Advertisement


Home > Politics - Political News
అమరావతి ఏ దేశంలా తయారవ్వాలి..?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి తెలుగువారి రాజధానిలా ఉండకూడదు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలతో ఉండకూడదు. బాగా అభివృద్ధి చెందిన విదేశంలా ఉండాలి. అమరావతిలో ఉంటున్నవారికి, అక్కడికి వచ్చేవారికి విదేశీ నగరానికి వచ్చామనే భావన కలగాలి. ఇలా ఉండాలని ఏపీ ప్రజలు కోరుకోవడంలేదు. అద్భుతంగా పరిపాలిస్తున్నానని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబునాయుడు కోరుకుంటున్నారు.

ఇది కొత్త విషయం కాదు. అందరికీ తెలిసిందే. 'కలనైనా నీ తలపే.. కలవరమందైనా నీ తలపే' అనే ఓ సినిమాలోని పాటలా, చంద్రబాబు కలల్లో కూడా విదేశీ నగరాలే కనబడుతుంటాయి. అమరావతి నిర్మాణం గురించి ఆయన మాటలు కోటలు దాటుతుంటాయి. ఆయన అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాజధాని ఎలా ఉండాలనే విషయమై అధ్యయనం చేయడానికి, పెట్టుబడులు తెచ్చుకోవడానికి ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లివచ్చారో లెక్కలేదు.

ఈయనొక్కరే కాదు, మంత్రులను, అధికారులనూ తిప్పారు. పాలనలో ముప్పావుభాగం తిరగడానికే సరిపోయింది. ఏ విషయంలోనైనా సింగపూర్‌ జపం చేయడం సీఎంకు అలవాటు. అమరావతిని సింగపూర్‌లా నిర్మిస్తానని ఊదరగొట్టిన ఈయన ఆ తరువాత ఎన్ని దేశాలు, రాజధానుల గురించి చెప్పారో లెక్కలేదు. ఏ దేశానికి వెళితే ఆ దేశంలా నిర్మిస్తానని, ఏ దేశపు రాజధాని చూస్తే దానిమాదిరిగా కడతానని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకు లేనటువంటి నగరం నిర్మించడం బాబుకు ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదుగాని అధికారంలోకి వచ్చినప్పటినుంచి 'అద్భుత నగరం' పేరుతో ఊదరగొడుతూ, అరచేతిలో స్వర్గం చూపిస్తూనే ఉన్నారు.

'రాజధాని నిర్మాణం దేవుడిచ్చిన వరం' అంటూ అతిశయోక్తులతో, మాయపొరలు కమ్మే మాటలతో ఇప్పటివరకు కాలం గడుపుతూ వస్తున్నారు. 'సింగపూర్‌వంటి అత్యుత్తమ రాజధాని నగరం నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రజలకు మాటిచ్చాను. ఎందుకంటే సింగపూర్‌ అందమైన, అభివృద్ధి చెందిన, సురక్షితమైన నగరం. ఎన్నికలు పూర్తికాగానే సింగపూర్‌ వెళ్లి అక్కడి ప్రధానిని రాజధాని కోసం బృహత్తర ప్రణాళిక అడిగాను. వారు సమ్మతించి ఆరునెలల్లో అద్భుతమైన మాస్టర్‌ ప్లాన్‌ను ఉచితంగా ఇచ్చారు'.. అని బాబు చెప్పారు. పక్కాగా వ్యాపారం చేసే సింగపూర్‌ వాసులు మాస్టర్‌ ప్లాన్‌ ఉచితంగా ఇచ్చారంటే నమ్మదగ్గ విషయమేనా?

మొదట సింగపూర్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. ఆ తరువాత చైనా, జపాన్‌, హాలండ్‌, అమెరికా... ఇలా ఏవేవో దేశాల నిర్మాణ కంపెనీలను రప్పించారు.  ప్రతి చిన్న విషయం విదేశాల్లో చూసొస్తే తప్ప చేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులను శాన్‌ఫ్రాన్సిస్‌కో, శాన్‌డియాగో, లాస్‌ఏంజిలస్‌, డల్లాస్‌, చైనా,  ఆస్ట్రేలియా, కజ్‌కిస్తాన్‌, చైనా, తుర్క్‌మెనిస్తాన్‌, దక్షిణ కొరియా, యూఏఈ, బ్రెజిల్‌,  సింగపూర్‌, మలేషియా, థాయ్‌ల్యాండ్‌ , సౌదీ అరేబియా ... ఇలా అనేక దేశాలకు, నగరాలకు పంపారు. బాబు కూడా ఇలాగే చుట్టబెట్టి వచ్చారు. ఇంత చేసినా అమరావతిని ఏ విదేశీ నగరంలా నిర్మించాలో ఆయనకు అర్థం కావడంలేదు. రాజధానిని అమరావతిలా నిర్మిస్తే ఇంత అయోమయం ఉండదు.

తాజాగా ఆయన 'అమరావతి నెదర్లాండ్స్‌ రాజధాని అమెస్టర్‌డ్యామ్‌ను మరపించేలా ఉంటుంది' అని సెలవిచ్చారు. అత్యాధునిక సౌకర్యాలతో అలరారుతున్న అమెస్టర్‌డ్యామ్‌ను అమరావతి మించిపోతుందట...! బాబు ఇంతటితో ఆగలేదు. అమరావతి అప్పుడే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని చెప్పారు. మాటలతో కోటలు కడుతూ ప్రజలను పిచ్చోళ్లను చేయడమంటే ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంతకాలం ఇలాగే విదేశీ జపం చేసినా ఆ తరువాత మానుకొని బుద్ధిగా ఉంటున్నారు. కాని బాబుకు ఈ పిచ్చి ముదురుపాకాన పడింది. అమరావతి అనే నగరం ఉందా? అది లేకుండానే అంతర్జాతీయ ప్రఖ్యాతి ఎలా సాధిస్తుంది? వ్యాపారాలు చేసుకోవడానికి పెట్టుబడిదారులు ఎక్కడికైనా వస్తారు. అంతమాత్రాన అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందా?