Advertisement

Advertisement


Home > Politics - Political News

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏపీకి గుణపాఠం అవుతాయా..?

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏపీకి గుణపాఠం అవుతాయా..?

తెలంగాణలో పేరుకే కొత్త జిల్లాలు, కానీ పనులన్నీ ఉమ్మడి జిల్లాల పేరు మీదే జరుగుతుంటాయి. కొత్త జిల్లాల కోసం కలెక్టరేట్లు ఏర్పాటైనా.. అక్కడ కొత్తగా ఒరిగిందేమీ లేదు. చిన్న జిల్లాల పేరుతో ప్రజలు చికాకు పడుతున్నారు కానీ ఉపయోగం లేదనే విమర్శలున్నాయి. మరి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి..? ఏపీలో జిల్లాల విభజన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని ఎలా అధిగమిస్తారు?

జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన ఇటీవల తెలంగాణలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. సీనియర్లంతా పట్టణాలను కోరుకున్నారు, జూనియర్లు పల్లెటూళ్లు ఎక్కువగా ఉన్న కొత్త జిల్లాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సమతుల్యం దెబ్బతిన్నది. జూనియర్లకు కొత్త జిల్లాలే దిక్కయ్యాయి. 

జిల్లాలవారీగా భర్తీ చేసే పోస్టుల విషయంలో నిరుద్యోగులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం కూడా ఉంది. సీనియర్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కొత్త నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య భారీగా ఉంటుంది. జూనియర్లు ఎక్కువగా ఉన్న కొత్త జిల్లాల్లో నోటిఫికేషన్లు వేస్తే అరకొర ఖాళీలే ఉంటాయి. అక్కడ పదవీ విరమణ బ్యాచ్ తక్కువ కాబట్టి ఉద్యోగ ఖాళీలు ఇప్పుడల్లా ఉండవు. అంటే నిరుద్యోగులకు కొన్నాళ్లు కష్టాలే. సరిగ్గా వయోపరిమితికి దగ్గరగా ఉన్న వాళ్లకి సమస్య మరీ ఎక్కువ.

కనీసం ఏపీ అయినా 25 లోక్ సభ నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేసి 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలో ముందు 31 అనుకున్న జిల్లాలు ఆ తర్వాత 33కి పెరిగాయి. అంటే చిన్న చిన్న జిల్లాలు ఎక్కువయ్యాయి. ఆ మేరకు పరిపాలనా సౌలభ్యం, దాని తాలూకు ఫలితాలు ప్రజలకు అందాయా అంటే అదీ లేదు. కొత్త పోస్టులు భర్తీ చేయక, సగం కలెక్టరేట్లు అరకొర స్టాఫ్ తో నెట్టుకొస్తున్నాయి.

ఏపీ సంగతేంటి..?

తెలంగాణ చేసిన తప్పులన్నీ ఏపీ ముందే గ్రహించాలి. జిల్లాలను విభజించడంతో సరిపెట్టకుండా దాని వల్ల కలిగిన ఫలితాలు ఇవీ అని జనానికి చెప్పగలగాలి. అలా చేయగలిగితేనే 2024లో జిల్లాల విభజన అనే అంశం వైసీపీ ఓటు బ్యాంకుని పెంచుతుంది. 

ఒకవేళ కొత్త జిల్లాలు సమస్యల్ని సృష్టిస్తే మాత్రం జగన్ చేసిన ఈ ప్రయత్నం మొదటికే మోసం తెస్తుంది. అందుకే విభజన సమయం నుంచే కొత్త జిల్లాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. కార్యాలయాలకు తగ్గట్టు ఉద్యోగ నియామకాలు చేపట్టి ప్రజలకు చేరువ అవ్వాలి.

నిధుల సంగతేంటి..?

తెలంగాణ లాంటి సంపన్న రాష్ట్రంలోనే కొత్త జిల్లాలకు నిధులు కేటాయిస్తే, అవి అరకొరగా మాత్రమే సరిపోయాయి. ఇంకా చెప్పాలంటే కొత్త జిల్లాలకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఆంధ్రప్రదేశ్ సంగతేంటి? అసలే ఆర్థిక కష్టాలు, అప్పుల భారం. 

ఇలాంటి టైమ్ లో కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన కోసం వేల కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా సమీకరిస్తుంది? నిధుల లేమితో కొత్త జిల్లాల్ని ప్రకటించి చేతులు దులుపుకుంటే మొదటికే మోసం వస్తుంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. మరి ఈ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి పరిష్కారంతో ముందుకొస్తారో చూడాలి.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?