Advertisement


Home > Politics - Political News
ఫోటో తీసేశారా?.. బయటకొచ్చినట్లే...!

నెల్లూరు జిల్లాలో బలమైన నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నుంచి బయటకు రాబోతున్నారా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదొక చర్చ. పార్టీ నుంచి ఆయన దాదాపుగా బయటకొచ్చినట్లేనని సమాచారం వస్తోంది. నెల్లూరులోని తన కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫొటో తొలగించారట...! ఫొటో తీసేశారంటే పార్టీ వీడుతున్నట్లేనని అర్థమవుతోంది.

ఆయన టీడీపీ నుంచి ఎప్పుడోఒకప్పుడు బయటకు వస్తారని ఊహిస్తున్నదే. సోదరుడు ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారు. ఏ విషయంలోనైనా తమ్ముడితో కలిసివుండే వివేకా పరిస్థితి అత్యంత విషమంగా ఉండటం బాధాకరం. ఈ నేపథ్యంలోనే రామనారాయణరెడ్డి బయటకు వస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. ఆయన గమ్యం వైఎస్సార్‌సీపీ అని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పకోవల్సిన అవసరం లేదు. నెల్లూరు జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి ఆంధ్రాలోనూ, ఇప్పటి ఏపీలోనూ ఆనం కుటుంబ ప్రాధాన్యం అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీలో ఈ సోదరులది కీలక పాత్ర. రామనారాయణ రెడ్డి మంత్రిగా సీనియర్‌. ఈ సోదరులు టీడీపీలో చేరాక తెరమరుగైపోయారు. ఒకటనుకుంటే మరొకటైంది. చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలనే కాకుండా కాంగ్రెసులోని  బలమైన నాయకులను కూడా ఏరికోరి పార్టీలో చేర్చుకున్నారు. అలాంటివారిలో ఆనం సోదరులూ ఉన్నారు.

రాజకీయ అవసరాలు, సమీకరణాల రీత్యా కొందరు ఫిరాయింపుదారులకు రకరకాల పదవులు ఇచ్చినా, ఆనం సోదరులకు మొండిచేయి చూపించారు. టీడీపీలో తమకు న్యాయం జరగదని, పదవులు రావని వారికి ఏనాడో అర్థమైపోయింది. పార్టీలో కొనసాగడం వృథా అని చాలాకాలం క్రితమే సన్నిహితులతో చెప్పుకొని ఆవేదన చెందారు.  ఇప్పుడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైకాపా అధినేత జగన్‌కు ప్రజాదరణ పెరుగుతోందని రామనారాయణ భావిస్తుండవచ్చు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు నారాయణకు, సోమిరెడ్డి చంద్రమోహన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం ఆనం సోదరులకు ఇవ్వలేదు.

వీరు టీడీపీలో చేరేటప్పుడు రాంనారాయణ రెడ్డికి మంత్రి పదవి, వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీ (గవర్నర్‌ కోటాలో) ఇస్తానని  వాగ్దానం చేసిన బాబు ఆ తరువాత పక్కకు పెట్టేశారు. మొదట్లో వీరు వైకాపాలో చేరతారని అనుకున్నారు. కాని బాబు ప్రత్యేకంగా వీరితో మాట్లాడి, పదవులు ఇస్తానని ఆశ పెట్టి టీడీపీలోకి తీసుకువచ్చారు.  టీడీపీలోకి వచ్చినప్పుడు బాబును పొగడి, జగన్‌ను విమర్శించినా తరువాత పరిస్థితి అర్థమై గమ్మున ఉండిపోయారు. ఒకటిరెండుసార్లు వివేకా బాబు దగ్గరకు వెళ్లి  ఎమ్మెల్సీ గురించి అడిగినప్పుడు 'చూద్దాంలే' అని ఓసారి, 'ఎంతమందికి పదవులు ఇస్తాను' అని ఓసారి అన్నారట...! వీరు చేరిన కొంతకాలానికి  గవర్నర్‌ కోటాలో  రామసుబ్బారెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు.  

ఆనం సోదరుల కంటే రాజకీయ ప్రయోజనాల రీత్యా వీరిద్దరికీ పదవులు ఇవ్వడం బాబుకు అనివార్యమైంది. వారికి పదవులు దక్కాక 'మేం తప్పు చేశాం' అని సోదరులు సన్నిహితుల వద్ద వాపోయారు.  ఈ నేపథ్యంలో ఈమధ్య రామనారాయణ రెడ్డికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. పార్టీలో చేరిన దీర్ఘ కాలానికి ప్రభుత్వ పదవి కాకుండా ఒకరికి పార్టీ పదవితో సరిపెట్టారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం రామనారాయణ రెడ్డి పేరు వినిపించింది. అలాంటి వ్యక్తికి పార్టీ పదవి ఇవ్వడంతో ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోయారు.  ఈమధ్య చంద్రబాబు హైదరాబాదుకు వెళ్లినప్పుడు వివేకాను చూడటానికి ఆస్పత్రికి వెళ్లారు. ఈ సంగతి తెలిసినా  రామనారాయణ ఆస్పత్రికి వెళ్లలేదు. ఏది ఏమైనా రామనారాయణరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.