cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కేసీఆర్ ముంగిట మరో ఉప ఎన్నిక ...!

కేసీఆర్ ముంగిట మరో ఉప ఎన్నిక ...!

మొన్ననే జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ కురువృద్ధుడు కుందూరు జానా రెడ్డి మరోసారి ఓడిపోయారు. చివరకు ఈ ఓటమి ఆయన రాజకీయ సన్యాసానికి దారితీసింది. 

ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పేశాడు. ఒకవేళ అధిష్టానం బలవంతపెడితే ఆలోచిస్తానన్నాడు. వాస్తవానికి తెలంగాణలో నాగార్జున సాగరే చివరి ఎన్నిక అనుకున్నారు. జరగరానిది జరిగితే తప్ప ఇక ఎన్నికలు ఉండవని భావించారు. 

కానీ అవినీతి ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఆయన తన నియోజకవర్గంలోని హుజూరాబాద్ లో నాయకులతో, ప్రజలతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 

ఈటల రాజేందర్ ను ప్రభుత్వం ఎప్పుడైతే భూకబ్జా దారుడని తేల్చిందో ఆ మరుక్షణమే కాంగ్రెస్, బీజేపీ ఆయన్ను తమ పార్టీల్లోకి లాగాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆయన అవినీతిపరుడని ప్రభుత్వం చెబుతోందికాని కోర్టు తేల్చలేదు.

కానీ ఈటలను ఆయుధంగా చేసుకొని కేసీఆర్ మీద దాడి చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈటల అవినీతిపరుడా, కాదా అనేది  చెప్పలేం. కానీ సౌమ్యుడిగా పేరుంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోడు. 

జాతీయ స్థాయిలో, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి దారుణంగా ఉన్న సంగతి ఈటలకు తెలుసు. ఇలా ఉన్న పార్టీల్లో ఆయన చేరకపోవచ్చు. ఆ పార్టీల్లో చేరితే ఈటలకు రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చు.

కాంగ్రెస్ లోగానీ, బీజేపీలోగానీ చేరవద్దని, సొంతంగా పార్టీ పెట్టాలని ఈటల అభిమానులు, బీసీ సంఘాలవారు కోరుతున్నారు. ఈటల బహుజన రాజ్యం అనే పేరుతో పార్టీ పెట్టబోతున్నాడని గతంలో సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. కొంతకాలం తరువాత అది మరుగున పడిపోయింది. 

ఒకవేళ ఈటల వేరే ఏ పార్టీలో చేరకుండా తానే సొంతంగా కేసీఆర్ తో, టీఆర్ఎస్ తో ఫైట్ చెయ్యాలనుకుంటే సొంతంగా పార్టీ పెడతాడు. దానికి బహుజనరాజ్యం అని పేరు పెడతాడో, మరో పేరు పెడతాడో చెప్పలేం.

ప్రస్తుతం ఈటల కొన్ని వర్గాల్లో హీరోగా మారాడు. కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు వచ్చాడని నమ్ముతున్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పటికీ తనకింకా ప్రజాదరణ ఉందని ఈటల నిరూపించుకోవాలంటే అందుకు ఉప ఎన్నికలో పోటీ చేయడమే మార్గం. ఉప ఎన్నిక ఎలా వస్తుందంటే ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వస్తుంది. 

తాను చావునైనా భరిస్తానుగానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోనని ఈటల బహిరంగంగానే చెప్పాడు. కాబట్టి ఆయన రాజీనామా చేయడం గ్యారంటీ. ఆ నియోజకవర్గంలో ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలి కాబట్టి ఉప ఎన్నిక రావడం గ్యారంటీ. సో ... కేసీఆర్ ముంగిట మరో ఉప ఎన్నిక ఎదురు చూస్తోంది. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×