Advertisement

Advertisement


Home > Politics - Political News

నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్న చంద్రబాబు

నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్న చంద్రబాబు

అభివృద్ధి అనేది చంద్రబాబుకి పూర్తిగా ఇష్టంలేని పదం. తాను చేయలేరు, ఎవరైనా చేస్తుంటే చూస్తూ ఉరుకోలేరు. ఐదేళ్ల తన పదవీ కాలంలో ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా వేయకుండా నిరుద్యోగుల్ని నిండా ముంచి, ఎన్నికల వేళ భృతి పేరుతో మరో మోసానికి తెరతీసి, వయోపరిమితి పెంపు పేరుతో మరో నీఛ రాజకీయం చేసి, ఓ తరాన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేసి నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుది. సీఎం జగన్ వరుస ఉద్యోగ నియామకాలతో యువతలో కొత్త ఆశలు చిగురింపచేస్తుండే సరికి బాబుకి ఎక్కడలేని ఉక్రోషం పుట్టుకొచ్చింది. అందుకే యువతని రెచ్చగొట్టే పని మొదలు పెట్టారు.

గ్రామ సచివాలయ పోస్ట్ లు అమ్ముడుపోయాయని, పేపర్ లీక్ అయిందని బురదజల్లుతున్నారు. బాబు నేరుగా  విమర్శలు చేస్తుంటే, ట్విట్టర్ బాబు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. ఇంతకీ పేపర్ ఎక్కడ లీక్ అయింది? ఎవరు చేశారు? లబ్ధిపొందింది ఎవరనే విషయాలు మాత్రం చెప్పడంలేదు. కనీసం ఆరోపణలు చేసేటప్పుడు ఒకటీ అరా ఆధారాలుండాలి. ఏవీ లేకుండానే బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారు బాబు. దీనికి అతడి మీడియా వత్తాసు పలుకుతోంది.

అయినా ఇక్కడ అంతా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. పరీక్ష అయిన తర్వాత పేపర్ లీకేజీ వార్తలొస్తాయి. ఫలితాల విడుదల తర్వాతైనా లీక్ అంటూ వార్తలు వస్తాయి. కానీ మెరిట్ లిస్ట్ పెట్టే ముందు మాత్రమే ఇలాంటి వార్తలు రావడానికి కారణం ఏంటి? అది కూడా బాబుకు కొమ్ముకాసే పత్రికలోనే ఇలాంటి వార్తలు రావడానికి కారణం ఏంటి? కేవలం జగన్ సర్కార్ పై బురదజల్లడానికి, లక్షలాది మంది నిరుద్యోగుల కష్టాన్ని నీరుగార్చడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే విషయం ఇక్కడే స్పష్టమౌతోంది.

గ్రామ సచివాలయ ఉద్యోగాలు భారీ కాంపిటీషన్ మధ్య ముగిశాయి. లక్షా 26వేల ఉద్యోగాలకు 18లక్షల మందికి పైగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇలాంటి నీఛ ఆరోపణలతో మిగిలిన లక్షల మంది నిరుద్యోగుల మనసుల్లో ఓ విషబీజం నాటారు చంద్రబాబు. ఉద్యోగం దక్కని ప్రతి ఒక్కరూ పేపర్ లీక్ అయిందనే విష ప్రచారాన్ని నమ్మే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్(డీఎస్సీ) ద్వారా ఉపాధ్యాయ పోస్ట్ ల భర్తీ ఎంత పగడ్బందీగా జరుగుతుందో.. ఏపీపీఎస్సీ ద్వారా గ్రామ సచివాలయాల పోస్ట్ ల నియామక ప్రక్రియ కూడా అంతే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగింది. కీ విడుదల ద్వారా ఎవరికి ఎన్ని మార్కులొచ్చాయో పరీక్షలు రాసిన రోజే తెలిసిపోయాయి.

మరికొన్ని రోజుల్లో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతున్నారు. పైగా ప్రభుత్వంలో భాగస్వాములవుతున్నారు. దీన్ని చంద్రబాబు భరించలేకపోతున్నారు. అందుకే యువతని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలాంటి ఒకరిద్దరు స్పందిస్తే సరిపోదు, అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న పచ్చ బ్యాచ్ కి అధికారులు గట్టిగా సమాధానం చెప్పాలి. సీఎం జగన్ కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేస్తేనే యువతలోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉంటాయి. ఎందుకంటే ఇది లక్షలాది మంది యువతను ప్రభావితం చేసే తప్పుడు ఆరోపణ కాబట్టి.

సినిమా రివ్యూ: బందోబస్త్‌        సినిమా రివ్యూ: వాల్మీకి  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?