cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అమరావతి అసలు కథ

అమరావతి అసలు కథ

అన్ని ఉన్న నగరాల్లో రియలెస్టేట్‌ కూడా ఉండటం ఒక పద్ధతి అయితే, అసలు ఏమీ లేనిచోట రియలెస్టేట్‌ ఉండటమే అమరావతి ప్రత్యేకత! ఒక నగరం అభివృద్ధి అయ్యాకా అక్కడ రియలెస్టేట్‌ అభివృద్ధి కావడాన్ని అంతా గమనించే ఉంటారు. లేదా అక్కడకు సమీపంలో ఏదైనా పరిశ్రమ ఏర్పడిన తర్వాత, అక్కడకు అంతర్జాతీయ స్థాయి సంస్థలు లేదా మరే ఐటీ పరిశ్రమో వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల భూముల ధరలు పెరగడం, తద్వారా అక్కడ రియలెస్టేట్‌ పుంజుకోవడాన్ని గత పదిహేనేళ్లలో చాలా చోట్ల గమనిస్తూనే ఉన్నాం. ఎక్కడ రియల్‌ బూమ్‌ వచ్చినా.. అక్కడ కార్యక్షేత్రంలో ఏదో ఒక మార్పు వచ్చి ఉండాలి. అయితే అమరావతిలో అలాంటి ముచ్చటే లేదు! అమరావతిలో ఏమీలేదు.. ఒక్క రియలెస్టేట్‌ తప్ప!

'ఆ ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తాం..' ఒకమాట మాత్రమే అమరావతి ప్రాంతంలో రియలెస్టేట్‌ ఏర్పడటానికి ఆధారం. అన్ని ఉన్న చోట రియలెస్టేట్‌ వ్యాపారమే ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటూ ఉంది. ప్రత్యేకించి నోట్ల రద్దు తర్వాత దేశంలో అంతటా రియలెస్టేట్‌ భూమ్‌ చాలావరకూ తగ్గింది. మళ్లీ కొద్దిమేర పుంజుకుంది. అయితే అదంతా అన్నీ ఉన్న చోట! ఏమీ లేనిచోట పరిస్థితి ఎలా ఉంటుందో, కేవలం రియలెస్టేట్‌ తప్ప మరేంలేని అమరావతిలో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవడం కష్టం ఏమీకాదు.

-మందగమనంలో అమ్మకాలు, కొనుగోళ్లు
-ప్రశ్నార్థకంగా అమరావతి భవితవ్యం!
-చంద్రబాబు కల్పించిన భ్రమలను నమ్మని జనం
-వికేంద్రీకరణకే వైఎస్‌ జగన్‌ మొగ్గు?
-అదే అన్ని రకాలుగానూ మంచిది!

ప్రపంచంలో చాలా నగరాల్లో రియలెస్టేట్‌ అంటుంది. ఆయా నగరాల్లో అనేకం ఉంటాయి. ఆ ఊర్లలో మనుషులు, వ్యాపారాలు, భవంతులు, ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు. ఎయిర్‌ పోర్టులు.. ఇంకా ఇంకా ఎన్నెన్నో! ఆ నగరాలకే పరిమితమైన ప్రత్యేకతలు అంటాయి. ప్రభుత్వ పాలన ఉంటుంది. యంత్రాంగం ఉంటుంది. ప్రజలు ఆ నగరాల్లో బతకడానికి ఏమేం అవసరమో అవన్నీ కూడా అక్కడ ఉంటాయి! వాటన్నింటితో పాటు.. ఆ నగరాల్లో 'రియలెస్టేట్‌' కూడా ఉంటుంది. రియలెస్టేట్‌ అనేది ఏ నగరంలో అయినా ఒక చిన్నపార్ట్‌. భూములను అమ్మడం, కొనడంతో మొదలుపెట్టి.. భవంతుల నిర్మాణం, ఫ్లాట్ల అమ్మకాలు.. వంటివి ఒక పద్ధతిగా సాగిపోతూ ఉంటాయి. ఆయా నగరాల్లో డిమాండ్‌ సప్లయ్‌ నియమాన్ని అనుసరించి రియలెస్టేట్‌ వ్యాపారం సాగిపోతూ ఉంటుంది! అది అన్ని నగరాల్లోనూ.. ఈమధ్య కాలంలో చిన్న చిన్న పట్టణాల్లోనూ సాగేదే. అయితే 'అమరావతి' మాత్రం వాటన్నింటికన్నా ప్రత్యేకం!

