cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

విష్ణుపై దాడి.. నిజ‌మ‌వుతున్న‌ అనుమానాలు!

విష్ణుపై దాడి.. నిజ‌మ‌వుతున్న‌ అనుమానాలు!

ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై రెండు రోజుల క్రితం ఏబీఎన్ చాన‌ల్ డిబేట్‌లో అమ‌రావ‌తి జేఏసీ నేత కొలిక‌పూడి శ్రీ‌నివాస్‌రావు చేసిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముఖ్యంగా మీడియాలో దిగ‌జారుతున్న విలువ‌ల‌పై ప్ర‌జాస్వామిక‌వాదులు, జ‌ర్న‌లిస్టులు, ఆలోచనాపరులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

అయితే విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై ఓ ప‌థ‌కం ప్ర‌కార‌మే దాడి జ‌రిగింద‌నే అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ అనుమానాల‌కు ఏబీఎన్-ఆంధ్ర‌జ్యోతి వ్య‌వ‌హార శైలి మ‌రింత బ‌లం క‌లిగిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

"బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై దాడి ఎంతో బాధ క‌లిగించింది. విష్ణుపై దాడికి పాల్ప‌డ్డ డాక్టర్  కొలిక‌పూడి శ్రీ‌నివాస్‌రావు ఇక మీద‌ట నా డిబేట్‌లో క‌నిపించ‌డు. ఆయ‌న్ను నా డిబేట్ నుంచి శాశ్వ‌తంగా బ‌హిష్క‌రిస్తున్నా" అని ఏబీఎన్ డిబేట్ స‌మ‌న్వ‌య‌క‌ర్త  వెంక‌ట‌కృష్ణ ప్ర‌క‌టించారు. క‌నీసం త‌న మాట‌ను 24 గంట‌లు కూడా వెంక‌టకృష్ణ నిల‌బెట్టుకో లేక‌పోవ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

నిన్న సాయంత్రం 7.05 గంట‌ల‌కు ఇదే వెంక‌ట‌కృష్ణ డాక్ట‌ర్  కొలిక‌పూడి శ్రీ‌నివాస్‌రావుతో ప్ర‌త్యేక లైవ్ షో న‌డ‌ప‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పైగా ఈ వివాదానికి ముగింపు ప‌లుకుతార‌ని అంద‌రూ ఆశించారు. అలా కాకుండా, పుండు మీద కారం చ‌ల్లిన చందంగా, విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై దాడి ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో శ్రీ‌నివాస్‌రావుతో చెప్పించడం గ‌మ‌నార్హం. నిన్న జ‌రిగిన దాడిపై మీ స్పంద‌న ఏంటి? అని వెంక‌ట‌కృష్ణ ప్ర‌శ్న‌కు శ్రీ‌నివాస్‌రావు ఏం చెప్పారంటే...

"బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డితో నాకు గతంలో పరిచయం లేదు. నేను ఎవరో తెలియకుండానే పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అన్నారు. న‌న్ను టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అంటూ మాట్లాడారు. అమరావతి ఉద్యమంలో పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అనే పదం దుర్మార్గమైంది. ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అన్నారు. క్షణికావేశంలో విష్ణువర్థన్‌రెడ్డి పట్ల అలా ప్రవర్తించాను. ఏడాది కాలంగా విష్ణు చేసిన వ్యాఖ్యలు నా మనసులో ఉన్నాయి. రైతుల త్యాగాలను అవహేళన చేస్తూ మాట్లాడకూడదు"  అని హెచ్చ‌రించారు.

విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డితో త‌న‌కు ప‌రిచ‌యం లేదంటూనే, ఆయ‌న ఏడాదిగా అమ‌రావ‌తి రైతుల‌పై చేస్తున్న కామెంట్స్ త‌న మ‌న‌సులో ఉన్నాయ‌ని తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హ ప‌ర్య‌వ‌సాన‌మే నిన్న‌టి దాడికి ప్రేరేపించాయ‌ని శ్రీ‌నివాస‌రావు స్ప‌ష్టత ఇచ్చారు. దాడి జ‌రిగిన రోజు శ్రీ‌నివాస‌రావును బ‌య‌టికి పంప‌డం వ‌ల్ల ఆయ‌న‌కు వివ‌ర‌ణ ఇచ్చుకునే అవ‌కాశం లేద‌ని వెంక‌ట‌కృష్ణ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. 

