Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆంధ్రజ్యోతి పిలుపు..వైకాపాను ఓడించండి

ఆంధ్రజ్యోతి పిలుపు..వైకాపాను ఓడించండి

''...విశాఖ నగరపాలకసంస్థను వైసీపీ గెలుచుకుంటే స్థానిక ప్రజల్లో కూడా సెంటిమెంటు లేదని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. అదే జరిగితే ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు కూడా చల్లబడిపోతాయి. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ దారి తాము చూసుకోవలసి వస్తుంది. ఒకవేళ విశాఖలో వైసీపీ ఓడిపోతే ఆ పార్టీకి చురుకు తగులుతుంది....''

ఇదీ ఆంధ్రజ్యోతి సూత్రీకరణ. ఇది ఎంతవరకు సబబు, కరెక్ట్..అన్నది చూద్దాం. అలా చూడ్డానికి ముందు దీని వెనుక వున్నఅంతరార్థం కూడా గమనిద్దాం.

ఎన్టీఆర్ పార్టీ పెట్టే వరకు విశాఖకు కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి రాజకీయ, వ్యాపార వలసలు అంతగా ప్రారంభం కాలేదు. మహా అయితే తూర్పుగోదావరి నుంచి మాత్రమే వచ్చేవారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత ఆ మహానుభావుడు చేసిన తొలి పని ఏమిటంటే ఎక్కడ అవకాశం వుంటే అక్కడ ఓ సామాజిక వర్గ జనాలకు టికెట్ లు ఇవ్వడం. శ్రీకాకుళం జిల్లా చివరన, ఒరిస్సా బోర్టర్ అయిన ఇచ్ఛాపురం, విజయనగరం జిల్లా చీపురుపల్లి లాంటి చిన్న నియోజక వర్గాల టికెట్ లను ఆ వర్గానికి కేటాయించుకున్నారు. 

ఇక విశాఖ సంగతి చెప్పనే అక్కరలేదు. అనతి కాలంలోనే విశాఖలో రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆ వర్గం వేళ్లూనుకు పోయింది. పార్టీ తమ చేతిలో వుంది కాబట్టి పార్టీ పదవులు, అధికార పదవులు, టికెట్ లు ఇవన్నీ ఎలాగూ పెద్ద కష్టం కాదు. ప్రభుత్వం తమ చేతిలో వుంటుంది కాబట్టి వ్యాపారాలు, మైనింగ్ లు, పర్మిషన్లు ఇవన్నీ అంతకన్నా కష్టం కాదు. ఇలా దశాబ్దాల కాలంగా హవా సాగిపోతోంది. 

అంతెందుకు ఘనత వహించిన సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే కు కూడా విశాఖ డాబాగార్డెన్స్ లో మిత్రుల బార్ అండ్ రెస్టారెంట్ లో వాటా వుండేదని జర్నలిస్ట్ వర్గాల్లో అప్పట్లో వినిపించేది. ఆయన ఆంధ్రజ్యోతిని తన చేతిలోకి తీసుకున్నాక ఇక బాగోదని దాన్ని వదిలేసారని అంటారు. సరే, వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఓ ప్రాంతాన్ని మొత్తం అన్ని విధాలుగా తమ గుప్పిట్లోకి తీసుకోవడం అంత వీజీ కాదు. ప్రభుత్వం, పార్టీ పూర్తిగా తమ చేతిలో దశాబ్దాల కాలం పాటు వుంటే తప్ప. 

ఉత్తరాంధ్ర జనాలు కృష్ణ, గుంటూరు జిల్లాలకు వెళ్లి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా రకరకాల పదవులు సాధించగలరా? కనీసం టికెట్ లు తెచ్చుకోగలరా? అక్కడ తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించగలరా? హోటళ్లు, థియేటర్లు, రియల్ ఎస్టేట్, ఇలా ప్రతి ఒక్కరంగంలోనూ తమదే హవా అని సాగించగలరా? కానీ విశాఖలో అది కృష్ణ, గుంటూరు జనాలకు సాధ్యమైంది. 

