Advertisement


Home > Politics - Political News
అతని కంటే ఘనులు ఆచంట మల్లన్నలు...!

తెలుగులో ఓ సామెత ఉంది. ఎవరైనా గొప్పలు చెప్పుకుంటే, గాలి మాటలతో తనను తాను పొగుడుకుంటే అలాంటివారిని 'అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న' అంటారు. ఒకరిని మించి మరొకరు గొప్పలు చెప్పుకుంటారు కాబట్టి వ్యంగ్యంగా ఈ సామెత వాడతారు. ఏపీలో పరిస్థితి ఇదే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గొప్పలు చెప్పుకోవడం అలవాటు.

గోరంత పనులు చేసి కొండంత చేశానని ప్రజలను నమ్మించడానికి తాపత్రయపడుతుంటారు. ముఖ్యమంత్రే ఓవరాక్షన్‌ చేస్తుంటే మంత్రల నోరు ఊరుకోదు కదా. 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అన్నట్లుగా  'కతలు' వినిపిస్తున్నారు. బాబు కుమారుడు కమ్‌ మంత్రి లోకేష్‌కు తండ్రి విద్య బాగానే ఒంటబట్టింది. త్వరగానే అందిపుచ్చుకున్నాడు. నోరు తెరిస్తే చాలు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకా లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెబుతుంటారు.

ఈమధ్య విశాఖ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ 2019 నాటికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఐటీలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్‌ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇదే లోకేష్‌ ఈమధ్యనే మాట్లాడుతూ హైదరాబాదులో ఉన్నన్ని సౌకర్యాలు విశాఖలో లేవు కాబట్టి పరిశ్రమలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం లేదన్నారు.

ఏపీకి ఆర్థిక రాజధాని అని చెప్పుకుంటున్న విశాఖలోనే పరిశ్రమలు, కంపెనీలు రాకపోతే మిగతా నగరాలకు ఏం వస్తాయి? లోకేష్‌ ఈ విధంగా చెబుతుంటే చంద్రబాబు వేల కోట్ల పెట్టబడులు పారుతున్నాయని ప్రచారం చేస్తుంటారు. కొన్నాళ్లు ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందంటారు. కొన్నాళ్లు అభివృద్ధి పనులకు డబ్బు లేదని, కేంద్రం నుంచి ఆశించినరీతిలో సాయం అందటంలేదని దీనంగా మాట్లాడతారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడూ ఇదే టైపులో మాట్లాడుతుంటారు. ఇదేం ధోరణో అర్థం కాదు.

పాలకులు అన్ని ఉద్యోగాలిచ్చాం, ఇన్ని ఉద్యోగాలిచ్చాం అని కాకి లెక్కలు చెప్పినప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుంటాయి. అవాస్తవాలు చెబుతున్నారని మండిపడతాయి. అయినా పాలకులు నదురుబెదురు లేకుండా అబద్దాలాడుతూనే ఉంటారు. ఉద్యోగాల కల్పన గురించి చేసే వాగ్దానాలన్నీ జనం చెవుల్లో పూలు పెట్టడమేనని అర్థం చేసుకోవాలి. ఏపీలో ఈ ప్రచారం విజయవంతంగా కొనసాగుతోంది.

లోకేష్‌ కొంతకాలం క్రితం 'అమరావతి ఐటీ హబ్‌గా మారబోతున్నది. రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తాం'.. అని తీపి కబురు మాదిరిగా చెప్పాడు. ఇప్పుడేమో రెండు లక్షలకు పెంచారు. ఈ ఐటీ మంత్రికి ఐటీ పరిశ్రమ  పరిస్థితి ఎలా ఉందో తెలియదా? దిగ్గజాలనదగ్గ ఐటీ కంపెనీల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగాలు ఢమాల్‌మంటుంటే ఈయన లక్షల ఉద్యోగాలిస్తామంటున్నారు. ఐటీ పరిశ్రమలో లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్ని ఐటీ కంపెనీలు పెట్టాలి? లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత సామర్థ్యమున్న ఐటీ కంపెనీలు రెండేళ్లలో అమరావతికి వస్తాయా?

ఇదివరకు కర్నూలుకు వెళ్లినప్పుడు తమ ప్రభుత్వం వచ్చాక  భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని,  కియా మోటార్స్‌ రాకతో ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన జనం ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్లు నిరూపించాలని నిలదీయడంతో బిత్తరపోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పరిశ్రమ ద్వారా ఐదు లక్షల ఇవ్వడం సాధ్యమేనా? లోకేష్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ చిన్న ఐటీ కంపెనీని ప్రారంభిస్తూ రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల ద్వారా ఆరు లక్షల ఉద్యోగాలు (నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే పని) ఇస్తామన్నారు. ఈ ఏడాది మే నెలలో ఓ కంపెనీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత నెల రోజుల్లోనే ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.

మరో సందర్భంలో మాట్లాడుతూ  2020 నాటికి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మాట మాట్లాడితే లక్షల ఉద్యోగాలంటూ ఏమాత్రం సిగ్గు పడకుండా చెబుతున్నారు. ఈయన విషయం ఇలా ఉంటే తాజాగా మరో ఆచంట మల్లన్న అయిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మరింత చెలరేగిపోయాడు. గత మూడేళ్లలో రాష్ట్రానికి లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, దీంతో 3.61 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఓ ప్రకటన విడుదల చేశాడు. ఒక్క ప్రభుత్వ రంగంలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చారట...! రాష్ట్రంలో నిరుద్యోగమనేది లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పాడు. కోట్ల పెట్టుబడులకు, లక్షల ఉద్యోగాలకు ఆధారాలున్నాయా? ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో ప్రజలు ఎవరికి వారు నిర్ణయించుకోవల్సిందే.