అలాగే ఈ దాడి వెనుక టీడీపీ, ఏబీఎన్ లేవ‌ని శ్రీ‌నివాస‌రావుతో చెప్పించ‌డ‌మే ప్ర‌ధాన ఉద్దేశంగా క‌నిపించింది. అంతే త‌ప్ప‌, బాధితుడైన విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డికి క్ష‌మాప‌ణ చెప్పించాల‌న్న ఆలోచ‌న వెంక‌ట‌కృష్ణ‌తో పాటు ఏబీఎన్ యాజ‌మాన్యంలో కొర‌వ‌డింది. పైగా ఎప్పుడూ లేనంత ఆనందం వెంక‌ట‌కృష్ణ‌లో నిన్న‌టి శ్రీ‌నివాస‌రావు డిబేట్‌లో క‌నిపించింద‌నే అభిప్రాయాలు లేక‌పోలేదు.

శ్రీ‌నివాస‌రావుతో విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేయ‌డానికి బ‌దులు, స్పంద‌న అడ‌గ‌డంలోనే ఏబీఎన్‌, వెంక‌ట‌కృష్ణ దురుద్దేశాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అలాగే అమ‌రావ‌తి ఉద్య‌మంపై విమ‌ర్శ‌లు చేసేవాళ్ల‌పై భౌతిక‌దాడుల‌ను ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ ప్రోత్స‌హిస్తున్నాయ‌నేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ చెప్పుకుందాం. 

ఈ రోజు ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌లో "రాజ‌ధాని రైతుల‌ను తిడితే భౌతిక‌దాడులే"  శీర్షిక‌తో ఓ వార్త‌ను గ‌మ‌నించొచ్చు. ఈ వార్త విష్ణుపై దాడి స‌రైందే అని అమ‌రావ‌తి ద‌ళిత జేఏసీ రూపంలో ఆంధ్ర‌జ్యోతి చెప్ప‌క‌నే చెప్పింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ వార్త చ‌దివిన వారెవ‌రికైనా ఇదే అభిప్రాయం క‌లుగుతుంది. తుళ్లూరులో రైతుల ఆందోళ‌న‌ను ఉద్దేశించి  రాజ‌ధాని ద‌ళిత జేఏసీ కన్వీన‌ర్ గ‌డ్డం మార్టిన్ మాట్లాడుతూ చేసిన హెచ్చ‌రిక‌కు ఆంధ్ర‌జ్యోతి ప్రాధాన్యం ఇవ్వ‌డం వెనుక కుట్ర‌పూరిత ఆలోచ‌న‌లు ప్ర‌తిబింబించాయి. ఆయ‌న ఏమ‌న్నారంటే...

"రాజ‌ధాని అమ‌రావ‌తిని, ఇక్క‌డి రైతులు, రైతు కూలీలు, మ‌హిళ‌ల గురించి ఎవ‌రైనా త‌ప్పుగా మాట్లాడితే భౌతిక దాడుల‌కు దిగుతాం. బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ద‌ళిత జేఏసీ నాయ‌కుడు కొలిక‌పూడి శ్రీ‌నివాస్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి రైతుల గురించి, వారి త్యాగాల గురించి అవ‌హేళ‌న‌గా మాట్లాడితే ఎంతటి వారైనా ఉపేక్షించం" అని గ‌డ్డం మార్టిన్ హెచ్చ‌రించారు.

ఒక్క‌సారిగా గ‌డ్డం మార్టిన్ ఆంధ్ర‌జ్యోతి తెర‌పైకి రావ‌డం యాదృశ్చికం కాదు. బాధితుడైన విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి వాయిస్‌ను కాకుండా, దాడుల‌కు తెగ‌బ‌డ్డ వారి వాద‌న‌ను బ‌లంగా వినిపించాల‌ని ఆంధ్ర‌జ్యోతి త‌హ‌త‌హ‌లాడ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని బీజేపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి. 

విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై దాడి చేసింది శ్రీ‌నివాస‌రావు కావ‌చ్చు, కానీ కొట్టించడం వెనుక అదృశ్య శ‌క్తులున్నాయ‌ని బీజేపీ నేత‌ల‌తో పాటు సామాన్య జ‌నం కూడా న‌మ్ముతున్నారు. వారి వాద‌న‌ను ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ నెత్తికెత్తుకుని మోస్తున్న‌దంటే, ఆ దుష్ట‌శ‌క్తులు, కుయుక్తులు ఎవ‌రివో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. 

చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి

నా సినిమాల బడ్జెట్స్ అందుకే పెరుగుతాయి

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×