Advertisement


Home > Politics - Political News
కారు చూపించి ఓట్లడుగుతారు..!

ఎన్నికలు దగ్గరపడుతున్నాయన్న ఫీలింగ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భయం కలిగిస్తోందేమోననిపిస్తోంది. చాలా కాలంగా పరిపాలన గురించి మాట్లాడటం మానేశారు. రోజుల తరబడి ఆత్మస్తుతి, పరనింద తప్ప మరో పని లేనట్లుగా కనబడుతోంది. జగన్‌ సుదీర్ఘ పాదయాత్ర అప్రతిహతంగా సాగుతుండటం, ఎన్నికల తరుముకొస్తున్నాయనే భావన చంద్రబాబును నిలువనీయడంలేదు. ఏం చేసి ఓట్లు సంపాదించాలి?  ఏం చూపించి ఓట్లు అడగాలి? ఏం చెప్పి మభ్యపెట్టాలి?...ఎప్పుడూ ఇదే ధ్యాస.

ఆయన ధర్మపోరాట దీక్షలకు, ఇతర నిరసన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడంలో అధికారులు తలమునకలుగా ఉండటంతో పరిపాలన సాగుతోందా అనే అనుమానం కలుగుతోంది. అమరావతి, పోలవరం పనులు చూపించి ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమధ్యనే సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అమరావతికి రావడం, ఆయన సమక్షంలో సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని స్టార్టప్‌ ఏరియా భూములు వారికి అప్పగించడం జరిగిపోయింది.

ప్రతిపక్షాలు, మేధావులు దీన్ని పెద్ద స్కామ్‌ అంటుండగా, చంద్రబాబు ఇది చరిత్రాత్మకం అంటున్నారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టు (పోలవరం) డయాఫ్రంవాల్‌ను జాతికి అంకింతం చేశారు. అంటే ప్రాజెక్టు పునాదులను అంకింతం చేశారన్నమాట. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో 55 శాతం పూర్తయిందని చెప్పుకుంటున్నారు. 'పోలవరం నా కల. పూర్తిచేసి తీరుతా' అంటూ అది తానే సృష్టించినట్లు మాట్లాడుతున్నారు.

కాలువల పని 70 శాతం పూర్తి చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డిని చీకట్లోకి నెట్టేశారు. పోలవరం ప్రాజెక్టు చూసి ఆహా ఓహో అంటూ బాబు ఘనతను పొగిడేందుకు రోజూ పదమూడు బస్సుల్లో జనాన్ని తీసుకుపోతున్నారు. ఈ ప్రాజెక్టును చూపించి ఓట్లు అడుగుతున్నారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులను బ్యాచీలవారీగా సింగపూర్‌ పంపించి 'చూశారా...ఇలాంటి నగరమే నేను కడుతున్నది. అమరావతి ఇలాగే ఉంటుంది' అని వారిని మభ్యపెట్టారు.

ఓట్ల కోసమే సర్కారు సొమ్ముతో వారిని పంపారనడంలో సందేహం లేదు. అభివృద్ధి పనులు గొప్పగా జరుగుతుంటే జనం స్వచ్ఛందంగా వెళ్లి చూడాలిగాని ఇలా ప్రభుత్వమే తీసుకెళ్లడమేంటి? ఇదే చంద్రబాబు ప్రమోషన్‌ వర్క్‌. గతంలోని ముఖ్యమంత్రులూ గొప్ప పనులు చేసినా ప్రజలను తోలుకుపోయి చూపించివుండరు. నేను వేసిన రోడ్లు, నేను పెట్టిన లైట్లు అంటూ అవి సొంత ఖర్చుతో నిర్మించినట్లు మాట్లాడుతున్నారు. నా రోడ్లు, నా లైట్లు వాడుకుంటూ నాకు ఓట్లు వేయరా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇక చంద్రబాబు ఓట్లు అడిగేందుకు మరో అంశం ఎంచుకున్నారు. అదే కియ మోటార్స్‌ విదేశీ కంపెనీకి నీరాజనాలు పట్టిన సీఎం దాని మొదటి కారు కోసం ఎదురుచూస్తున్నారు. 2019 జనవరినాటికి కియ కారు బయటకు రావాలని బాబు కంపెనీ యాజమాన్యానికి గట్టిగా చెప్పారు. అంటే ఆ కారు చూపించి, దాన్ని తాను చేసిన అభివృద్ధిగా ఊదరగొట్టి ఓట్లు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే జనవరిలో కారు బయటకు రావాలంటున్నారు. 'నా వేగాన్ని కియ మోటార్స్‌ అందుకుంటోంది' అన్నారు బాబు. ఈయన వేగం ఏమిటో, అది అందుకోవడం ఏమిటో.