఘటనను జనం ఇంకా మర్చిపోలేదు. ఈ ప్రమాదానికి కారణం పుష్కరాలపై బాబు వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా చేసిన అతి ప్రచారం, మొదటిరోజు ఆయన రాక సందర్భంగా చేసిన హడావుడి, డాక్యుమెంటరీ చిత్రీకరణ, నిర్లక్ష్యం వగైరాలు కారణాలు.

వాస్తవానికి ఈ దుర్ఘటనకు చంద్రబాబు బాధ్యత తీసుకోవాలని అప్పట్లో అనేకమంది అభిప్రాయపడ్డారు. ఆయన అలాంటి పని చేయరు కాబట్టి కారకులెవరో తేలుస్తామంటూ ఏకసభ్య కమిషన్‌ వేశారు. వచ్చే ఎన్నికలనాటికైనా దాని నివేదిక వస్తుందా? వచ్చినా అందులోని విషయాలు వెల్లడవుతాయా? అయినా కారకులపై చర్యలుంటాయా? చెప్పలేం.

తాజాగా జరిగిన కృష్ణా నది దుర్ఘటనకు ఎవరినైనా బాధ్యులను చేసి శిక్ష వేస్తారా? మాయ మాటలతో కాలం వెళ్లబుచ్చి, జనం దాన్ని మర్చిపోయేలా చేసి గమ్మున ఉంటారా? ఏపీలో విపరీతమైన అవినీతికి ఈ దుర్ఘటన ఉదాహరణ. టీడీపీ అనుకూల మీడియాతోపాటు దాని వ్యతిరేక మీడియా, ఆంగ్ల మీడియా కూడా మితిమీరిన అవినీతి, రాజకీయ నాయకుల ప్రమేయం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఘోషిస్తున్నాయి. పర్యాటక శాఖ పాడియావు మాదిరిగా దొరకడంతో దాన్నుంచి సాధ్యమైనంతమేరకు పిండుకుందామని రాజకీయ నాయకులు ఆత్రపడటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. అవినీతిని సహించనని చంద్రబాబు చెబుతున్న మాటలు డొల్ల అని అర్థమవుతోంది.

ఈ దుర్ఘటనకు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ బాధ్యత ఎంత? టూరిజం వ్యవహారాల్లో ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఎమ్మెల్యేలు, ఇతర మంత్రులు, బడా 'పచ్చ' నాయకులు ఎలా చక్రం తిప్పుతున్నారు?...ఇదంతా ముఖ్యమంత్రి బయటకు తీస్తారా? విజయవాడలోనే ఉంటూ రోజూ గంటల తరబడి శాఖలవారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రికి టూరిజం శాఖలో ఏం జరుగుతోందో తెలియదా? అఖిలప్రియ పనితీరు బాగాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. దీనిపై ఆమెను ఎప్పుడైనా మందలించడమో, క్లాసు తీసుకోవడమో చేశారో లేదో తెలియదు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అవినీతి పనులు చాలావరకు ముఖ్యమంత్రికి తెలుసు.

గతంలో ఒకటి రెండు సందర్భాల్లో కొందరు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరాలు వినిపించినప్పుడు సీఎం వారిని పిలిపించి 'మీ అవినీతి పనులన్నీ నాకు తెలుసు. అవి బయటపెట్టానంటే రాజకీయ జీవితం మటాష్‌ అవుతుంది' అని హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేల మీద నమోదైన క్రిమినల్‌ కేసులను ఎత్తేశారు. నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న అకృత్యాలు ఆయనకు తెలియవా? ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉంది.

కృష్ణా నదిలో జరిగిన దుర్ఘటన విషయంలోనూ చంద్రబాబు నిక్కచ్చిగా, కఠినంగా వ్యవహరిస్తారా? అనేది అనుమానమే. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతుండగా ఆయన అధికారులను బాధ్యులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలొస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన పడవను నడిపేందుకు ఓ అధికార తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా నాయకులు రంగప్రవేశం చేశారు.

రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌ సంస్థకు చెందిన ఈ పడవను టూరిజం శాఖ విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేసినప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి అధికారులపై ఒత్తిడి చేసి దాన్ని విడుదల చేయించినట్లు ఓ ఆంగ్ల పత్రిక సమాచారం. ఆయన విడుదల చేయిస్తే మంత్రి అఖిలప్రియ ఏం చేస్తున్నట్లు? ఆ మంత్రికి భయపడిందా? ప్రయివేటు సంస్థతో లాలూచీ పడిందా? పర్యాటక శాఖలో ప్రయివేటు సంస్థల హవా జోరుగా నడుస్తోంది. సిండికేట్‌ వ్యవహారాలు నడుపుతోంది. వెనక ఉన్నవారంతా టీడీపీ నేతలు, మంత్రులే.

ఈ శాఖలో అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడంలేదనేది మీడియా సమాచారం. నాయకులు అండదండలు చూసుకొని ప్రయివేటు సంస్థలవారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రయివేటు సంస్థల ద్వారానే టూరిజం బాగా అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయంతో సర్కారు ఆ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది. అయితే ఈ సంస్థలకు పడవల నిర్వహణలో, ఇతర విషయాల్లో అనుభవం లేదు. సరైన భద్రతా వ్యవస్థ కూడా లేదు. ఎలాంటి ముందస్తు పరీక్షలు లేకుండానే అనుమతులు ఇస్తున్నారు. ఈ విషయంలో అధికారులు నిబంధనల ప్రకారం పోవాలనుకున్నా 'పచ్చ' నాయకులు పడనివ్వడంలేదు.