జల్లి కట్టు మీద తమిళనాడుకు, కావేరీ జలాల మీద కర్ణాటకకు సాధ్యమైన పోరు మనకు స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు సాధ్యం కాదు అని ఆంధ్రజ్యోతి ఆర్కే ప్రశ్నిస్తున్నారు. మన జనాలు మెతక అంటున్నారు. మన జనాలు మెతక కాదు. మంచితనం. ఎవరినైనా ఆదరించే స్వభావం. అందుకే విజయవాడ, గుంటూరు కాస్మాపాలిటన్ కాలేకపోయాయి. విశాఖపట్నం కాస్మాపాలిటన్ నగరమైంది. 

ఉక్కు పోరు..ఉక్కు పోరు అంటున్నారు. కానీ దానిని ఆరంభించింది ఎవరు? జనాలను ఉద్యమదిశగా నడిపించింది ఎవరు? తెన్నేటి విశ్వనాధం. ఆయనకు కానీ, ఆయన వారసులకు కానీ విశాఖలో వ్యాపారాలు లేవు. కోట్ల ఆస్తులు లేవు. భాట్టం శ్రీరామమూర్తి తరువాత విశాఖ నుంచి ఎంపీగా ఎన్నికైన లోకల్ నాయకుడు ఎవరు? సుబ్బరామిరెడ్డితో ప్రారంభమై, జనార్థనరెడ్డి, ఎంవివిఎస్ మూర్తి, పురంథ్రీశ్వరి, కంభంపాటి హరిబాబు ఎంవివి సత్యనారాయణ వరకు విశాఖ ఎంపీలు అంతా స్థానికేతరులే కదా? పరిస్థితి ఇలా మారుతూ వచ్చింది. 

కానీ అదే జగన్ తల్లి దగ్గరకు వచ్చేసరికి వైకాపా పుట్టిన తరువాత ఎంపీగా వైఎస్ జగన్ తల్లి పోటీకి దిగారు. దాంతో విశాఖను గుప్పిట్లో వుంచుకున్న వర్గం కిందా మీదా అయిపోయింది. అర్జెంట్ గా సోషల్ మీడియాలో నానా అబద్దాలు ప్రచారం చేసేసింది. అదిగో కడప గూండాలు వచ్చేసారు. ఇదిగో పులివెందుల జనాలు వచ్చేసారు. ఇక విశాఖ అగ్నిగుండమే. అంటూ జనాలను వీళ్లు భయభ్రాంతులను చేసారు. దాంతో జనం నిజమే అనుకుని జగన్ తల్లిని దూరం పెట్టారు. 

ఇలాంటి నేపథ్యంలో వైకాపా అధికారంలోకి వచ్చింది. విజయసాయిరెడ్డి విశాఖ మీద దృష్టి పెట్టారు. ఇన్నాళ్లుగా ఉత్తరాంధ్ర కేంద్రంగా వేలాది కోట్లకు పడగలెత్తిన వర్గం వ్యాపార మూలాల మీద దృష్టిపెట్టారు. ఆ వర్గం భూ దందాలు, మైనింగ్ దందాలు, ఇలా ఎక్కడ దందా వుంటే అక్కడ గురి పెట్టారు. మొత్తం వర్గం అంతా అతలాకుతలం అయిపోవడం మొదలైంది. 

అసలే అమరావతి స్వప్నం చెదిరిపోయేలా వుంది. ఇక విశాఖ కూడా చేజారిపోతే ఎలా అని విజయసాయి రెడ్డిని తరచు ఎక్కుపెడుతూ జనాలను వైకాపాకు, విజయసాయికి వ్యతిరేకంగా వార్తలు వండి వార్చడం మొదలుపెట్టింది. విశాఖలో ఓ వర్గం భూదందాలను బయటకు తీసినపుడల్లా, వైకాపా దౌర్జన్యాలు అంటూ  నానా యాగీ చేయడం మొదలుపెట్టింది. 