అమరావతి ప్లాన్‌ అంటే అదొక రియలెస్టేట్‌ బ్రోచర్‌ అని... చాలామంది గత ఐదేళ్లుగా చెబుతూ వచ్చారు. రియలెస్టేట్‌ వ్యాపారులు తమ దగ్గర ఇన్వెస్ట్‌ చేస్తే.. భవిష్యత్తులో మీకు సకల సదుపాయాలతో కూడిన ప్లాట్‌ను హ్యాండోవర్‌ చేస్తామని బ్రోచర్లను ఎలా కొట్టిస్తారో.. అమరావతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అదే వ్యూహాన్ని అనుసరించారు.

ఢాం.. అన్న రియలెస్టేట్‌ బూమ్‌!
అమరావతి ప్రాంతంలో రియల్‌బూమ్‌ చాలా వరకూ మాయం అయ్యిందని స్పష్టం అవుతూ ఉంది. ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం ఏర్పడితన తర్వాత ఏపీ నూతన రాజధాని అమరావతిలో రియలెస్టేట్‌ బూమ్‌ ఢామ్‌ అంది. గత రెండు నెలల్లో అమరావతి ప్రాంతంలో రియలెస్టేట్‌ రంగంలో పూర్తి స్తబ్ధత నెలకొని ఉందని అక్కడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే చెబుతూ ఉన్నారు. అమ్మకాలు, కొనుగోళ్ల ఊపులేదని వారు తేల్చిచెబుతూ ఉన్నారు. అందుకు ప్రధాన కారణం.. అమరావతి భవితవ్యంపై ప్రశ్నార్థకాలు ఏర్పడటమే!

ఏదీ ఆ వైభవం..?
మారుమూలన ఉన్న మండల కేంద్రాల్లో కూడా ఈ కాలంలో 'రియలెస్టేట్‌' వ్యాపారం ఒక ఆదాయ వనరుగా, ఆ రంగంలో వ్యాపారం చేయడం ఒక సోషల్‌ స్టేటస్‌గా మారింది! ప్రత్యేకించి గత 20 వ్యవధిలో ఏపీలో రియలెస్టేట్‌ వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. అందుకు చిన్న చిన్న మండల కేంద్రాలు కూడా మినహాయింపు కాదు. దీనికి 'అమరావతి' కూడా మినహాయింపు కాదు! అసలు అమరావతి వైభవం అంటే.. గత ఐదేళ్లలో అందుకు సంబంధించి ఎన్నో కథలు విన్నారు ఏపీ ప్రజలు. సత్యం శంకరమంచి రాసిన 'అమరావతి కథలు' కంటే ఎంతో వినోదాత్మాకంగా అమరావతి గురించి తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ అనుకూల మీడియా వర్గాలు.. వివరిస్తూ వచ్చాయి! అ అంటే అమరావతే అని నిర్వచనం ఇస్తూ... ఎన్నో అభూత కల్పనలను అతిశయోక్తులను కూడబలికారు! మరి అమరావతి అసలు కథ బయటపడే సమయం వచ్చింది!

అమరావతిపై భ్రమలు తొలగే టైమొచ్చింది. ఒకవేళ  ఈ సారి కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిచి ఉంటే.. 'అమరావతి'లో ఏదో జరిగిపోతోంది, అమరావతి ఒక అద్భుతం కాబోతోంది.. అనే భ్రమల్లోనే ప్రజలు మునిగిపోయే వారేమో! అయితే ఇప్పుడు అమరావతి గురించి భ్రమలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో లేరు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డి ఆ స్థానంలో ఉన్నారు. దీంతో అమరావతి పై ఇప్పుడు భ్రమలు తొలగుతూ ఉన్నాయి! అసలు కథ బయట పడుతూ ఉంది. అమరావతిలో అసలేముంది? అమరావతిలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇంతకీ అమరావతి చుట్టూ అల్లుకున్న రియలెస్టేట్‌ పందిరి పరిస్థితి ఏమిటి? అనేవి ఇప్పుడు అత్యంత ఆసక్తిదాయకమైన అంశాలు అవుతున్నాయి.

