Advertisement

Advertisement


Home > Politics - Political News

నా అర్హ‌త ఇంట‌ర్మీడియ‌టే...నేను దాచ‌లేదు!

నా అర్హ‌త ఇంట‌ర్మీడియ‌టే...నేను దాచ‌లేదు!

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మీడియా ముందుకొచ్చారు. త‌న‌పై ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేయ‌డంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగ ప‌దోన్న‌తి కోసం బీకాం చ‌దివిన‌ట్టు ఫోర్జ‌రీకి పాల్ప‌డిన‌ట్టు త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అలాగే ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో డిగ్రీ చ‌దివిన‌ట్టు త‌ప్పుడు స‌మాచారాన్ని పొందుప‌రిచిన‌ట్టు ఓ మీడియా ప్ర‌చారం చేయ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌న‌ది ఇంటర్మీడియ‌ట్ అర్హ‌త‌గా ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పేర్కొన్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాను ఎక్క‌డా త‌ప్పుడు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న‌పై ఇదే ర‌క‌మైన అభియోగాల్ని స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో భాగంగా ఉద్యోగ స‌హ‌చ‌రుడైన సూర్య‌నారాయ‌ణ ప‌నిగట్టుకుని చేయించార‌ని ఆరోపించారు. అప్ప‌ట్లో ఈ విష‌య‌మై స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో, ఆ త‌ర్వాత కాలంలో మీడియాలో ఎక్క‌డా ప్ర‌చారం కాలేదన్నారు.

ప్ర‌స్తుతం తాను టీడీపీలో కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప‌నిగ‌ట్టుకుని కేసుల పేరుతో వేటాడుతోంద‌ని ఆయ‌న వాపోయారు. ఇది ముమ్మాటికీ త‌న‌పై ప్ర‌భుత్వం క‌క్ష‌పూరిత చ‌ర్య‌ల‌కే దిగ‌డ‌మే అని ఆయ‌న ఆరోపించారు. నిజానికి ఇది సీఐడీతో విచారించాల్సిన కేసే కాద‌న్నారు. సీఐడీతో కాకుంటే, సీబీఐతో విచార‌ణ చేయించుకున్నా తాను భ‌య‌ప‌డ‌న‌ని అశోక్‌బాబు తేల్చి చెప్పారు. త‌న‌కు పార్టీ అండ‌గా ఉంద‌ని ఆయ‌న అన్నారు.

త‌న‌పై కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్న సూర్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం పీఆర్సీ సాధ‌న క‌మిటీలో ఉన్నార‌న్నారు. ఇలాంటి నాయ‌కుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌ని సూర్య‌నారాయ‌ణ గుర్తించుకోవాల‌ని కోరారు. ప్ర‌భుత్వాలు మారుతుంటాయ‌ని, తాము వ‌స్తే ఆయ‌న‌పై కూడా ఇలా చేస్తే ఎలా వుంటుందో ఒక్క‌సారి ఆలోచించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. 

సూర్య‌నారాయ‌ణ డిపార్ట్‌మెంట్ ప‌రీక్ష పాస్ కాలేక‌, అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో ఉత్తీర్ణత సాధించి స‌స్పెండ్ అయ్యార‌నే విష‌యం చాలా మందికి తెలియ‌ద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ తానెప్పుడూ అత‌ని గురించి మాట్లాడ‌లేద‌న్నారు. కానీ రిటైర్డ్ అయిన మూడేళ్ల త‌ర్వాత క్లోజ్ అయిన కేసును తిరిగి వెలికితీయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని పార్టీ శ్రేణుల‌కు చెప్పేందుకే మీడియా ముందుకొచ్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?