ఇలాంటి నేపథ్యంలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కార్పొరేషన్ కూడా చేజారిపోతే, ఇక విశాఖలో ఆ వర్గం పరిస్థితి మరీ నీరసించిపోతుంది. ఇలాంటి టైమ్ లో విశాఖ ఉక్కు వ్యవహారం అందివచ్చిన వరంగా మారింది. నిజానికి ఈ ఉక్కు ఆధారంగా వచ్చిన అనేక పరిశ్రమలు, వ్యాపారాలు కూడా మనవాళ్లవే. విశాఖ ఉక్కు రా మెటీరియల్ కొని విశాఖ ఉక్కుకే పోటీగా వ్యాపారాలు చేసేది కూడా మనవాళ్లే. 

అసలు విశాఖ ఉక్కు మీద సరైన క్లారిటీ లేదు, కేంద్రం ఏమంటోంది? విశాఖ ఉక్కు పక్కన, విశాఖ ఉక్కుకు ఖాళీగా వున్న స్థలాల్లో మరో ఉక్కు ఫ్యాక్టరీకి అవకాశం ఇస్తామని, అలా వచ్చే కొత్త ఉక్కు ఫ్యాక్టరీలో సగం వాటా విశాఖ ఉక్కుకే వుంటుందని అంటోంది. నిజానికి అదే నిజమైతే చాలా మంచిదే. ఎందుకు? ఒక స్టీల్ ప్లాంట్ పక్కన మరో స్టీల్ ప్లాంట్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు వున్న అభివృద్దికి, ఇప్పుడు వున్న వ్యాపార, ఉద్యోగ అవకాశాలకు డబుల్. 

అయితే ఇక్కడ రేకెత్తుతున్న కాదు, రేకెత్తిస్తున్న అనుమానాలు ఏమిటంటే అలా వచ్చిన కొత్త ఫ్యాక్టరీ మెల మెల్లగా విశాఖ ఉక్కును తన స్వాధీనంలోకి తీసేసుకుంటుంది అన్నది. విశాఖ ఉక్కుకే సగం వాటా వుండే కొత్త ఫ్యాక్టరీ విశాఖ ఉక్కును స్వాధీనం చేసేసుకుంటుంది అన్నది రేకెత్తిస్తున్న అనుమానం. సరే, దీని సాధ్యా సాధ్యాల సంగతి అలా వుంచితే, అసలు విశాఖ ఉక్కు మీద కేంద్రం ఆలోచన ఏమిటి అన్నది క్లారిటీగా తెలుసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించారా? కేవలం పార్లమెంట్ లో ప్రశ్నలకు సమాధానలే తప్ప, వేరే క్లారిటీ వుందా?

అఖిల పక్షం వెళ్లి,అసలు కేంద్రం ఆలోచన ఏమిటి? విశాఖ ఉక్కును పూర్తిగా డిజిన్వెస్ట్ మెంట్ చేయాలనుకుంటోందా? లేదా పక్కన భూముల్లో మరో ప్లాంట్ కు అవకాశం ఇవ్వాలనుకుంటోందా? అసలు ప్రభుత్వ రంగ సంస్థకు ప్రభుత్వం గనులు ఎందుకు ఇన్నాళ్లుగా కేటాయించడం లేదు అన్నది తేల్చుకుని రావచ్చు కదా? పోనీ జగన్ కలిసి రారు అనుకుందాం. చంద్రబాబే చొరవ తీసుకుని కమ్యూనిస్టులను తోడు తీసుకుని ఢిల్లీ వెళ్లి నిజా నిజాలు తెలుసుకుని రావచ్చు కదా?

అలా తెలుసుకుని వచ్చి అప్పుడు 'ఇదిగో జరుగుతున్నది ఇది. దీనిపై పోరాడదాం రండి' అని పిలుపు ఇవ్వొచ్చు కదా? అలా చేయకుండా, మోడీ, కేంద్రం అనే రెండు పదాలు వాడకుండా కేవలం జగన్ అమ్మేస్తున్నారు అనే ప్రచారం సాగించడం వెనుక వైనమేమిటి? విశాఖ జింక్ ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే అమ్మేసిందా? ఆంధ్ర భ్యాంకును కేంధ్రం విలీనం చేసిందా? చంద్రబాబు లేదా జగన్ విలీనం చేసారా? చంద్రబాబు హెరిటేజ్ స్టోర్స్ ల్లో వాటాలను వేరే వాళ్లు అమ్మేసారా? బాబుగారు అమ్మేసారా? 

