cloudfront

Advertisement


Home > Politics - Political News

ఏపీలో టిక్కెట్ల పంపకాలు మొదలయ్యాయ్‌.?

ఏపీలో టిక్కెట్ల పంపకాలు మొదలయ్యాయ్‌.?

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే సీట్ల పంపకం మొదలైందట. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓ పది సీట్లు కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందట. ఆ పార్టీ గట్టిగా అడిగితే, ఇంకో ఐదు సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖత వ్యక్తం చేయబోతోందట. ఎంపీ సీట్ల విషయంలో మాత్రం 3 నుంచి 5 మధ్య చర్చలు జరుగుతున్నాయట.. బేరం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.! 

అసలేంటి కథ.? 2019 ఎన్నికలంటే, అవి ఏప్రిల్‌ - మే నెలల్లో జరుగుతాయి. అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయక్కడ. అప్పుడు తెలంగాణలోనూ లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయనుకోండి.. అది వేరే విషయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ - టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. ప్రజా కూటమిగా ఏర్పడ్డాయి. చేదు ఫలితం వచ్చినాసరే, కాంగ్రెస్‌ - టీడీపీ ఆ తర్వాత కూడా స్నేహ సంబంధాలు బాగానే కొనసాగిస్తోన్న విషయం విదితమే. 

అయినా, అప్పుడే ఈ సీట్ల పంపకం గోలేమిటి.? అంటూ కొందరు టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. కానీ, తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్‌ హిట్‌ అయ్యింది. అదే మోడల్‌ని ఫాలో అవుతున్నారట చంద్రబాబు. సీట్ల పంపకాన్ని ఇప్పుడే ఓ కొలిక్కి తెచ్చేస్తే, ఆయా నియోజకవర్గాలపై అభ్యర్థులూ ఫోకస్‌ పెడ్తారన్నది చంద్రబాబు 'దూరాలోచన'గా కన్పిస్తోంది. 

ఇదిలా వుంటే, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు ఏమంత సంతృప్తిగా లేరు. సిట్టింగ్‌ ఎంపీల విషయంలోనూ అదే పరిస్థితి. పలు దఫాలుగా గడచిన నాలుగేళ్ళలో ర్యాంకుల్ని ప్రకటిస్తూ.. నేతల్ని హెచ్చరిస్తూ వచ్చిన చంద్రబాబు, ఇటీవల తాజాగా ఓ సర్వే చేయించారట. ఆ సర్వే ఆధారంగానే నియోజకవర్గాలు - అభ్యర్థుల అంశంపై చూచాయిగా నేతలకు ఓ క్లారిటీ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. 

'20 ఎంపీ సీట్లు గెలుస్తాం.. 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటుతాం..' అంటూ టీడీపీ ముఖ్య నేతలు కొందరు పదే పదే చెబుతుండడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. చాలా సర్వేల్లో టీడీపీ 4 స్థానాలకే పరిమితమవుతుందని తేలింది. మరోపక్క, 25 ఎంపీ సీట్లలో గెలిచి, కేంద్రాన్ని శాసిద్దాం.. ప్రధాని అభ్యర్థి ఎవరో మనమే నిర్ణయిద్దాం.. అని నిన్న మొన్నటిదాకా చెప్పిన చంద్రబాబు, 'రాహుల్‌గాంధీనే ప్రధాని అభ్యర్థి' అనే నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేశారు. దాంతో, ఈ 'పంపకాల' వ్యవహారం నిజమేనని అంతా అనుకోవాల్సి వస్తోంది.