Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆయనకు తెలిసింది విధేయత ఒక్కటే

ఆయనకు తెలిసింది విధేయత ఒక్కటే

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్ను మూయడంతో వినయ విధేయ రామా వంటి రాజకీయ నాయకుల శకం ముగిసిందనే చెప్పుకోవాలి. రోశయ్య విలువలకు కట్టుబడిన నాయకుడు అనడం కంటే విధేయతకు కట్టుబడిన నాయకుడు అనడమే సముచితం. విధేయతకు కట్టుబడిన నాయకుడు విలువల విలువలను వలిచివేయడు. 

రోశయ్య చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. కానీ ఎప్పుడూ తనను తాను ఎక్కువ చేసుకోలేదు. తనను గొప్పవాడిగా చిత్రించుకోలేదు. ఏ ముఖ్యమంత్రిని డామినేట్ చేసి వ్యవహరించలేదు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అధిష్టానం చెప్పిన పని చేయడమే ధర్మమని చెప్పారు. పార్టీ హైకమాండ్ ఏది చెబితే అదే తనకు వేదవాక్కని అన్నారు. 

ఆయనకు వర్గాలు లేవు. ముఠాలు కట్టడం తెలియదు. గ్రూపులు కట్టడం తెలియదు. పదవుల కోసం పోటీ పడటం తెలియదు. పదవుల కోసం పార్టీ మారడం తెలియదు. పదవుల కోసం ఆశ పడటం తెలియదు. అక్రమ సంపాదన తెలియదు. వారసత్వ రాజకీయాలు తెలియవు. ఆయనకు తెలిసింది ఒకే ఒక్కటి. అదే విధేయత. 

తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అరెస్టు చేయించి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.అధిష్టానం ఆదేశాల మేరకు ఆ విధంగా చేసి విధేయత చాటుకున్నారు తప్ప కేసీఆర్ మీద ఆయనకు కోపం, ద్వేషం లేవు. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించారు  అంతే. 

అందుకే  సీఎం కేసీఆర్ రోశయ్య అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించి గౌరవిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి రోశయ్య సీఎం కావాలని కోరుకోలేదు. జగన్ ఆ పదవి కోరుకొని రచ్చ చేసినప్పుడు రోశయ్య సీనియారిటీని గౌరవించి అధిష్టానం సీఎం పదవి అప్పగించింది.  

రోశయ్య విధేయుడేగాని రాష్ట్రాన్ని పాలించే సమర్ధత ఉన్నవాడు కాదు. రాష్ట్రాన్ని పాలించాలంటే అనేక టక్కుటమార విద్యలు తెలిసి ఉండాలి. అవి రోశయ్యకు తెలియవు. అసెంబ్లీలో చాలాసార్లు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కానీ ఏనాడూ ఇప్పటి నాయకుల్లా బూతులు తిడుతూ పైశాచిక ఆనందాన్నిపొందలేదు. ప్రభుత్వాన్ని రక్షించడం కోసం ఎంతైనా వాదించేవారు. ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండాలనే కోరిక లేదు కాబట్టే అధిష్టానం ఆదేశించగానే పదవిని వదులుకున్నారు. కానీ ఇప్పటి నాయకుల్లా రచ్చ చేయలేదు.

ఆయన అచ్చంగా ఓ సగటు షావుకారు… దేనికైనా లెక్క ఉండాలి, ఖర్చులో పొదుపు ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, ప్రతి పైసా ఖర్చుకు ఏదైనా ప్రయోజనం ఉండాలి… చివరకు డబ్బులు ఏట్లో వేసినా ఎంచి వేయాలనేవారు. ఎడాపెడా అప్పులు తేవడం, ప్రజలకు ఉదారంగా పంచిపెట్టడం పట్ల ఆయన విముఖుడు. సంక్షేమ వ్యతిరేకి కాదు, కానీ ఖజానా నుంచి ఖర్చయ్యే ప్రతి పైసాకు దీర్ఘకాలం ప్రయోజనాలు ఉండాలనే ధోరణి… వైఎస్ పథకాలను కూడా పలుసార్లు ఆంతరంగికంగా వ్యతిరేకించేవాడు.  

కానీ వైఎస్సార్ అన్నా తప్పదు నువ్వే ఏదో చేయాలి అంటే ఆ పథకాలకు ఎలాగోలా డబ్బు సర్దేవాడు. తమ ముఖ్యమంత్రికి చెడ్డపేరు రాకూడదన్న ఒకే ఒక ఆలోచన తప్ప మరొకటి ఉండేది కాదు. ఇదీ విధేయతతో భాగమే. విధేయత ఆయన బలం… అదే ఆయన బలహీనత కూడా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?