కేవలం విశాఖ ఉక్కును అడ్డం పెట్టుకుని విశాఖ మేయర్ స్థానాన్ని గెల్చుకోవాలన్నది తెలుగుదేశం అండ్ కో ఆలోచన. దానికి అనుగుణంగానే ఇన్నాళ్లు వార్తలు వండి వారుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా, నేరుగా వైకాపాను ఓడించండి అంటూ పిలుపే ఇచ్చేసారు. ఆ పిలుపు కూడా ఎలా ఇచ్చారు?  కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైకాపా  గెలిస్తే ఇక అమరావతిని మరిచిపోవచ్చు. విశాఖలో వైకాపా గెలిస్తే ఇక విశాఖ ఉక్కును మరిచిపోవచ్చు అంటూ సెంటిమెంట్ ను అద్దకం పెట్టి మరీ పిలుపు ఇస్తున్నారు. మరీ ఇలా పిలుపు ఇస్తే జనం ఏమనుకుంటారో అని చావు తెలివితేటలు జోడించారు. ఎలా అంటే...విశాఖ లో వైకాపాను ఓడిస్తే, చురుకుపుట్టి కేంద్రాన్ని ఢీకొట్టి ఉక్కును కాపాడుతుంది అని ముక్తాయించడం ద్వారా?

ఈ  తరం జనాలు బాగా తెలివితేటలు నేర్చుకుంటున్నారు. జనాలను రెచ్చగొట్టి వైకాపాను ఓడించాలనే ఇలాంటి రాతలు, మోడీని ఢీకొడితే జగన్ పనయిపోతుందిగా అనే ఆలోచనలు పసిగట్టిలేనంత అమాయకులు కాదు. ఆర్కే తీసిన లాజిక్ తెలుగుదేశానికి వర్తించదా? తెలుగుదేశాన్ని విశాఖలో ఓడిస్తే మరింత పట్టుదలగా విశాఖ ఉక్కు ఉద్యమం సాగిస్తుంది అని కూడా రాయవచ్చు కదా? ఒక్క లేఖ రాయడానికి సవాలక్ష ముహుర్తాలు చూసి, ఎన్నికలు వచ్చిన తరుణంలో ఇక తప్పదని లేఖ రాసినది ఎవరు? చంద్రబాబు కదా? మరి చురుకు పుట్టించాల్సింది? ఎవరికి? ఆయనకు కాదా? 

ఇంత ఎందుకు ఆర్కే మాటల్లోనే..ఆయన రాసిందే ఒక్క మాట చెప్తే చాలు...అదేమిటంటే...''...మొత్తమ్మీద రాజకీయ రంగస్థలం పైన ఎవరి ఆట వారు ఆడుతున్నారు. ...'' అవును ఆయన రాసిన ఈ మాట మాత్రం అక్షర సత్యం. కానీ దీనికి మరో వాక్యం జోడించాలి. మీడియా కూడా ఆ ఆటలో భాగస్వామ్యం తీసుకుంది అన్నదే ఆ వాక్యం. ఆ భాగస్వామ్యంలో భాగంగానే విశాఖ ఉక్కు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని విశాఖ కార్పొరేషన్ ను తెలుగుదేశం ఖాతాలో వేసి, విశాఖ అడ్డాపై తమ వర్గం ఆధిపత్యం చేజారకుండా చేసే ప్రయత్నం తప్ప వేరు కాదు. అందుకోసమే మీడియాకు వున్న నియంత్రణ రేఖ దాటి మరీ వైకాపాను ఓడించండి అంటూ పిలుపు ఇవ్వడం. 

-ఆర్వీ

తెలంగాణలో రాజన్న రాజ్యం

ఇది చాలా కష్టం మోహన్ బాబూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?