Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్య‌య్యో అఖిలప్రియ‌...!

అయ్య‌య్యో అఖిలప్రియ‌...!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ పూర్తిగా ఏకాకి అయ్యిన‌ట్టే క‌నిపిస్తోంది. భూమా కుటుంబం, వారి బంధువ‌ర్గం ఆమెను పూర్తిగా ప‌క్క‌న పెట్టార‌నే ప్ర‌చారం కొంత కాలంగా జ‌రుగుతోంది. 

ఇటీవ‌ల ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా శోభ‌, నాగిరెడ్డి దంప‌తుల విగ్ర‌హాల‌ను భూమా కుటుంబ స‌భ్యుడు, ఆ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ భూమా కిషోర్‌రెడ్డి త‌న సొంత స్థలంలో ఏర్పాటు చేశారు. వీటి ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి భూమా అఖిల‌ప్రియ‌కు త‌ప్ప‌, మిగిలిన వాళ్లంద‌రికీ ఆహ్వానాలు వెళ్లాయి. దీన్ని జీర్ణించుకోలేని అఖిల‌ప్రియ పిల‌వ‌ని పేరంటానికి వెళ్లి కిషోర్‌రెడ్డి కంటే ముందే వెళ్లి విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించి అభాసుపాల‌య్యారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా అఖిల‌ప్రియ‌ను నాగిరెడ్డి బంధువులు, ఆత్మీయులు దాదాపు బ‌హిష్క‌రించార‌నేందుకు మ‌రో రెండు ఉదాహ‌ర‌ణ‌ల గురించి చెప్పుకోవ‌చ్చు. హైద‌రాబాద్‌లో ఆదివారం బ‌న‌గాన‌పల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి నిశ్చితార్థం జ‌రిగింది. ఈ వేడుక‌కు భూమా అఖిల‌ప్రియ‌, ఆమె త‌మ్ముడు జ‌గత్‌విఖ్యాత్‌ల‌కు త‌ప్ప‌, బంధువులంద‌రికీ ఆహ్వానాలు వెళ్లాయి. కాట‌సాని రామిరెడ్డి భూమా కుటుంబానికి అత్యంత స‌మీప బంధువు. 

కాట‌సాని రామిరెడ్డి కుమార్తెకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డితో వివాహం జ‌రిగింది. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి అఖిల‌ప్రియ చెల్లెల‌య్యే విష‌యం తెలిసిందే. అలాంటిది చెల్లిని బామ్మ‌ర్ది నిశ్చితార్థానికి పిల‌వ‌క‌పోవ‌డంతో కుటుంబ విభేదాలు మ‌రోసారి బ‌య‌ట ప‌డ్డాయి.

అలాగే భూమా నాగిరెడ్డి అత్మీయుడైన ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జ‌స్విత‌రెడ్డి నిశ్చితార్థ వేడుక కూడా ఆదివారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాతో ఏవీ సుబ్బారెడ్డి వియ్యం అందుకుంటున్న విష‌యం తెలిసిందే. బొండా ఉమా కుమారుడు సిద్ధార్థ్‌, జ‌స్విత‌రెడ్డి అమెరికాలో క‌లిసి చ‌దువుకుంటూ ప్రేమ‌లో ప‌డ్డారు. పెద్ద‌ల అంగీకారంతో వివాహ నిశ్చ‌యమైంది. 

ఈ నేప‌థ్యంలో నిశ్చితార్థ వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌కు కూడా అఖిల‌ప్రియ‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మొత్తానికి అఖిల‌ప్రియ‌ను బంధువులు, పార్టీ నేత‌లు పూర్తిగా దూరం పెట్టార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ ప‌రిణామాల‌న్నీ గ‌మ‌నిస్తే రాబోవు రోజుల్లో అఖిల‌ప్రియ‌కు రాజ‌కీయంగా గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?