రియలెస్టేట్‌ విస్తరించాకే రాజధాని!
విస్తరించిన రాజధానిలో రియలెస్టేట్‌ ఏర్పడటం ఎక్కడైనా జరిగేదైతే, రియలెస్టేట్‌ వ్యాపారం విస్తరించాకా అక్కడ రాజధాని ఏర్పడాలి అనేది 'అమరావతి' థియరీ!  మరింత లోతుల్లోకి వెళితే అమరావతిలో గత ప్రభుత్వమే రియలెస్టేట్‌ వ్యాపారం చేసింది. ప్రభుత్వ పెద్దలు రియలెస్టేట్‌ బ్రోకర్లలా వ్యవహరించారు. భూ సేకరణ చేసి, రైతులకు ప్రభుత్వ ఖజానా నుంచి పరిహారాలు ప్రకటించి, ఆ భూములను  ప్రైవేట్‌ కంపెనీలకు ప్రభుత్వమే ధారోపోసింది. కొన్ని వందల ఎకరాల భూములను ఉచితంగా, మరి కొన్ని ఎకరాల భూములను అయాచితంగా అయిన వారికి కట్టబెట్టారు. భారం ప్రభుత్వం మీద పడుతుంది. భూములు తాము కేటాయించాలనుకున్న వారికి దక్కుతాయి.

మరి కొన్ని భూ కేటాయింపుల ద్వారా భారీగా ముడుపులూ అందాయనే ఆరోపణలు వచ్చాయి. ఇలా చూస్తే .. అమరావతి మొత్తం పెద్ద స్కామ్‌. ఆ స్కామ్‌ అంతు తేలుస్తామని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటిస్తూ వచ్చారు. విచారణ అంటూ మొదలు అయితే అమరావతి భూముల కథ ఎటు తేలుతుందో ఇంకా ఎవరికీ అర్థం కావడం లేదు. అ అగమ్యగోచర పరిస్థితి ఆ చుట్టు పక్కల భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మీద కూడా పడుతూ ఉంది. అమరావతిలో అన్ని సౌకర్యాలూ ఉంటే అక్కడ యథారీతిన అమ్మకాలూ, కొనుగోళ్లు సాగేవి. అయితే అక్కడ ఉన్నది రియలెస్టేట్‌ మాత్రమే కాబట్టి.. అది కూడా పూర్తిగా మందగమనంలోకి పడిపోయింది!

బడ్జెట్‌ కేటాయింపులతో మరింత స్పష్టత!
తాము రాజధానిని మార్చాలని అనుకోవడం లేదని ఇదివరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టంచేస్తూ వచ్చారు. ఎన్నికల ముందు నుంచినే జగన్‌ ఈ మాట చెబుతూ వచ్చారు. జగన్‌ ఆ మాటను తప్పే అవకాశాలు లేవు. అలాగని అమరావతి మీద భ్రమలను కొనసాగించాల్సిన అవసరం మాత్రం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి లేదని స్పష్టం అవుతోంది. అమరావతి పై వాస్తవాలను మాత్రమే జగన్‌ ప్రజెంట్‌ చేయాలని భావించవచ్చు. ఎలాగూ భ్రమలను కలిగించాలని చూసినా ప్రజలు నమ్మరని చంద్రబాబు వ్యవహారంతో తేలిపోయింది.

అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన అతి, ఆయన చెప్పిన అతిశయోక్తులు అన్నీ ఇన్నీ కావు. వాటిని ఆఖరికి ఆ ప్రాంత ప్రజలే నమ్మ లేదు! తమకు కావాల్సింది భ్రమలు కాదు అని ప్రజలు తేల్చి చెప్పారు. కాబట్టి.. అమరావతి పై జగన్‌ మోహన్‌ రెడ్డి వాస్తవిక ధోరణితోనే వ్యవహరించవచ్చు. రియలెస్టేట్‌ వ్యాపారంలో వాస్తవాలు అసలు పనికిరావు! అందులో అన్నీ అతిశయోక్తులే ఉండాలి. అతిశయోక్తులు ఆగిపోతే రియలెస్ట్‌ బూమ్‌ సహజంగానే పడిపోతుంది. దీంతో అమరావతిలో ఇప్పుడప్పుడే రియలెస్టేట్‌ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.

