cloudfront

Advertisement


Home > Politics - Political News

ఏపీ అసెంబ్లీ.. రెండో రోజు.. వాడీవేడీ!

ఏపీ అసెంబ్లీ.. రెండో రోజు.. వాడీవేడీ!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు వాడీ వేడిని సంతరించుకున్నాయి. స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన అనంతరం సభ్యుల మాటల్లో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ ఎన్నికపై ప్రసంగిస్తూ, ఆయనను అభినందిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో గత ఐదేళ్ల పరిణామాలను, అప్పటి స్పీకర్ తీరును గుర్తుచేశారు.

గత ప్రభుత్వం శాసనసభను అత్యంత దారుణంగా నిర్వహించిందని, ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి అప్పటి అధికార పార్టీలోకి ఫిరాయించి ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యారని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా స్పీకర్ స్పందించలేదని, వారిపై అనర్హత వేటు వేయలేని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ అప్పటి స్పీకర్ సభను నిర్వహించారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని, ఫిరాయింపులకు చోటేలేదని, ఎవరైనా తమ పార్టీలోకి చేరాలని అనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. ఇక గత ఐదేళ్లలో శాసనసభలో చోటు చేసుకున్న ఇతర అంశాలను కూడా జగన్ గుర్తుచేశారు. ఆ అంశాలను తెలుగుదేశం పార్టీ సహజంగానే సహించలేకపోయింది. ముందుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తను వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదని చెప్పుకొచ్చారు. ఫిరాయింపుల అంశం గురించి స్పందించడానికి చంద్రబాబు నాయుడు అలా నిరాకరించారు.

అయితే ఆ తర్వాత  చంద్రబాబు మరోసారి మాట్లాడుతూ.. 'వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిన నాలుగోరోజే పార్టీ  మారారు..' అని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. 'ఆయన చేసిన తప్పుల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏదేదో ఏదేదో మాట్లాడుతున్నారు..' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఇక స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక అంశం గురించి తమకు సమాచారం ఇవ్వలేదంటూ తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చింది.

తాము గతంలో సమాచారం ఇచ్చామని, ఇప్పుడు వైఎస్సార్సీపీ తమకు సమాచారం ఇవ్వలేదని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుడు  సమాచారం ఇచ్చినమాట వాస్తవమే అని, సమాచారం మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు దాన్ని అంత గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఏమీకాదని, గత స్పీకర్ తీరు అందరికీ తెలిసిందే అని ఎద్దేవా చేశారు.

స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను చైర్ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా చంద్రబాబు నాయుడు ముందుక రాలేదని, ప్రతిపక్ష నేత స్పీకర్ వెంటరావడం సంప్రదాయం అని, ఒక బీసీ వ్యక్తి స్పీకర్ గా ఎన్నిక కావడంతో చంద్రబాబు నాయుడు ఆయన వెంట నడవడానికి ఇష్టపడటం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా రెండోరోజు వాదోపవాదాలతో సభ సాగుతోంది.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం