cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బీజేపీ ఇక కఠినంగానే ఉంటుందా?

బీజేపీ ఇక కఠినంగానే ఉంటుందా?

వాన రాకడ...ప్రాణం పోకడ తెలియదని ఓ సామెత ఉంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అర్థం. ఇది రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రాజకీయాల్లో శాశ్వతంగా మిత్రులు ఉండరు, శాశ్వతంగా శత్రువులూ ఉండరు. అంతా తాత్కాలికమే. అవసరాల మేరకు కలిసుంటారు. అవసరం తీరాక వెళ్లిపోతారు. రాజకీయ నాయకులు రకరకాల ప్రకటనలు చేస్తుంటారు. కాని వాటికే కమిటై ఉంటారని చెప్పలేం. 'అమ్మతోడు అడ్డంగా నరికేస్తా' అనే లీడర్లు కూడా అవసరం పడితే శత్రువును గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటారు.

ఏపీలో ఎన్నికలకు ముందు బీజేపీ-టీడీపీ మధ్య ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో చూశాం. రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చెట్టపట్టాలేసుకొని గెలిచి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం పంచుకున్నారు. బాబు-మోడీ...అద్భుతమైన జోడీ అని అప్పట్లో మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు యమ పొగిడేశారు. 'సాగినంతకాలము నాఅంతవారు లేరందురు' అన్నట్లుగా టీడీపీ-బీజేపీ పొత్తు నాలుగేళ్లపాటు బ్రహ్మాండంగా సాగింది. ఎన్నికలు మరో ఏడాది ఉన్నాయనగా చెడిపోయింది. రెండు పార్టీలు ఉప్పు, నిప్పు మాదిరిగా మారాయి. ప్రధానిపై బాబు రెచ్చిపోయారు. నోటికొచ్చింది మాట్లాడారు.

మోదీ రాష్ట్రానికి వస్తే స్వాగతం పలికేది లేదు పొమ్మన్నారు. ఈ రెండు పార్టీల మధ్య తగాదా ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. బీజేపీ మీద, మోదీ మీద రెచ్చిపోతే ప్రజలు సంతోషించి టీడీపీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని బాబు అనుకున్నారు. కాని ఏం జరిగిందో చూశాం కదా. జరిగిన దానికి మొన్న మొన్నటివరకు బాబు కుమిలిపోయారు. ఏ ఊరు వెళ్లినా, ఎవ్వరెదురైనా 'నేనేం తప్పు చేశాను... నన్నెందుకు ఓడించారు' అంటూ అవేదనతో ప్రశ్నించేవారు. ఈమధ్యనే కాస్తా ఆ బాధ నుంచి బయటపడినట్లుగా కనబడుతోంది. ఈ బాధ నుంచి బయటపడగానే ఆయనకు జ్ఞానోదయమైంది.

మరి బోధి వృక్షం కింద కూర్చున్నారో, ఇంకేదైనా చెట్టు కింద కూర్చున్నారో తెలియదుగాని బీజేపీతో తెగదెంపులు చేసుకొని పొరపాటు చేశానని పశ్చాత్తాపపడుతున్నారు. ఆయన మనసులోనే కుమిలిపోకుండా నేరుగా పార్టీ నాయకులతోనే చెప్పారు. పైకి ఆయన పశ్చాత్తాపడుతున్నట్లు కనబడుతున్నా అసలు విషయమేమిటంటే 'మళ్లీ కలుద్దాం' అని బీజేపీకి సంకేతాలు ఇచ్చారని అర్థం. ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచి బీజేపీని, ప్రత్యేకించి మోదీని పల్లెత్తు మాట అనడంలేదు. ఇరవైనాలుగ్గంటలూ జగన్‌ మీదే ఫోకస్‌ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి మోదీని గద్దె దింపాలని నానా పట్లు పడ్డ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తాను ఎలా గద్దె ఎక్కాలా? అని ఆలోచిస్తున్నారు.

బీజేపీతో తెగదెంపులు చేసుకున్నందుకు పశ్చాత్తాపపడటం అందులో భాగమే. ప్రస్తుతానికి దోస్తీ కోసం సంకేతాలు మాత్రమే ఇచ్చిన టీడీపీ అధినేత ముందు ముందు చేతల్లోకి దిగినా ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు తెలంగాణలో టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు వారిని ప్రలోభపెట్టి లాక్కున్నారంటూ కేసీఆర్‌ను బాబు నానా మాటలన్నారు. కాని ఏపీలో ఎన్నికలు ముగిసిన మరుక్షణం కీలక నేతలు కొందరు బీజేపీలో చేరిపోయినా గమ్మున ఉండిపోయారు. ఎన్నికల్లో షాక్‌ తగలగానే బీజేపీని వదులుకొని తాను తప్పు చేశాననే భావన బాబుకు కలిగివుండొచ్చు.

కాని వెంటనే అంటే బాగుండదు కదా. అందుకే కొంతకాలం గడిచాక ఇప్పుడు బయటపెట్టారు. సరే... బాబు సంగతి ఇలా ఉంటే, బీజేపీ ఏపీ ఇన్‌చార్జి సునీల్‌ ధియోధర్‌ మాత్రం టీడీపీనీ, బాబును దగ్గరకు రానిచ్చేది లేదని చాలా కఠినంగా చెప్పారు. 'టీడీపీకి తలుపులు మూసేశాం' అని స్పష్టం చేశారు. ఇది పార్టీ విధాన నిర్ణయమని కూడా అన్నారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా, ఇతర ముఖ్య నేతలతో చర్చించిన తరువాతే తాను ఈ విషయం చెబుతున్నానని అన్నారు. ధియోధర్‌ ఈ విషయంలో మోదీని, అమిత్‌ షాను కూడా కమిట్‌ చేయించేశాడన్నమాట.

ధియోధర్‌తో వాళ్లు ఏం చర్చించారనేది, ఏం నిర్ణయాలు తీసుకున్నారనేది ఎవరికీ తెలియదు. ఈయన మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు. వాస్తవానికి రాజకీయాల్లో కఠిన నిర్ణయాలు పనికిరావు. ఈ విషయం అనేకసార్లు రుజువైంది. కాంగ్రెసుతో తరతరాలుగా వైరం ఉన్న కమ్యూనిస్టు పార్టీలే ఒట్టు తీసి గట్టున పెట్టిన సందర్భాలున్నాయి. బద్ధ శత్రువు కాంగ్రెసుతో టీడీపీ పొత్తు పెట్టుకుంది కదా. అలా అనుకుంటే గతంలో బాబు బీజేపీని నానా మాటలని తరువాత దోస్తీ చేశారు కదా.

రాజకీయాల్లో స్నేహాలు, ప్రేమలు, శత్రుత్వాలు ఉండవు. కాబట్టి టీడీపీకి బీజేపీ తలుపులు మూసేసిందని దాని రాష్ట్ర ఇన్‌చార్జి చెప్పినంతమాత్రాన అదే ఫైనల్‌ అయ్యే అవకాశం లేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా. ఆలోగా ఏమైనా జరగొచ్చు. 

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్