ఇక త్వరలోనే ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. అందులో అమరావతి అభివృద్ధికి ఏ స్థాయిలో నిధుల కేటాయింపు సాగుతుంది? అనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. ఒకవేళ బడ్జెట్‌లో తగుమేర కేటాయింపులు సాగితే.. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నట్టే. అలాకాకుండా.. ఇప్పటికే పాతిక శాతానికి మించి నిర్మితమైన ప్రాజెక్టులకే ప్రాధాన్యతన అన్నట్టుగా జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తే.. అమరావతి విషయంలో అదనపు అంచనాలకు ఏమాత్రం అవకాశం ఉండదని స్పష్టంగా చెప్పవచ్చు.

అమరావతిలో లండన్‌ ఐ.. తరమా కబుర్లు చెప్పారు చంద్రబాబు నాయుడు. అలాంటి కహానీలకు జగన్‌ ప్రభుత్వం అవకాశం ఇచ్చేలాలేదు. ప్రపంచాన్నంతా చుట్టీ అక్కడి అబ్బురాల పక్కన ఫొటోలు దిగి, వాటిని అమరావతికి తీసుకురాబోతున్నట్టుగా జగన్‌ చెప్పే అవకాశాలు లేవు కాబట్టి... అమరావతి రియలెస్టేట్‌పై ఓవర్‌ హైప్‌ ఉండే అవకాశాలు ఏమాత్రం లేవు!

హ్యాపీ నెస్ట్‌ పరిస్థితి ఏమిటి?
అవసరం ఉన్నప్పుడు.. అవకాశాలు ఉన్నప్పుడు నగరాలకు ప్రజలు తరలిపోతారు. అక్కడ తమకు ఉపాధి లభిస్తుందనుకుంటే వేల మైళ్లలోని నగరాలకు కూడా ప్రజలు తరలుతారు. ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా.. నగరాల్లోకి ప్రజలు వలస వెళ్తూ ఉంటారు. ఎవరి పని నిమిత్తం వారు అక్కడకు వెళ్లి సెటిలవుతారు. అది ఏ రాజధాని విషయంలో అయినా జరిగేది. అయితే అమరావతి ప్రత్యేకం కదా! అందుకే.. ప్రజలు అక్కడకు తరలి రాకముందే.. తామే ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఉచితంగా కాదులెండి!

కోట్ల రూపాయల ధరకు. అందుకే సీఆర్డీఏ ఆధ్వర్యంలో 'హ్యాపీనెస్ట్‌' అంటూ అనౌన్స్‌మెంట్‌ చేశారు. అక్కడ రియలెస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేసి, అపార్ట్‌మెంట్లు కట్టి, ఫ్లాట్లను అమ్మే సంగతెలా ఉన్నా.. ప్రభుత్వమే ఒక రియలెస్టేట్‌ వెంచర్‌ వేసి, భవంతులు కట్టి.. సీఆర్డీఏ ద్వారా వాటి నిర్మాణం, అమ్మకం సాగుతుందని ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం. అలా అచ్చంగా రియలెస్ట్‌ వ్యాపారాన్ని ప్రభుత్వమే మొదలుపెట్టింది. అందుకు సంబంధించి 'హ్యాపీనెస్ట్‌' అంటూ కట్టబోతున్నట్టుగా ప్రకటించారు. ఆ ప్రతిపాదన చేసి, బుకింగ్స్‌ కూడా మొదలుపెట్టారు.

కేవలం మూడుగంటల వ్యవధిలో మూడువందల ఫ్లాట్లు బుక్‌ అయినట్టుగా ప్రకటించుకున్నారు. అలా సీఆర్డీయేను ఒక పచ్చి రియలెస్టేట్‌ సంస్థగా మార్చి వ్యాపారం చేయబోయారు. అయితే చంద్రబాబు హయాంలో ఆ హడావుడి అంతా జరిగింది. కానీ ఆ 'హ్యాపీనెస్ట్‌'కు సంబంధించి ఎలాంటి నిర్మాణాలూ మొదలుకాలేదు. ఆ ప్రాజెక్టు పూర్తిగా పట్టాలే ఎక్కలేదు. ఇప్పుడు సీఆర్డీయే రూపం మారిపోయింది. అధికారులు బదిలీ అయిపోయారు. ప్రభుత్వం ధోరణి మారిపోయింది. దీంతో ఆ హ్యాపీనెస్ట్‌ కూడా కొశ్చన్‌మార్క్‌ అయిపోయిందని స్పష్టం అవుతోంది. జగన్‌ ప్రభుత్వం ఆ రియలెస్టేట్‌ వ్యాపారం చేయడానికి మొగ్గు చూపకపోవచ్చు.

ఇంకా లేని మౌళిక సదుపాయాలు!
అమరావతికి అంతా తరలిరావాలని చంద్రబాబు నాయుడు అప్పట్లో పిలుపునిచ్చారు. వచ్చి ఏం చేసుకోవాలో మాత్రం ఆయన చెప్పలేదు. అమరావతిలో పచ్చదనం ఉందని, ఆయువు ఉందని ఆయన ప్రకటించుకున్నారు. నిజమే.. పచ్చని పొలాలు ఉండిన ప్రాంతం. కాబట్టి చెట్లూ చేమకు ఇంకా కొదవలేదు. అలాంటి ప్రాంతాన్ని అటు వ్యవసాయానికి కాకుండా చేశారు. ఇటు ఎలాంటి మౌళిక సదుపాయాలూ ఏర్పాటు చేయలేదు.

తాత్కాలిక భవనాలు కట్టిన ప్రాంతాన్ని మినహాయిస్తే.. మరెక్కడా తగిన మౌళిక సదుపాయాలు కనిపించవు. అయినా అక్కడకు అంతా తరలివచ్చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చివరకు ఆయనే అక్కడ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేదు! అమరావతి ప్రాంతంలో చంద్రబాబుకే శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ఉద్దేశం కనిపించడం లేదు. ఇప్పటికీ చంద్రబాబు కుటుంబం బస హైదరాబాద్‌లోనే ఉంది. దీన్నిబట్టి అక్కడ గత ఐదేళ్లలో ఏర్పడిన మౌళిక సదుపాయాలు ఏమిటో అర్థం చేసుకోవాలని పరిశీలకులు అంటున్నారు.

ఉద్యోగులే రక్ష..?
హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాన్నింటినీ తరలించడం, పాలన మొత్తం ఆ ప్రాంతానికి తరలించడం వల్ల దాదాపు ఇరవై వేల మంది వేతన జీవులు అమరావతి ప్రాంతానికి తరలి వెళ్లారని ఒక అంచనా. వారంతా మినిమం వేతనాలు పొందేవారే కాబట్టి.. బస కోసం అద్దె ఇళ్లను, సొంత ఇళ్లను ఏర్పాటు చేసుకునే వాళ్లే. అయితే వీరిలో కూడా కొంతమంది అమరావతిని తాత్కాలిక బసగానే చూస్తూ ఉన్నారు. తక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్నవారు అద్దె ఇళ్లకు మొగ్గుచూపుతూ, హైదరాబాద్‌నే శాశ్వతం అన్నట్టుగా వ్యవహరించారు, వ్యవహరిస్తున్నారు. మినిమం పదేళ్లకు మించి సర్వీస్‌ ఉన్నవారు మాత్రం అమరావతి ప్రాంతంలో సొంతంగా స్థిరాస్తిని కొనుగోలు చేశారు, చేస్తున్నారు. ఫలితంగా ఎన్నో కొన్ని క్రయవిక్రమాలు సాగుతూ ఉన్నాయి.

