cloudfront

Advertisement


Home > Politics - Political News

అమెరికాలో టీడీపీ.. అదిరిందయ్యా చంద్రం

అమెరికాలో టీడీపీ.. అదిరిందయ్యా చంద్రం

తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశించేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మాట చంద్రబాబు చెబితే, దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు. ఇది అమెరికాకి సంబంధించిన వ్యవహారం. ఎన్నారైలు ఓటు హక్కు వినియోగించుకోవడమే కాదు, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసెయ్యాలని చంద్రబాబు పిలుపునిచ్చేయడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు అంటున్నారు. ఆ చారిత్రక అవసరాన్ని గుర్తెరిగి రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెడితే, చంద్రబాబు ఏం చేశారు.? రాజధాని పేరుని అమరావతిగా ప్రకటించారు తప్ప, ఆ అమరావతి నిర్మాణంలో 'వేగం' చూపించలేకపోయారు. చంద్రబాబు హైటెక్‌ ఆలోచనలు, డిజైన్లకే పరిమితమయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్‌ పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నట్టు, చంద్రబాబు తన పుత్రరత్నం నారా లోకేష్‌ని మంత్రిగా చూసుకున్నారండోయ్‌.. ఈ నాలుగున్నరేళ్ళలో చంద్రబాబు సాధించిన ఘనతల్లో ఇదే ప్రముఖమైనది.

సొంతింట్లో బావమరిదికి ఎమ్మెల్యే పదవినిచ్చిన, కొడుక్కి మంత్రి పదవినిచ్చి.. చంద్రబాబు తన కుటుంబాన్ని చాలానే అభివృద్ధి చేసుకున్నారు. ఇంకోసారి అధికారమిస్తే, కుటుంబ సభ్యుల్లో మిగిలినవారికీ పదవుల్ని పంచేస్తారేమో. బహుశా దాన్నే చంద్రబాబు, 'చారిత్రక అవసరం' అనుకుంటున్నారని మనం అనుకోవాలి. ప్రపంచ స్థాయిలో స్వర్గీయ ఎన్టీఆర్‌కీ, చంద్రబాబుకి మాత్రమే.. గుర్తింపు వుందన్నది తెలుగు తమ్ముళ్ళ ఉవాచ. అమెరికా టూర్‌లో చంద్రబాబు మాటలు కూడా ఇలాగే వుంటున్నాయ్‌.

పోన్లెండి, స్వర్గీయ ఎన్టీఆర్‌ పేరుని కూడా చేర్చారు.. తనతోపాటు, తన పుత్రరత్నం నారాలోకేష్‌ పేరు మాత్రమే చెప్పుకుని చంద్రబాబు మురిసిపోలేదు విదేశీ వేదికలపైన. విదేశాల్లో వివిధ రాజకీయ పార్టీలకు 'అభిమాన సంఘాలు' వున్నాయి. అవి ఇప్పటికే రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాటిల్లో ప్రచార కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడూ చూస్తూనే వున్నాం.

ఇవిచాలక, ఇంకా కొత్తగా ప్రచార కార్యక్రమాలు చేయమని చంద్రబాబు పిలుపునివ్వడమంటే, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలను భాగస్వాముల్ని చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ పనిలో సక్సెస్‌ కాలేదు సరికదా.. పార్టీ కార్యకలాపాల కోసం మాత్రం ఎన్నారైలను 'వాడేయాలనుకోవడం' దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం కాక మరేమిటి.?