Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆనందయ్య మందు మళ్లీ ఎప్పుడు..?

ఆనందయ్య మందు మళ్లీ ఎప్పుడు..?

కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ఎప్పుడు మొదలవుతుంది? ఇదే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద నిపుణుల బృందాన్ని కరోనా మందు అధ్యయనం కోసం కృష్ణపట్నం పంపించింది. మరోవైపు కేంద్రం అధీనంలోని ఐసీఎంఆర్ రంగంలోకి దిగింది. ఈ రెండు నివేదికలు ఏమని వస్తాయి, వస్తే వాటి ఆధారంగా మందు పంపిణీ చేస్తారా? చేస్తే ఎప్పటినుంచి? ఎక్కడెక్కడ ఇస్తారు..? ఇలా సవాలక్ష అనుమానాలు అందరినీ వేధిస్తున్నాయి.

శుక్రవారం ఉదయం కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేదం మందు పంపిణీ మొదలైన గంటల వ్యవధిలోనే ఆపేయాల్సి వచ్చింది. వేలాదిగా వచ్చిన జనం గుంపులు గుంపులుగా మీదపడిపోవడంతో వారిని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు. సామాజిక దూరం అనే మాటే లేకపోవడంతో.. కేసులు పెరిగితే పరిస్థితి ఏంటని అధికారులు కూడా తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు మందు పంపిణీ చేయడం నిర్వాహకులకు కూడా సాధ్యం కాకపోవడంతో చేతులెత్తేశారు. దీంతో అర్థాంతరంగా ఆ కార్యక్రమం ఆగిపోయింది.

స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి.. మందు పంపిణీపై మరింత క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి మందు తయారీకి ఆనందయ్య విరామం ఇచ్చారని, మూలికలు సేకరించి మందు తయారు చేయడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుందని, అప్పటి వరకూ ఎవరూ కృష్ణపట్నం రావొద్దని సూచించారు. అవసరమైతే ఆన్ లైన్ లో మందు పంపిణీ మొదలు పెడతామని, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

గ్రామస్తుల ఆందోళన..

మరోవైపు ఆయుర్వేద మందు కోసం కరోనా రోగులంతా కుప్పలు తెప్పలుగా కృష్ణపట్నం రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఊరి దాటి బయటకి వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా వాహనాల రద్దీ పెరిగింది. అంబులెన్సుల్లో రోగులు రావడంతో లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని భయపడ్డారు. ఓ దశలో తమ గ్రామంలోకి ఎవరినీ రానీయకుండా కృష్ణపట్నం వాసులు అడ్డుకున్నారు కూడా.

ఆనందయ్య అరెస్ట్ అంటూ శుక్రవారం సాయంత్రం పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. ముందు జాగ్రత్తగా, అధికారులు పంపిన కమిటీకి వివరాలు ఇచ్చేందుకు ఆనందయ్యను పోలీసులు నెల్లూరు నగరానికి తరలించారు. ఆయన్ను అరెస్ట్ చేశారంటూ పుకార్లు రావడంతో జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. ఆనందయ్యకు పోలీసులు రక్షణ మాత్రమే కల్పించారని స్పష్టం చేశారు. 

కమిటీల నివేదికలో తేలేదేంటి..?

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆయుర్వేద నిపుణుల కమిటీ, కేంద్రం అధీనంలోని ఐసీఎంఆర్.. రెండూ ఆయుర్వేద మందు సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయుర్వేద డాక్టర్లు స్థానికుల స్పందన అడిగి తెలుసుకున్నారు.

ఎక్కడా సైడ్ ఎఫెక్ట్స్ లేవని, వాడినవారందరికీ మంచి ఫలితాలు కనిపించాయని చెప్పడంతో పరిస్థితి అంచనా వేస్తున్నారు. సోమవారం మరో బృందం కృష్ణపట్నంకు వెళ్తుందని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజులపాటు ఆయుర్వేద మందు పంపిణీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఆ తర్వాత కమిటీల నివేదికల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?