వికేంద్రీకరణ మాటేమిటి?
రాజధాని అంటే ఒక ప్రాంతానికి పరిమితం చేయవద్దని.. అది భవిష్యత్తు తరాలను ఇబ్బంది పెడుతుందని మేధావులు చెబుతూనే ఉన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అంటున్నారు. అమరావతి ప్రాంతం అభివృద్ధి జరిగితేనో, అక్కడ భూముల ధరలు కోట్లకు చేరి వ్యాపారం జరిగితేనో.. వచ్చే ప్రయోజనం ఆ ప్రాంతం వారికే కావొచ్చని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే వికేంద్రీకరణే పరిష్కారం అనే సూచనలు ముందు నుంచి ఉన్నాయి. అయితే వాటిని చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్‌ అలా చేయకపోవచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణకు జగన్‌ మోహన్‌రెడ్డి ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలున్నాయి.

అదే సబబు. ఏదో కొన్నినెలలు అమరావతిలో స్థిరాస్థి వ్యాపారం పడిపోయిందనో, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ ఆదాయం తగ్గిందనో భయాందోళనలు అవసరం లేదు. అభివృద్ధి అనేది రాష్టంలో ఎక్కడ జరిగినా... ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎలాగూ వస్తూ ఉంటుంది. తద్వారా అందుకు సంబంధించిన ఫలాలు రాష్ట్రంలోని నాలుగు మూలల ప్రజలూ అందుకుంటున్నారు. ఎలాగూ జిల్లాల సంఖ్యను పెంచి.. పరిపాలనను మరింత సౌలభ్యం చేయనున్నట్టుగా జగన్‌ ప్రకటించారు.

అలాగే రాజధాని అనే బ్రహ్మపదార్థాన్ని కూడా ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా.. వికేంద్రీకరణ మంత్రంతో రాష్ట్రమంతా అభివృద్ధి చేయడానికి జగన్‌ సంకల్పిస్తే మంచిదని మేధావులు సూచిస్తున్నారు. అమరావతిలో రియలెస్టేట్‌ పడిపోయినంత మాత్రానా.. రాయలసీమకో, ఉత్తరాంధ్రకో వచ్చే నష్టంలేదు. బినామీల పేర్లతో భూములు కొన్న వారికి తప్ప మిగతా వాళ్లకు నష్టంలేదు. ఒకే ప్రాంతంలో అంతులేని రీతిలో భూముల ధరలు పెరిగిపోవడమూ మంచిదికాదు.

ఏతావాతా వికేంద్రీకరణే అన్నింటికీ మంచిది! ఈ అంశంలో జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. వికేంద్రీకరణ వైపు మొగ్గుచూపితే మాత్రం.. అమరావతిలో అయాచితంగా, అనుచితంగా సాగిన రియల్‌ దందా పతనావస్థకు చేరడం ఖాయం.

కొంత స్తబ్దత నిజమే, చిన్న వెంచర్లకు భయంలేదు!
అమరావతి ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రస్తుతానికి మందకొడిగానే సాగుతూ ఉంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంత అభివద్ధి విషయంలో ఎలా స్పందిస్తుందో అనే దాన్ని బట్టి మిగతా అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు కూడా మరీ మునిగిపోయింది ఏమీలేదు. చిన్నచిన్న వెంచర్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతూ ఉన్నాయి. నలభై యాభై లక్షల రూపాయల స్థాయి ఫ్లాట్ల అమ్మకాలు, కొనుగోలు సాగుతూ ఉన్నాయి. అయితే అరవై డెబ్బై లక్షల రూపాయల ఫ్లాట్ల అమ్మకాలు మాత్రం సాగడంలేదు.

గేటెడ్‌ కమ్యూనిటీలు, భారీ హంగూ అర్బాటాలకు సంబంధించిన వ్యాపారాలు తగ్గాయి. ఆల్రెడీ కంప్లీట్‌ అయిన ప్రాజెక్టుల అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే ప్రతిపాదన దశలో, నిర్మాణ దశలో ఉన్న వాటి అమ్మకాల జోరుతగ్గింది. ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం మాత్రం తగ్గింది. తాడేపల్లి లొకేషన్లో అమ్మకాలు బాగా సాగుతున్నాయి.
-అమరావతి ప్రాంత ఒక స్థిరాస్థి వ్యాపారి.

ఇప్పుడు కాపీ కొడితే అవతల వాళ్లు తేలికగా వదలరు