cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అల్లు రామ‌లింగ‌య్య‌కు నిజ‌మైన వారసుడు

అల్లు రామ‌లింగ‌య్య‌కు నిజ‌మైన వారసుడు

హాస్య న‌టుడిగా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై అల్లు రామ‌లింగ‌య్య చెర‌గ‌ని ముద్ర వేశారు. 50 ఏళ్ల పాటు సినిమాల్లో న‌వ్వుతూ, ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తూ టాలీవుడ్‌ను అల‌రించారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న సేవ‌ల‌ను గుర్తించిన భార‌త ప్ర‌భుత్వం 1990లో అత్యున్న‌త పుర‌స్కారం ప‌ద్మ‌శ్రీ‌తో గౌర‌వించింది. రేలంగి త‌ర్వాత ఆ పుర‌స్కారాన్ని అందుకున్న హాస్య‌న‌టుడిగా అల్లు రామ‌లింగ‌య్య రికార్డుల‌కెక్కారు.

అలాగే 2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ' రఘుపతి వెంకయ్య ' అవార్డు ఇచ్చి త‌న‌ను తాను గౌర‌వించుకుంది. అల్లు రామ‌లింగ‌య్య వార‌సులుగా ఆయ‌న కుమారుడు  అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరప‌డ్డారు. అలాగే అల్లు అర‌వింద్ కుమారుడు అర్జున్ స్టైలీష్ హీరోగా విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో దూసుకుపోతున్నాడు. ఇక  మెగాస్టార్ చిరంజీవి, అల్లు కుటుంబం మ‌ధ్య అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  

అలాంటి అల్లు రామ‌లింగ‌య్య‌కు నిజ‌మైన వార‌సుడెవ‌ర‌నే ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికి స‌రైన స‌మాధానం దొరికింద‌ని సినీ, రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అల్లు రామ‌లింగ‌య్య‌కు స‌రైన వార‌సుడు రాజ‌కీయాల్లో జ‌న‌సేనానిగా, టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ అని చెబుతున్నారు. రాజ‌కీయాల్లో ఆయ‌న స్టేట్‌మెంట్స్‌తో ఇలాంటి అభిప్రాయానికి రావాల్సి వ‌చ్చిందంటున్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌కు తాజాగా మ‌రోసారి నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ డిమాండ్ చేయ‌డం హాస్యాన్ని పండిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ మేర‌కు తాజాగా ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌కు ప‌వ‌న్ విజ్ఞ‌ప్తి చేయ‌డాన్ని గుర్తు చేస్తున్నారు.  గ‌త ఏడాది నామినేష‌న్ల ప్ర‌క్రియ‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, జ‌న‌సేన నాయ‌కుల‌ను నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకున్నార‌ని ప‌వ‌న్‌ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లో ఏముందంటే...

'బెదిరింపుల కార‌ణంగా నామినేష‌న్లు వేయ‌లేద‌ని వారు త‌గిన ఆధారాల‌తో వ‌స్తే మ‌రో అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్న ఎస్ఈసీ ప్ర‌క‌ట‌న‌కు స్పందించి అనేక మందిని క‌లెక్ట‌ర్ల‌ ద‌గ్గ‌రికి పంపించాం. కిందిస్థాయి అధికారులు నామ్‌కే వాస్తేగా ఫిర్యాదులు తీసుకుని వెన‌క్కి పంపుతున్నారు. మ‌ళ్లీ నోటిఫికేష‌న్ ఇస్తే త‌ప్ప న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం లేదు. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేయాల‌ని మా న్యాయ విభాగంతో మాట్లాడా' అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలిపారు.

ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్టుగా, అస‌లు ఎన్నిక‌ల్లో పోటీనే చేయ‌ని జ‌న‌సేన‌, ఇప్పుడు ఏదో ఉద్ధ‌రిస్తామ‌న్న‌ట్టు రీనోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డంపై సెటైర్లు పేలుతున్నాయి. ఇంత వ‌ర‌కూ గ్రామ‌, మండ‌ల‌, జిల్లా స్థాయిలో క‌మిటీలే వేసుకోలేని దుస్థితిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉండ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంట‌ప్పుడు ఏ ర‌కంగా పార్టీ పోటీ చేస్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఎవ‌రి కోసం, ఎందుకోసం ఇలాంటి అర్థంప‌ర్థం లేని డిమాండ్లు చేస్తున్నార‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. ఆల్రెడీ ఎస్ఈసీ ఏక‌గ్రీవ‌మైన అభ్య‌ర్థుల‌కు డిక్ల‌రేష‌న్ ఫారాలు కూడా ఇచ్చార‌ని, ఇటీవ‌ల హైకోర్టు కూడా ఆ విష‌య‌మై ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా ఆదేశాలు ఇచ్చిన సంగ‌తి బ‌హుశా ప‌వ‌న్‌కు తెలియ‌కే, ప్ర‌క‌ట‌న‌ల పేరుతో కామెడీ పండిస్తూ ... అల్లు రామ‌లింగ‌య్య అస‌లైన వార‌సుడిగా రాజ‌కీయ న‌ట‌న ర‌క్తి క‌ట్టిస్తున్నార‌ని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ?

సాప్ట్ వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమాల్లో న‌టించా

 


×