Advertisement


Home > Politics - Political News
అయ్యోపాపం.. రోజా మళ్ళీ బుక్కయిపోయె.!

గడచిన మూడేళ్ళలో బహుశా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని కూడా అధికారపక్షం కాస్తో కూస్తో లైట్‌ తీసుకుందేమోగానీ, వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే రోజాని మాత్రం చాలాచాలా సీరియస్‌గా తీసుకుంది. ఎంతలా.? అంటే, రోజా ఏ చిన్న విషయంలో దొరికినా, వదలడంలేదు.. అడ్డంగా బుక్‌ చేసి పారేస్తున్నారు.

అసెంబ్లీ సాక్షిగా, 'నీ... పాతేస్తా..' అంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నోరు పారేసుకున్నా పట్టించుకోలేదుగానీ, రోజా అనుచితంగా వ్యవహరించారంటూ ఏడాదిపాటు ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసి పారేశారు. మహిళా లోకాన్ని ఉద్ధరించేస్తామంటూ అంతర్జాతీయ స్థాయిలో మొన్నామధ్య 'ఈవెంట్‌' నిర్వహించిన చంద్రబాబు సర్కార్‌, ఆ కార్యక్రమానికి రోజా రాకుండా అడ్డుకున్న విషయం విదితమే.

తాజాగా, చంద్రబాబు సర్కార్‌ మరోమారు, రోజాపై కన్నెర్రజేసింది. ఈసారీ అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన 'గలాటా'నే కారణం. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి వెళ్ళిన రోజా, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై సంచలన ఆరోపణలు చేశారు. టీడీఎల్పీలో జరిగిన మాక్‌ పోలింగ్‌కి స్పీకర్‌ హాజరు కావడాన్ని ప్రశ్నించారామె. స్పీకర్‌ పార్టీలకతీతంగా వ్యవహరించాలి గనుక, రోజా అలా స్పందించడం నిజానికి తప్పేమీ కాదు. 

అయితే, ఈ వ్యవహారంలో రోజా అత్యుత్సాహం ప్రదర్శించారనీ, అసలు తాను టీడీఎల్పీకి వెళ్ళనే లేదని స్పీకర్‌ కోడెల చెబుతుండడం గమనార్హం. ఇంతకీ, రోజా ఆరోపణలు నిజమా.? స్పీకర్‌ చెప్పింది నిజమా.? ఏమోగానీ, అసెంబ్లీ అధికారులు విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్ళడంతో, రోజా నుంచి వివరణ కోరాలని స్పీకర్‌ ఆదేశాలు జారీ చేసేశారు. ఇకనేం, నోటీసులు జారీ అయిపోయాయి రోజాకి అసెంబ్లీ అధికారుల నుంచి.

అసెంబ్లీలో సస్పెన్షన్‌ ముగిసినా, రోజా మెడ మీద 'సస్పెన్షన్‌' కత్తి ఇంకా వేలాడుతూనే వుంది. ప్రివిలేజ్‌ కమిటీ నివేదిక ఇవ్వడం, ఇంకొన్నాళ్ళు సస్పెండ్‌ చేసే దిశగా 'వేటు' ప్రతిపాదనలు.. ఈ తతంగం ఇలా వుండగానే, తాజా వివాదం రోజాని మరోమారు అడ్డంగా బుక్‌ చేసేసిందనే చెప్పాలి. ఏమన్నా చేసుకోండి, నేను మాట్లాడకుండా ఎవరూ ఆపలేరని, తన గొంతు నొక్కేయాలని ఎవరు ప్రయత్నించినా ఉపయోగం వుండదని అంటున్నారు రోజా.